ETV Bharat / city

పోర్టల్​లో నమోదు చేయని సిబ్బంది.. రెండో డోసుకు ఇబ్బంది

author img

By

Published : May 15, 2021, 8:38 AM IST

మొదటి డోసు వేసినప్పుడు సంబంధిత వ్యక్తి వివరాలు.. వైద్య సిబ్బంది కొవిన్ పోర్టల్​లో నమోదు చేయకపోవడం వల్ల రెండో డోసు వేయించుకోవడానికి వారిప్పుడు ముప్పుతిప్పలు పడాల్సివస్తోంది. మొదటి డోసు వేసుకున్న గుర్తింపు పత్రం లేకపోవడం వల్ల రెండో డోసు ఇవ్వమని వారిని సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు.

covid vaccine, covid vaccination, corona vaccination
కరోనా వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సినేషన్, కరోనా వ్యాక్సినేషన్

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వేలాదిమందిని రెండో డోసు టీకాకు దూరం చేస్తోంది. మొదటి డోసు వేసినప్పుడు సంబంధిత వ్యక్తి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయలేదు. దీంతో మొదటి డోసు వేసుకున్న వ్యక్తులకు గుర్తింపు పత్రం రాలేదు. రెండో డోసు వేసుకోవడానికి వెళుతున్న ఇటువంటి అనేకమందిని సిబ్బంది తిప్పి పంపుతున్నారు. మొదటి డోసు వేసుకున్నట్లు గుర్తింపు పత్రం తీసుకువస్తే రెండోడోసు వేస్తామని చెబుతున్నారు.

వివరాలు తీసుకొని.. నమోదు చేయకుండా..

మొదట్లో నేరుగా వాక్సిన్‌ కేంద్రానికి వస్తే చాలు అక్కడే ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ను కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసి తొలి డోసు టీకా వేసేవారు. అప్పట్లో ప్రతి కేంద్రానికి వందలాది మంది రావడంతో అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కుదరకపోవడంతో.. ఆధార్‌ నకలు, ఇతర వివరాలు తీసుకుని మొదటి డోసు వేసేశారు. టీకా పంపిణీ ముగిసిన వెంటనే అదే రోజు టీకా తీసుకున్న వ్యక్తుల వివరాలు కొవిన్‌లో నమోదు చేసేవారు. తద్వారా సంబంధిత వ్యక్తుల సెల్‌ఫోన్‌కు లింక్‌తో కూడిన సంక్షిప్త సందేశం వచ్చేది. దాని ద్వారా మొదటి డోసు వేసుకున్నట్లు గుర్తింపు పత్రం డౌన్‌లోడ్‌ చేసుకునే వారు. ప్రస్తుత ప్రక్రియ కూడా ఇలానే జరుగుతోంది.

అయితే చాలాచోట్ల వైద్య సిబ్బంది టీకా కోసం వచ్చిన వారి నుంచి వివరాలు తీసుకొని.. వాటిని కొవిన్‌లో నమోదు చేయలేదని తెలుస్తోంది. నిమ్స్‌ ఆస్పత్రిలో వేలాది మంది ప్రముఖులు, ఇతర ఉద్యోగులకు టీకాలు వేశారు. ఆ సమయంలో సంబంధిత వ్యక్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వల్ల వారి సెల్‌ఫోన్‌కు సందేశం రాలేదు. అనేక కేంద్రాల్లో వెంటవెంటనే వివరాలు నమోదు చేయకుండానే టీకాలు వేశారు. నిమ్స్‌లో తొలిడోసు టీకా వేసుకున్నా వివరాలు నమోదు కాని వారు.. రెండోడోసు కోసం అక్కడికి వెళితే టీకా కేంద్రం మూసివేశాం...ఇప్పుడు మేము ఏమీ చేయలేమని సమాధానం చెబుతున్నారు. దీంతో వారంతా ఏం చేయాలో తెలియక మధన పడుతున్నారు. నగరంలోని ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోనూ ఈ పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన వృద్ధుడు 50 రోజుల కిందట కొవాగ్జిన్‌ మొదటి డోసు వేసుకున్నారు. రెండో డోసు వేసుకునే గడువు ముగియడంతో వారం రోజులుగా నగరంలోని ఆరేడు టీకా పంపిణీ కేంద్రాలకు ఆధార్‌ కార్డుతో వెళితే మొదటి డోసు వేసుకున్నట్లు పత్రం చూపిస్తేనే రెండో డోసు వేస్తామని చెప్పడంతో ఆయన అక్కడే కూలబడిపోయాడు. అక్కడున్న వారు సిబ్బందిని బతిమాలినా కూడా ఒప్పుకోలేదు. పోనీ మొదటి డోసు వేసుకున్నట్లు ఆధారం ఎలా తెచ్చుకోవాలో చెబితే అక్కడికెళ్లి ప్రయత్నం చేస్తామని అడిగినా సమాధానం ఇవ్వలేదు. మహానగరంలో ఇటువంటి వారు చాలా మంది ఉంటారని అంచనా. మరోవైపు రెండోడోసు వేసుకున్న వారి వివరాలు కూడా చాలా కేంద్రాల్లో కొవిన్‌లో నమోదు చేయలేదని తెలుస్తోంది. దీంతో మొదటి డోసు పూర్తయినట్లు పత్రం ఉంది గానీ రెండోడోసు వేసుకున్నట్లు వారి వద్ద ధ్రువపత్రం లేకపోవడంతో భవిష్యత్తులో అవసరముంటే ఎలాగా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.