ETV Bharat / city

Covid : జలమండలిపై రెండో దశ కొవిడ్ పంజా

author img

By

Published : Jun 4, 2021, 8:42 AM IST

corona effect, corona effect on jalamandali, jalamandali corona cases
కరోనా కేసులు, జలమండలిపై కరోనా కాటు, జలమండలిపై కరోనా పంజా

హైదరాబాద్​ జలమండలి అధికారులపై కరోనా(Covid) పంజా విసురుతోంది. రెండో విడతలో దాదాపు 30 మంది వైరస్ బారినపడ్డారు. కొందరు చికిత్సతో కోలుకున్నారు. మరికొందరు మహమ్మారికి బలయ్యారు.

జలమండలిలో కరోనా(Covid) మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తొలి విడత కంటే రెండో సారి ఎక్కువ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు మేనేజర్లు సహా మొత్తం 25 మంది వరకు బలయ్యారు. నగరంలో డివిజన్ల వారీగా దాదాపు 3 వేల సిబ్బంది సేవలందిస్తున్నారు. మరో 500 మంది మేనేజర్లు పర్యవేక్షిస్తున్నారు.

నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ నగరవాసులకు నీటి కొరత రాకుండా చూసుకొనే సిబ్బంది పలువురు కరోనా బారిన పడుతున్నారు. అన్ని విభాగాల్లో కలుపుకొని దాదాపు 20-30 శాతం మందికి వైరస్‌ సోకింది. కొందరు చికిత్సలతో కోలుకోగా.. మరికొందరు తనువు చాలించారు. ఇంటిపెద్ద మృతితో కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. ఇందులో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సైతం ఉండటంతో సంస్థ నుంచి ప్రయోజనాలు ఏమీ అందడంలేదు. ఇలాంటి కుటుంబాల బతుకు భారమవుతోంది.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా సరే..

కరోనా(Covid) నేపథ్యంలో జలమండలి అధికారులు ముందే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు. మొదటి విడతలో కొందరికి కరోనా సోకినా.. ఒకటి రెండు తప్ప పెద్దగా మరణాలు నమోదు కాలేదు. రెండో విడతలో మాత్రం తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థలు పర్యవేక్షించే సిబ్బంది ఎక్కువ శాతం కరోనాకు గురయ్యారు. కొందరిలో అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆరోగ్యం మరింత సంక్షిష్టంగా మారింది.

మొదటి విడతలో కేవలం 530 మంది మాత్రమే టీకాలకు ముందుకు రావడం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది. రెండో విడతలో ఎండీ దానకిషోర్‌ ఆదేశాలతో బుధ, గురు వారాల్లో 1830 మంది టీకా వేయించుకున్నారు. జలమండలిలోని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించినా ..మృతుల కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.