ETV Bharat / city

AP MP RAGHURAMARAJU : 'జైలుకెళ్లే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు'

author img

By

Published : Jan 1, 2022, 11:51 AM IST

RRR comments on CBI case
RRR comments on CBI case

AP MP RAGHURAMARAJU: రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనిలేదని ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామరాజు తెలిపారు. రుణాల ఎగవేత కేసులో సీబీఐ చార్జిషీట్ ఇప్పుడే నమోదు చేయడం చాలా శుభపరిణామమన్న ఆయన.. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

జైలుకెళ్లే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు

AP MP RAGHURAMARAJU : రుణాల ఎగవేత కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలుపై ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ ఛార్జిషీటు ఇప్పుడే నమోదు కావడం శుభపరిణామం అన్నారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీట్‌..

AP MP RAGHURAMARAJU on CBI Case : కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దిల్లీలోని రోజ్‌అవెన్యూ కోర్టుల సముదాయంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్‌ జడ్జి ఎదుట ఛార్జిషీటు దాఖలు చేసినట్లు వెల్లడించింది. సీబీఐ కథనం ప్రకారం.. 2018 అక్టోబరు 3న హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ, దాని డైరెక్టర్లపైన దిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019 ఏప్రిల్‌ 29న ఆ సంస్థపై కేసు నమోదు చేసింది.

AP MP RRR : విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ఛైర్మన్‌గా ఉన్న ఇండ్‌భారత్‌ కంపెనీ తమిళనాడు ట్యుటికోరిన్‌లో థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పుతామంటూ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎఫ్‌సీ) ఆధ్వర్యంలోని రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)తో కూడిన కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తంతో నిందితులు థర్మల్‌ విద్యుదుత్పత్తి కంపెనీని పూర్తి చేయలేదు.

రుణ ఒప్పంద నిబంధనలు పాటించలేదు. తాము తీసుకున్న రుణాలను నిందితులు, సదరు కంపెనీ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో మళ్లించడంతోపాటు గుత్తేదారులకు అడ్వాన్సుగా చెల్లించారు. పైగా తాము ఫిక్స్‌డ్‌ చేసిన మొత్తం నుంచి రుణాలు తీసుకున్నారు. గ్రూప్‌ పరిధిలోని ఇతర కంపెనీల గుత్తేదారులకు అడ్వాన్సులు చెల్లించారు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో రుణాలిచ్చిన కంపెనీలు నష్టపోయాయి. థర్మల్‌ కంపెనీ ఏర్పాటు పేరుతో ఇండ్‌భారత్‌ కంపెనీ, ఇతర నిందితులతో కలిసి అక్రమంగా నిధులు వాడుకోవడంతోపాటు నిజాయతీగా వ్యవహరించకపోవడంతో కన్సార్షియం రూ.947.71 కోట్లు నష్టపోవడానికి కారణమైంది.

పీఎన్‌బీ పిటిషన్‌ను అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ

ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. ఇండ్‌భారత్‌ కంపెనీ తీసుకున్న రుణం రూ.327.51 కోట్లు చెల్లించకపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసింది. దీనిపై జ్యుడీషియల్‌ సభ్యులు డాక్టర్‌ వెంకటరామకృష్ణ బి.ఎన్‌., సాంకేతిక సభ్యుడు ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పునిచ్చింది. బ్యాంకుల కన్సార్షియం రూ.1383.38 కోట్ల వసూలు కోసం దిల్లీ రుణవసూళ్ల ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశాయి. వీటికిగాను ఇండ్‌భారత్‌ కంపెనీ రూ.872.63 కోట్లను మాత్రమే హామీనిచ్చింది.

ఎన్‌సీఎల్‌టీలో దరఖాస్తు చేయడానికి ముందు నోటీసు జారీ చేయలేదని, అంతేగాకుండా రుణదాతల కన్సార్షియం ఉండగా, వ్యక్తిగతంగా ఒక రుణదాత పిటిషన్‌ వేయడానికి వీల్లేదన్న ఇండ్‌భారత్‌ వాదనను తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇండ్‌భారత్‌ థర్మల్‌ దివాలా ప్రక్రియ చేపట్టడానికి అనుమతించింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను నియమించింది. ఇండ్‌భారత్‌ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.