జైళ్ల శాఖలో పునర్‌వ్యవస్థీకరణ.. కొత్త కారాగారాల ఏర్పాటుకు పచ్చజెండా..

author img

By

Published : Aug 9, 2022, 4:02 PM IST

Green signal for New Jails in Telangana

New Jails in Telangana: రాష్ట్రంలోని జైళ్ల శాఖలో పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. రెండు జిల్లా జైళ్లను కేంద్ర కారాగారాలుగా మార్చడం, ఒక కొత్త జైలు సహా.. ఓ ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఏర్పాటు కానున్నాయి. ఆయా ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపినట్టు సమాచారం. త్వరలో పాలనాపరమైన అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

జైళ్ల శాఖలో పునర్‌వ్యవస్థీకరణ.. కొత్త కారాగారాల ఏర్పాటుకు పచ్చజెండా..

New Jails in Telangana: రాష్ట్రంలో ప్రస్తుతం చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌ కేంద్ర కారాగారాలున్నాయి. చర్లపల్లిలో సుమారు 2 వేలు, చంచల్‌గూడలో వెయ్యి మందికి పైగా ఖైదీలున్నారు. వరంగల్‌ నగరంలో ఉన్న కేంద్ర కారాగారాన్ని మామునూరుకు తరలించేందుకు ప్రస్తుతం మూసివేశారు. అక్కడి ఖైదీలను చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు తరలించారు. నిబంధనల ప్రకారం రెండేళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను జిల్లా జైళ్లలో ఉంచుతారు. అంతకంటే ఎక్కువ శిక్ష ఖరారైన వారిని కేంద్ర కారాగారాంలోనే ఉంచాలి. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడిన ఖైదీలందరినీ ప్రస్తుతం చంచల్‌గూడ, చర్లపల్లికి తరలించడంతో వీటిపై ఒత్తిడి పెరిగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త కారాగారాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లా జైళ్లను కేంద్ర కారాగారాలుగా మార్చేందుకు జైళ్ల శాఖ గత మూడేళ్ల క్రితమే ప్రతిపాదించింది.

ఉమ్మడి మెదక్‌ జిల్లా జైలు గతంలో సంగారెడ్డి పట్టణంలో ఉండేది. ఈ జైలు సుమారు 225 క్రితం.. 1796లో నిర్మించినది కావడంతో 2012లో దీన్ని మ్యూజియంగా మార్చారు. సమీంపలోని కందిలో 40 ఎకరాల విస్తీర్ణంలో 260 మంది ఖైదీల సామర్ధ్యంతో కొత్త జైలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఖైదీలందరినీ ఇక్కడకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మెదక్‌ నుంచి కొత్త జిల్లాగా ఏర్పాటైన సిద్దిపేటలో ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల నుంచి హుస్నాబాద్‌, కొమురవెల్లి ప్రాంతాలు కలిశాయి. ఇవి కంది ప్రాంతానికి దూరంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో కొత్తగా జిల్లా జైలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీని నిర్మాణానికి 90 కోట్ల రూపాయలు వెచ్చించాలని అధికారులు భావిస్తున్నారు. 56 పోస్టులను కూడా మంజూరు చేయనున్నారు. నిజామాబాద్‌ జైలు 1969లో కొంత కాలం కేంద్ర కారాగారంగా కొనసాగింది. తిరిగి జిల్లా జైలుగా మారింది. తాజాగా తిరిగి కేంద్ర కారాగారంగా మారనుంది. 2007లో 10 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఈ జైలులో 320 మంది ఖైదీల సామర్ధ్యంతో 8 బరాక్‌లున్నాయి. హైరిస్క్‌ ఖైదీలను ఉంచేందుకు సెక్యురిటీ బారాక్‌తో పాటు మహిళా ఖైదీల కోసం ఓ వార్డు అందుబాటులో ఉంది.

వరంగల్‌ కేంద్ర కారాగారం మామునూరుకు తరలించే ఉద్దేశంతో ఖాళీ చేయించి ఏడాది దాటింది. దీని నిర్మాణానికి దాదాపు 250 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ... ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో మామునూరులో పోలీస్‌ బెటాలియన్‌ పరిధిలో జైళ్ల శాఖకు కేటాయించిన 101 ఎకరాల స్థలంలో ఓపెన్ ఎయిర్‌ జైలు ఏర్పాటు చేయాలనేది తాజా ప్రతిపాదన. అందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో అక్కడ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రెండో ఓపెన్‌ ఎయిర్‌ జైలు అవుతుంది. ప్రస్తుతం చర్లపల్లిలో మాత్రమే ఈ తరహో జైలు ఉంది. చర్లపల్లోని 128.29 ఎకరాల్లో విస్తరించిన ఓపెన్‌ ఎయిర్‌ జైలులోని వ్యవసాయ క్షేత్రంలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెల ఫామ్‌తో పాటు వర్మీకంపోస్టు యూనిట్ ఉంది. ఖైదీలే వీటిని నిర్వహించడం ప్రత్యేకత.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.