ETV Bharat / city

Telangana Roads : ఓ శాఖ రోడ్డు వేస్తుంటే.. మరో శాఖ వచ్చి తవ్విపోస్తోంది!

author img

By

Published : Jan 4, 2022, 7:02 AM IST

Telangana Roads : ఒక శాఖ రోడ్డు వేస్తుంది.. మరో శాఖ వచ్చి తవ్విపోస్తుంది. పలుచోట్ల తరచూ జరిగే తతంగమిది.  దీనివల్ల ప్రజలకు ఎన్నో అవస్థలు. రోడ్డు వేసేముందే అక్కడేమైనా కేబుల్‌ పనులు చేయాల్సి ఉందో.. లేకపోతే డ్రైనేజీ పనులు చేపట్టాల్సి ఉందో తెలుసుకోకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. శాఖల మధ్య సమన్వయలేమికి తార్కాణమిది.  ఇప్పుడు రాష్ట్ర, జాతీయ రహదారులను నిర్మించే శాఖలు కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నాయి.

Telangana Roads
Telangana Roads

  • హైదరాబాద్‌ - వరంగల్‌ ప్రయాణికుల కోసం కరుణాపురం వద్ద జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో బైపాస్‌ రోడ్డును నిర్మించారు. ఒక మార్గం వరంగల్‌ నగరంలోకి,మరోమార్గం ములుగు వైపు వెళ్తాయి. ఈ రెండు మార్గాలు కలిసేచోట జంక్షన్‌ నిర్మించలేదు. దీంతో సర్వీస్‌ రోడ్డు ద్వారా వరంగల్‌ నగరంలోకి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ మార్గంలో పలు మలుపులను దాటి అండర్‌పాస్‌ ద్వారా నగరంలోకి వెళ్లాల్సి వస్తోంది.

Telangana Roads : తెలంగాణలో.. ఒకవైపు జాతీయ రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందుతుండగా మరోవైపు రాష్ట్రంలో రహదారులను నిర్మించే ఆర్‌ అండ్‌ బి మరికొన్ని రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఈ రెండుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల.. జంక్షన్లు నిర్మించకపోవడం వల్ల చాలాచోట్ల బైపాస్‌ రోడ్లు సమస్యాత్మకంగా మారుతున్నాయి. లేదంటే వాటివల్ల ఆశించినంత ప్రయోజనం కలగడంలేదు. ఒకటీ రెండు చోట్ల కాదు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కు ముడులను విప్పేందుకు నిర్మిస్తున్న బైపాస్‌లు, అవుటర్‌ రింగు రోడ్లు ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పెద్ద సంఖ్యలో వీటిని నిర్మిస్తున్నారు. కానీ వీటి నిర్మాణం విషయంలో ముందుచూపు కొరవడుతోంది. ఆయా మార్గాల నిర్మాణంలో భవిష్యత్తు వ్యూహాలను, సాంకేతిక అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం లేదు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జాతీయ రహదారుల సంస్థ, రహదారులు-భవనాల శాఖ, ఆయా మార్గాలు నిర్మించే ప్రాంతంలోని స్థానిక సంస్థల అధికారుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఆ మార్గం నిర్మాణం చేపట్టే సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరికి వారుగా నిర్మాణాలు చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి.

కరీంనగర్‌ - వరంగల్‌ జాతీయ రహదారి

Telangana High Ways : కరీంనగర్‌ - వరంగల్‌ జాతీయ రహదారి. దీన్ని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా అదే రహదారిపై వరంగల్‌ సమీపంలోని బీమారం వద్ద ఇటీవల బైపాస్‌ నిర్మించారు. దీంతో భవిష్యత్తు విస్తరణకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.

National High Ways in Telangana : నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌ కోసం నిర్మిస్తున్న మార్గం కోసం ఖమ్మం వద్ద మూడు బైపాస్‌ రోడ్లను జాతీయ రహదారి సంస్థ ప్రతిపాదించింది. మరోవైపు కోదాడ నుంచి ఖమ్మం వరకు నిర్మిస్తున్న రహదారి కోసం రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ బైపాస్‌ రోడ్డు నిర్మించనుంది. ఈ రెండింటి విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తే అవస్థలు తప్పే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంటూ మారింది

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంటూ మారింది

హైదరాబాద్‌ నుంచి ముంబయి, పుణె, నిజామాబాద్‌లకు సరకు రవాణా చేసే వాహనాలన్నీ గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మీదుగా వెళ్తుంటాయి. ఈ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం శ్రీగిరిపల్లి శివారులో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ రింగురోడ్డు నిర్మిస్తోంది. ఇదే మార్గంలో జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించాలని ప్రతిపాదించింది. తీరా గజ్వేల్‌ రింగురోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్‌ ఒకచోట క్రాస్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రాంతీయ రింగు రోడ్డు గజ్వేల్‌ అవతల నుంచి వెళ్లేలా అలైన్‌మెంటును మార్చాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.