ETV Bharat / city

దోపిడి కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..?: కేటీఆర్‌

author img

By

Published : Apr 6, 2022, 7:01 PM IST

Updated : Apr 6, 2022, 8:51 PM IST

KTR letter to center: భాజపా అసమర్థ విధానాల వల్లే ప్రజలపై నానాటికీ ధరాభారం పెరుగుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నిరంతరం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న కేంద్రం.. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసేందుకు కుఠిల ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Minister KTR wrote a letter to center on petrol rates hike
Minister KTR wrote a letter to center on petrol rates hike

KTR letter to center: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల్ని తీవ్ర అవస్థలు పడేలా చేస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని చేరుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం.. అందుకు చెపుతున్న కారణాలన్నీ శుద్ధ అబద్దాలేనని ఆరోపించారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్​లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు.. అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే ఉందన్న సంగతి ప్రజలకు తెలియకుండా దాస్తున్నారని దుయ్యబట్టారు. దాయాది దేశాలతోపాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికీ అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలంటే నరేంద్రమోదీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యమని కేటీఆర్ ఆక్షేపించారు. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయిందని.... ఆ సమయంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదన్నారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ.. పెట్రోల్​ను 120 రూపాయలకు, డీజిల్​ను 104కు పెంచారని విమర్శించారు. 8 ఏళ్ల క్రితం ఉన్న క్రూడాయిల్ ధరలు, ఇప్పటి ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నా.... పెట్రో ధరలను ఎందుకు రెట్టింపు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత భాజపా నాయకులపై ఉందన్నారు.

సంపదను సృష్టించలేక, విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భాజపా భావిస్తోందని మంత్రి కేటీఆర్ పెదవి విరిచారు. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన ఘనత భాజపాదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి దాకా వ్యాట్ టాక్స్ నయాపైసా కూడా పెంచలేదని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులతో పాటు.. వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన వాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో జరిగిన ఎన్నికలు, ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను పెంచని కేంద్ర ప్రభుత్వం... ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెంచుకుంటూ పోతోందని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్​ను దిగుమతి చేసుకుంటున్నామని పెట్రోలియం శాఖ మంత్రి లోక్​సభలో చెప్పినప్పటికీ... ప్రస్తుత పెట్రో ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ యుద్ధం కారణమని కేంద్ర పాలకులు చెప్పడం అతిశయోక్తి కలిగిస్తోందన్నారు.

కరోనా సమయంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని మోదీ సర్కారు ప్రకటించడం వారి పాలనకు తీరుకు అద్దం పడుతోందని కేటీఆర్​ విమర్శించారు. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని... సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని.. దేశ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు కేటీఆర్ రాసిన బహిరంగ లేఖలో కోరారు.

ఇదీ చూడండి:

Last Updated :Apr 6, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.