ETV Bharat / city

'మత్తు'పై ఉత్తుత్తి పోరాటం.. నేరాలు తీవ్రం.. శిక్షలు శూన్యం!

author img

By

Published : Jun 9, 2022, 4:00 AM IST

Updated : Jun 9, 2022, 6:45 AM IST

రాష్ట్రంలో గ్రామాలు, నగరాలు తేడా లేకుండా మాదకద్రవ్యాల వాడకం పెరిగిపోతోంది. పాకిస్థాన్‌ నుంచి దిగుమతుల కారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇప్పుడు తెలంగాణలోనూ వీటి వినియోగం ప్రమాదకరంగా మారుతోంది.

no punishments in drugs cases
‘మత్తు’పై ఉత్తుత్తి పోరాటం.. నేరాలు తీవ్రం.. శిక్షలు శూన్యం!

రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. కొకైన్‌ కిక్కు తలకెక్కుతోంది. విమానాల్లో దిగుమతులు... ఆన్‌లైన్లో ఆర్డర్లు... వెరసి రాష్ట్రవ్యాప్తంగా మత్తు విస్తరిస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో మత్తుమందుల మాటే వినపడకుండా చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల అనంతరం యంత్రాంగం దూకుడు పెంచి దాడులను విస్తృతం చేసింది. ఫలితంగా పట్టుబడే నిందితుల సంఖ్య పెరిగింది. కానీ ఏం లాభం? దర్యాప్తు, అభియోగపత్రాలు పకడ్బందీగా లేకపోవడంతో ఒక్కరంటే ఒక్కరికి కూడా శిక్ష పడడంలేదు. దీంతో పట్టుబడ్డవారు జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అనేక దేశాలు పోరాటం చేస్తుంటే మన దగ్గర మాత్రం కసరత్తుల స్థాయిని దాటడంలేదు.

సునామీలా ముంచెత్తుతోంది
రాష్ట్రంలో గ్రామాలు, నగరాలు తేడా లేకుండా మాదకద్రవ్యాల వాడకం పెరిగిపోతోంది. పాకిస్థాన్‌ నుంచి దిగుమతుల కారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇప్పుడు తెలంగాణలోనూ వీటి వినియోగం ప్రమాదకరంగా మారుతోంది. మత్తుమందుల ఉత్పత్తి, రవాణా, వాడకం.. ఈ మూడు అంశాలకూ తెలుగు రాష్ట్రాలు కేంద్రబిందువులుగా మారాయి. గంజాయి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోనే 16 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అత్యంత నాణ్యమైన ఈ గంజాయి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక రసాయన మాదకద్రవ్యాల తయారీలో హైదరాబాద్‌ ముందుంది. మూతపడ్డ ఔషధ పరిశ్రమలను లీజుకు తీసుకొని అడ్డగోలుగా రసాయన ఆధారిత మత్తుమందులు తయారు చేస్తున్నారు.

ఇది ఎవరి పని?
మత్తుమందుల నివారణ ఎవరి బాధ్యత అనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో సరైన సమన్వయం, స్పష్టత కొరవడ్డాయి. రాష్ట్రస్థాయిలో ప్రాథమికంగా ఆబ్కారీ శాఖదే ఈ బాధ్యత. కానీ ఆ శాఖ ప్రధానంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణనే ప్రధాన విధులుగా నిర్వర్తించే పోలీసులు మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టరు. ఇక కేంద్ర విభాగాల్లో ఎన్‌సీబీది పూర్తిగా మత్తుమందులను నియంత్రించే పని. కానీ రాష్ట్రంలో ఆ శాఖకు సరైన కార్యాలయం లేదు. అయిదుగురికి మించి సిబ్బందీ లేరు. మత్తుమందుల నియంత్రణలో ప్రధానమైనది ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ నిర్వహణకు తగిన నిధులూ ఎన్‌సీబీకి లేవు. మరో కేంద్ర సంస్థ డీఆర్‌ఐ విధుల్లో డ్రగ్స్‌ నియంత్రణ ఒక భాగం మాత్రమే. అదీ సరైన సమాచారం వచ్చినప్పుడే ఆ విభాగం స్పందిస్తుంది తప్ప, ప్రత్యేకించి రాష్ట్రంలో నిఘా పెట్టేంత వ్యవస్థ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి సీఐడీలో మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రత్యేకంగా పనిచేసేది. ఇప్పుడు కూడా తెలంగాణ సీఐడీలో ఆ విభాగం ఉన్నా, అది నామమాత్రమే. దానికంటూ ప్రత్యేకంగా అధికారులు, సిబ్బంది లేరు. మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా, అది ఇంకా రూపుదిద్దుకోలేదు.

నిరూపించే ఆధారాలేవీ?
డ్రగ్స్‌ సంబంధిత కేసులలో నిందితులకు శిక్షలు పడాలంటే అభియోగపత్రం (ఛార్జిషీట్‌) పకడ్బందీగా ఉండాలి. న్యాయస్థానం ఎదుట నిరూపించదగిన సాక్ష్యాధారాలు సేకరించాలి. తదనుగుణంగా తగిన న్యాయసలహా మేరకు ఛార్జిషీట్‌ దాఖలు చేయాలి. కానీ ఆబ్కారీ శాఖకు సరైన న్యాయవిభాగమే లేదు. ఎన్‌సీబీదీ ఇదే పరిస్థితి. ఫలితంగా అభియోగపత్రాల్లో లొసుగులు, సాక్ష్యాల లేమిని ఆసరాగా తీసుకుని నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకోగలుగుతున్నారు. మళ్లీ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

విదేశాల్లో మరణశిక్షలు... మంచిమాటలు
యువతను నిర్వీర్యం చేసి జాతి ప్రయోజనాలను దెబ్బతీసే మత్తుమందులను నిర్మూలించేందుకు ఒక్కో దేశం ఒక్కో తరహాలో స్పందిస్తోంది. మలేసియా, చైనా, వియత్నాం, ఇరాన్‌, థాయ్‌లాండ్‌, దుబాయ్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్‌, ఉత్తరకొరియా, ఫిలిప్పైన్స్‌, తుర్కియే, కోస్టారికా, కొలంబియా తదితర దేశాలు మరణశిక్ష విధిస్తున్నాయి. ఫిలిప్పైన్స్‌లో అయితే ప్రభుత్వం మత్తుమందుల నివారణ పేరుతో వందలాది మందిని కాల్చిచంపింది.

  • అమెరికా లాంటి దేశాలు మత్తుమందులపై యుద్ధం కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెడుతున్నాయి. మరికొన్ని దేశాలు సానుకూల దృక్పథాన్ని అవలంబిస్తున్నాయి. ఇందులో కెనడా ఒకటి. వాంకోవర్‌ నగరంలో హెరాయిన్‌ వ్యసనపరుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో వారి అలవాటును తగ్గించాలన్నది ప్రభుత్వం ఆలోచన. బలవంతంగా సంస్కరించడం కంటే మంచిమాటలతో దారిలో పెట్టే ప్రయత్నమిది.
  • పోర్చుగల్‌లో మత్తుమందులు అమ్మినా, వాడినా, రవాణా చేసినా కఠిన శిక్షలు ఉండవు. ఇటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైన వైద్య సదుపాయం అందిస్తున్నారు. ఈ చర్యలు చేపట్టకముందు ఆ దేశంలో ఏటా 14 వేల మంది అరెస్టయ్యేవారు. ఇప్పుడు ఈ సంఖ్య ఆరువేలకు తగ్గింది. యూరప్‌ మొత్తంలో సగటున తక్కువ మత్తుమందులు వాడుతున్న దేశాల్లో పోర్చుగల్‌ మొదటిస్థానానికి వచ్చింది.
  • చెక్‌ రిపబ్లిక్‌లోనూ మత్తుమందులు వాడుతున్న వారికి వైద్యసదుపాయం, సంస్కరణ చర్యలు అమలవుతున్నాయి.

కొరవడిన పరిపక్వత
మత్తుమందులపై పోరాటంలో అధికార యంత్రాంగంలో పరిపక్వత లోపించింది. మాదకద్రవ్యాలను అరికట్టాలంటే నిందితులకు శిక్షల భయం కల్పించాలి. మన దేశంలో చట్టం ప్రకారం కఠిన శిక్షలున్నాయి. పదేళ్ల జైలుశిక్ష నుంచి అరుదైన నేరాల్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. కానీ రాష్ట్రంలో దర్యాప్తు లోపాల కారణంగా నిందితులకు ఒక్కరోజు కూడా శిక్ష పడడంలేదు. అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తుపై శ్రద్ధ పెట్టకపోవడమే దీనికి కారణం. ఉదాహరణకు ఆబ్కారీశాఖ అధికారులు గత ఏడాది నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్‌ యాక్ట్‌ కింద 457 కేసులు నమోదు చేసి 723 మందిని అరెస్టు చేశారు. ఇంచుమించు ఏటా ఇదే సంఖ్యలో కేసులు నమోదవుతున్నా, ఎవరికీ శిక్షలు లేవు. అభియోగపత్రాలు మొక్కుబడిగా దాఖలు చేయడమే ఇందుకు కారణం.

ఎన్నో ఉదంతాలు
గత మార్చి నెలలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ‘ఓ ఫార్మా’ అనే సంస్థపై మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో-ఎన్‌సీబీ) అధికారులు దాడి చేసి 25 వేల కిలోల ట్రామాడోల్‌ అనే రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ తయారీకి ఉపయోగించే ఈ రసాయనాన్ని పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. పాశమైలారంలోని మరో ఔషధ సంస్థపై దాడి చేసిన డీఆర్‌ఐ అధికారులు ఏకంగా రూ.100 కోట్ల విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.

  • మాదకద్రవ్యాల రవాణాకు కూడా హైదరాబాద్‌ కీలకంగా మారుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.220 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుకోవడం దీనికి నిదర్శనం. హైదరాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న స్మగ్లర్లు ఇక్కడ కూడా కొత్త వినియోగదారులకు మత్తు అలవాటు చేస్తున్నారు.
  • గత ఏడాది ఆబ్కారీ, పోలీసుశాఖలతోపాటు కేంద ప్రభుత్వ విభాగాలైన డీఆర్‌ఐ, ఎన్‌సీబీ వంటివన్నీ కలిపి 25,579 కిలోల గంజాయి పట్టుకున్నాయి.
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 టాలీవుడ్‌ మత్తుమందుల కేసు దర్యాప్తు సందర్భంగా వందల సంఖ్యలో హైస్కూల్‌ పిల్లలు మత్తుమందులకు అలవాటు పడ్డారని, ఇందులో బాలికలు కూడా ఉన్నారని, 8, 9 తరగతి చదివే బాలికలు మత్తుమందుల కోసం తమ నగ్నచిత్రాలు సరఫరాదారులకు పంపారని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: పిల్లలను సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే

Last Updated : Jun 9, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.