ETV Bharat / city

పోలవరం నిర్వాసితుల బతుకు దుర్భరం మూడొంతుల గ్రామాలు గోదావరి ముంపులోనే

author img

By

Published : Aug 14, 2022, 9:48 AM IST

పోలవరం
పోలవరం

polavaram వరద పరిస్థితులను పరిశీలించేందుకు ఏపీ ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు మండలం వేలేరుపాడుకు బుధవారం రాత్రి కేంద్ర బృందం వచ్చింది. తహశీల్దార్‌ కార్యాలయంలో వారు స్థానికులతో మాట్లాడారు. అక్కడున్న వారు జిల్లా కలెక్టర్‌ కాళ్లు పట్టుకుని తమకు ఇళ్లు కట్టి ఇచ్చెయ్యండి.. ఊరు వదిలిపోతాం.. ఈ కష్టాలు భరించలేమని ఎర్రబోరు గ్రామవాసులు బతిమిలాడారు. కేంద్ర బృందానికి అలాగే విన్నవించారు. మీ సమస్య ప్రభుత్వానికి విన్నవిస్తామని సర్దిచెప్పి వారు వెళ్లిపోయారు. ఇదీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి.

polavaram: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకు భూములు, ఊళ్లను త్యాగం చేసిన వేలాది నిర్వాసితులు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా గోదావరికి ముంచెత్తిన భారీ వరదలు తేల్చేశాయి. ప్రాజెక్టులో కనీసం నీటిని నిలబెట్టలేదు. స్పిల్‌వే 48 గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేసినా జలాశయంలో భారీగా నీళ్లు నిలుస్తున్నాయి. జులైలో వచ్చిన భారీ వరదలు పోలవరం తొలి, రెండో దశ, పునరావాసం అన్న తేడా లేకుండా అనేక గ్రామాలను ముంచేశాయి.

వేలాది నిర్వాసితులు కట్టుబట్టలతో తరలిపోవాల్సి వచ్చింది. ఇళ్లు కట్టి, పునరావాస ప్యాకేజి ఇచ్చి ఇతరత్రా సాయం అందించి 1,06,006 కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంది. వీరందరికీ పునరావాసం కోసం రూ.20వేల కోట్లు కావాలని, కేంద్రం ఇస్తే తప్ప తానేం చేయలేనని ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా నిస్సహాయత ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఏమిటీ తొలి, మలిదశలు: ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తున నీరు నిలబెడితే ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయనేది కాంటూరు సర్వేనుబట్టి లెక్కించి ప్రభుత్వం తొలి దశను నిర్ణయించింది. తొలి దశలో 115 ఆవాసాలు (54 రెవెన్యూ గ్రామాలు) 20,946 కుటుంబాలపై ప్రభావం పడుతుందని లెక్కించింది. పూర్తి నిల్వ 45.75 మీటర్లకు నిలబెడితే ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయనేది కూడా తేల్చింది.

ఇదీ కలిపితే 222 రెవెన్యూ గ్రామాలు (373 ఆవాసాలు), 1.06 లక్షల కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని లెక్కించింది. ఆ ప్రకారం పునరావాసానికి ప్రయత్నిస్తున్నా.. మూడేళ్లుగా పనులు అంతంతే జరిగాయి.

తాజా గోదావరి వరదల్లో ఏం తేలింది: గత నెల వానల సమయంలో భద్రాచలం వద్ద రెండో అతిపెద్ద వరద నమోదైంది. పోలవరం స్పిల్‌వే వద్ద 36.545 మీటర్లు, ఎగువ కాఫర్‌డ్యాం వద్ద 36.890 మీటర్ల గరిష్ఠ నీటిమట్టాలు రికార్డయ్యాయి. అలాగని పోలవరంలో నీళ్లు నిలబెట్టింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం రెండో దశ ముంపు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. తమది రెండో దశ గ్రామాలు కదా.. ముంపు రాదంటూ ధైర్యంగా గ్రామాల్లోనే ఉండి గోదావరి పోటెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్థానికులు పరుగులు పెట్టారు.

కూనవరం మండలంలో ఒక్క గ్రామం తప్ప మిగిలిన అన్ని రెండో దశ పునరావాసంలో ఉన్నవే. అలాంటిది ఈ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలు మొన్నటి వరదలకు మూడొంతులకుపైగా మునిగాయి. కూనవరం మండలం అతలాకుతలమైంది. కుక్కునూరు మండలంలో తొలిదశలో 8 గ్రామాలే ముంపులో చిక్కుకోవాలి. మొన్నటి వరదలకు ఏకంగా 84 ఆవాసాలకు 76 మునిగాయి. వేలేరుపాడు మండలంలో తొలిదశలో ఆరు గ్రామాలే ముంపులో చిక్కుకోవాలి. అలాంటిది మరో 14 రెవెన్యూ గ్రామాలు చివురుటాకుల్లా వణికాయి.

పోలవరం వద్ద 45.72 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే మునగాల్సిన గ్రామాలు మొన్నటి వరదలకు అసలు పోలవరంలో నీరు నిలబెట్టకపోయినా మునిగాయి. ఎడవల్లి, బోళ్లపల్లి, కాచారం, తాట్కూరుగొమ్ము కాలనీ, ఎర్రబోరు, వసంతవాడ, సుద్దగుంపు, చిటెంరెడ్డిపాలెం, ఎర్రమెట్ట, చింతలపాడు, సిద్దారం, కొత్తూరు, తూర్పుమెట్ట, పడమట్టి మెట్టతోపాటు మరో 9 ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి.

చింతూరుతో సహా ఈ మండలంలోని అనేక గ్రామాలు రెండో దశలో ఉన్నవి. వరదలకు ఇవి ముంపుబారిన పడ్డాయి. పోలవరంలో నీరు నిలబెట్టకముందే పరిస్థితులిలా ఉన్నాయి.. ఇక తమ జీవితం ఎలా గడపాలి? అని రెండో దశలో ఉన్న వేల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇవీ చదవండి: Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్‌ ప్రారంభం

ప్రగతి పథంలో ప్రజా రథం.. 75 ఏళ్ల అభివృద్ధి యజ్ఞం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.