ETV Bharat / city

ప్రేమ అని భ్రమించా... జీవితాన్ని కూలదోశా!

author img

By

Published : Mar 13, 2021, 8:12 AM IST

ఎదురింట్లో మెరిసి... నా గుండెల్లో తిష్ఠ వేసుకుని కూర్చుంది. తనతో పరిచయం... స్నేహం... రోజులను క్షణాలు చేశాయి. ఎన్నో ఎళ్ల బంధం మాది అనిపించింది తన సావాసం. ఇదంతా ప్రేమే అనిపించింది. తనకూ... ఆ భావం లేకపోతే నాతో ఇలా ఉండలేదు కదా అనుకున్నాను. భ్రమలో ఆ రోజు నేను చేసిన పని... సరిదిద్ధుకోలేని తప్పుగా మారి... నిత్యం వేధిస్తూనే ఉంది. అసలు నేనేం చేశానో తెలియాలంటే... నా కథ మీరు వినాల్సిందే...

one side lover feeling guilty about his wrong decision
one side lover feeling guilty about his wrong decision

ఎదురింట్లో ఓ ఫ్యామిలీ అద్దెకు దిగుతోంది. అందులో చిలకాకుపచ్చ చుడీదార్‌.. బారుజడతో ఉన్న అమ్మాయి తొలిచూపులోనే నన్నాకట్టుకుంది.
మర్నాడు మేడ పైకొచ్చి చూశా. ముంగురుల్ని సుతారంగా వెనక్కి తోస్తూ ముగ్గులేస్తోందా అమ్మాయి. తన మోముతో సూర్యోదయానికి ముందే వెన్నెల కురిపిస్తోంది. ఆమె వేసిన ముగ్గులో నా మనసు బందీ అయిపోయింది.

బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందట. ఓరోజు వీధిలో ఎదురుపడింది. ధైర్యం చేసి ‘హాయ్‌’ చెప్పి ‘మీ ఎదురింట్లో ఉంటామండీ. మీకభ్యంతరం లేకపోతే రెజ్యుమె పంపిస్తారా? మా ఆఫీసులో వేకెన్సీ ఉంటే చెబుతా’ అన్నా. ‘ఓహ్‌.. థాంక్యూ వెరీమచ్‌ అండీ. మీ మెయిల్‌ ఇస్తారా?’ అంది కళ్లింతలు చేస్తూ. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా చొరవగా మాట్లాడ్డంతో మనసు మబ్బుల్లో తేలిపోయింది. మర్నాడే ఈమెయిల్‌ పంపింది. అందులో ఫోన్‌ నెంబర్‌ని ‘ఎదురింటి స్వీటీ’ అని సేవ్‌ చేసుకున్నా.

మూడ్రోజులయ్యాక వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టా. తొందర్లోనే అభిరుచులు, అభిప్రాయాలు, కాలేజీ సంగతులూ.. పంచుకునేదాకా వెళ్లాం.
ఓరోజు రోడ్డుపై కనపడింది. అడిగితే ఇంటర్వ్యూకంది. డ్రాప్‌ చేస్తానన్నా. ముందు వద్దన్నా రెండోసారి కాదనలేదు. ఆరోజు నా పాదాలు భూమ్మీద ఉంటే ఒట్టు. ఆపై కళ్లు మూసినా, తెరిచినా తనే గుర్తొచ్చేది. తన ఊహ లేకుండా రోజు గడిచేది కాదు. మరి నేనంటే? బాధనంతా క్లోజ్‌ఫ్రెండ్‌ రాజ్‌తో పంచుకున్నా. ‘కనబడితే విష్‌ చేయడం.. బైక్‌ ఎక్కడం.. ఇవన్నీ ప్రేమ కాకపోతే మరేంట్రా?’ మావాడి మాటలు నాకు కిక్‌నిచ్చాయి. తనూ నన్ను ప్రేమిస్తోంది అనుకున్నా.

ఆరోజు వాళ్ల ఇళ్లంతా సందడిగా ఉంది. ఎప్పుడూ లేనిది తను చీరలో మెరిసిపోతోంది. నా మనసేదో కీడు శంకించింది. రాజ్‌గాడికి ఫోన్‌ చేశా. ఐదు నిమిషాల్లో నా ముందున్నాడు. ఓసారి వీధిలోకి వెళ్లొచ్చాడు. ‘ఘోరం జరుగుతోందిరా. తనకి పెళ్లిచూపులు. మనం ఏదో ఒకటి చేయకపోతే నీకు దక్కదు’ అన్నాడు. దుఃఖం పొంగుకొచ్చింది. ‘పదా.. తేల్చుకుందాం’ అంటూ వాళ్లింటికి లాక్కెళ్లిపోయాడు. ‘హలో బాస్‌.. ఈ అమ్మాయి, మావాడు ప్రేమించుకున్నారు. పేరెంట్స్‌ బలవంతంతో తను పెళ్లిచూపులకు ఒప్పుకుంది. నువ్వు అర్థం చేసుకుంటే మంచిది’ ఆ అబ్బాయిపై అరిచాడు. అక్కడున్న కొందరు బూతులు తిడుతూ మాపై దాడికి దిగారు. ‘తను మావాడి బైక్‌ ఎక్కింది. గంటలకొద్దీ చాట్‌ చేస్తోంది. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి’ రాజ్‌ మరింత రెచ్చిపోయాడు. నానా రచ్చ జరిగాక అంతా కలిసి మమ్మల్ని బయటికి తోసేశారు.

ఇంటికి రాగానే తన ఫోన్‌. లిఫ్ట్‌ చేశా. ముందు ఏడుపు వినిపించింది. తర్వాత నోరు తెరిచింది. ‘రేయ్‌.. అసలు నీకు బుద్ధుందా? నిన్ను ఇష్టపడుతున్నా అని నీకెప్పుడైనా చెప్పానా? బైక్‌ ఎక్కితే, చాట్‌ చేస్తే లవ్‌ చేసినట్టా?’ తన ప్రశ్నలకి నా దగ్గర సమాధానమే లేదు. ‘మూడు నెలల కిందటే ఆ అబ్బాయితో నా పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. ఈరోజు ముహుర్తం పెట్టుకోవడానికొచ్చారు. నీవల్ల అది క్యాన్సిల్‌ అయింది. మా బతుకు నాశనమైంది’ ఆ చివరిమాట నా గుండెల్ని చీల్చేసింది. నేను ‘సారీ’ అనేలోపే పెట్టేసింది. అపరాధభావంతో మూడ్రోజులు బయటికి రాలేదు. నాలుగోరోజు తన కాళ్లమీద పడి క్షమించమని అడుగుదామని వెళ్లా. కానీ వాళ్లింటికి తాళం. ఖాళీ చేశారట.

ఇది జరిగి ఏడాదిన్నరైంది. తన జాడ లేదు. ఇప్పటికీ నేను సిగ్గుతో కుమిలిపోతూనే ఉన్నా. జరిగిన తప్పు సరిదిద్దలేను. కానీ తను క్షమిస్తే కొంచెమైనా నా మానసిక క్షోభ తగ్గుతుంది. అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. - అజయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.