ETV Bharat / city

360 కిలోమీటర్లు రాష్ట్రంలో భారత్​ జోడో యాత్ర.. రూట్​మ్యాప్ సిద్ధం..

author img

By

Published : Oct 4, 2022, 8:02 PM IST

Rahul Bharat Jodo Yatra
Rahul Bharat Jodo Yatra

Rahul Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో 360 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ నెల 24న యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించి మొత్తం 13 రోజుల పాటు సాగుతుందని అన్నారు. రోజుకు 31 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా రాహుల్ భారత్​ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Rahul Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలో ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. బోయిన్​పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్​లో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 360 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర ఉంటుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. రోజుకు 31 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందని అన్నారు. దసరా సందర్భంగా రాహుల్ 2 రోజులు విరామం తీసుకున్నారన్నారు. ఎల్లుండి నుంచి మళ్లీ జోడో యాత్ర మొదలౌతుందని జైరాం రమేష్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్​లో 4రోజుల పాటు 95 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.

తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్​పై భాజపా ప్రభుత్వం అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. దేశంలో పేదవాడు ఇంకా అట్టడుగు స్థాయికే దిగజారిపోతున్నాడని అన్నారు. నిత్యవసర ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు.. పేరు మారిస్తే అభివృద్ధి జరిగిపోదని సీఎం కేసీఆర్​పై ఫైర్ అయ్యారు.

ఈ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీల ఇంఛార్జ్ కొప్పుల రాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, భారత్ జోడో యాత్ర జాతీయ కమిటీ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భారత్ జోడో కన్వీనర్ బలరాం నాయక్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.

హైదరాబాద్​ నడి బొడ్డు నుంచే యాత్ర ప్రారంభం: భారత్‌ జోడో యాత్ర శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌ నగరానికి ఏ మాత్రం సంబంధం లేకుండా వెళ్లేట్లు రూట్‌ ఉండగా.. దానిపై పలుమార్లు కాంగ్రెస్‌ నాయకులు సమావేశమై చర్చించారు. ఆ రూట్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న అంచనాకు వచ్చారు. నాయకుల అభిప్రాయం మేరకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసి ఏఐసీసీకి నివేదించారు. దీనిని పరిశీలించిన తర్వాత ఆదివారం పీసీసీ ఇచ్చిన రూట్‌ మ్యాప్‌నకు ఆమోదం లభించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

24న కర్ణాటక నుంచి మహబూబ్‌నగర్​లోనికి ప్రవేశం:​ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర హైదరాబాద్‌ నడిబొడ్డు మీదుగా కొనసాగనుండటంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర నిర్వహణ ఉండాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పీసీసీ సీనియర్‌ నాయకులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 24న కర్ణాటక నుంచి మహబూబ్​నగర్‌ జిల్లా మక్తల్‌ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.

భారత్​ జోడో యాత్ర రూట్​ మ్యాప్​
భారత్​ జోడో యాత్ర రూట్​ మ్యాప్​

రూట్​ మ్యాప్​ ఇదే: అక్కడ నుంచి మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, శంషాబాద్‌, ఆరంఘర్‌, చార్మినార్‌, ఎంజే మార్కెట్‌, గాంధీభవన్‌, నాంపల్లి దర్గా, విజయనగర్‌ కాలనీ, మాసబ్‌ట్యాంక్‌, నాగార్జున సర్కిల్‌, పంజాగుట్ట.. అమీర్​పేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, పటాన్‌చెరు, ముత్తంగి, సంగారెడ్డి ఎక్స్ రోడ్డు, జోగిపేట, శంకరంపేట్‌, మదనూర్‌ల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 14 రోజులు.. 375 కిలోమీటర్లు కొనసాగనుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

భారత్​ జోడో యాత్ర రూట్​ మ్యాప్​
భారత్​ జోడో యాత్ర రూట్​ మ్యాప్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.