పుడింగ్ పబ్ కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

author img

By

Published : Apr 6, 2022, 5:13 PM IST

Updated : Apr 6, 2022, 7:27 PM IST

pudding and mink pub case

17:08 April 06

పుడింగ్ పబ్ కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Hyderabad Drug Case: పుడింగ్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పుడింగ్ పబ్​లో రోజూ తెల్లవారుజామున 4 వరకు మద్యం, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం 3వ తేదీ తెల్లవారుజామున పబ్ పై దాడిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కౌంటర్ వద్దకు వెళ్లారు.

అక్కడ ఉన్న ట్రైలలో స్ట్రాలు, టిష్యు పేపర్లు, టూత్ పిక్స్​ను గమనించారు. అదే ట్రేలో 5 అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో తెల్లటి పౌడర్​ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షించగా కొకైన్​గా తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. లాప్ టాప్, ప్రింటర్, వెయింగ్ మిషన్​తో పాటు ప్యాకింగ్ మెటీరియల్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పబ్ మేనేజర్ అనిల్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని ప్రశ్నించారు. అనిల్ ఇచ్చిన సమాచారం మేరకు పబ్ నిర్వాహకుడు అభిషేక్​ను పిలిపించారు.

ఇద్దరినీ ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసి వాళ్ల వద్ద ఉన్న చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పబ్​లో కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాళ్లపైనా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పామ్ అనే యాప్​లో రిజిస్ట్రర్ చేసుకున్న వాళ్లకే పబ్​లో అనుమతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 50వేల రుసుము కడితేనే యాప్​లో లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

3వ తేదీ జరిగిన పార్టీలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి దాదాపు 150మంది వరకు పబ్​కు వచ్చారు. వీళ్లలో ఏ బృందం కొకైన్ తీసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనిల్, అభిషేక్​లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు..

Last Updated :Apr 6, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.