ETV Bharat / city

Live Video: భయపెట్టిన బ్యాటరీ స్కూటీ.. వీడియో వైరల్​.. అసలేమైందంటే..?

author img

By

Published : Sep 29, 2021, 6:00 PM IST

fire in battery scooty at kothapet video viral
fire in battery scooty at kothapet video viral

హైదరాబాద్​లోని కొత్తపేటలో ఓ బ్యాటరీ స్కూటీ.. అందరినీ భయాందోళనకు గురిచేసింది. మూడు కమిషనరేట్ల పోలీసులను అప్రమత్తమయ్యేలా చేసింది. ఇప్పుడా స్కూటీకి సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతూ.. వైరల్​ అవుతోంది. అసలేంజరిగిందో.. మీరూ ఓ లుక్కేయండి...?

భయపెట్టిన బ్యాటరీ స్కూటీ.. వీడియో వైరల్​..

హైదరాబాద్​ కొత్తపేటలోని ఎన్టీఆర్​నగర్​. ఓ కాంప్లెక్స్​ ముందు చాలా ద్విచక్రవాహనాలు పార్క్​ చేసి ఉన్నాయి. అక్కడే ఓ బ్యాటరీ స్కూటీ కూడా ఉంది. ఒక్కసారిగా ఆ స్కూటీ సీటు భాగం నుంచి దట్టమైన పొగలు కక్కటం ప్రారంభించింది. ఓ ఫ్యాక్టరీ గొట్టం నుంచి ఎగసిపడుతున్న పొగను చూసి.. స్థానికులు, వాహనదారులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. పెద్దఎత్తున విడుదలైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

దట్టమైన పొగలు.. ఆపై మంటలు..

కొందరు వాహనదారులు కొంచెం ధైర్యం చేసి.. ఎమైందో చూద్దామని అక్కడి వరకు వెళ్లారు. ఏమవుతుందో చూసేలోపే.. పొగ స్థానంలో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలను చూసి స్థానికులు మరింతగా భయపడ్డారు. పక్కనే ఉన్న పెట్రోల్​ బైకులు పేలిపోతాయేమోనని ఆందోళన చెందారు. స్కూటీ సీటు కింది భాగంలో నుంచి బలంగా ఎగిసిపడుతున్న మంటలను చూసి దగ్గరకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు.

అప్రమత్తమైన పోలీసులు...

ఈ దృశ్యాలను చరవాణుల్లో వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. "హైదరాబాద్​లో స్కూటీ" అనే టైటిల్​ పెట్టి ఆయా సోషల్​ మీడియాల్లో పోస్టులు పెట్టగా.. అవి కాస్తా మంగళవారం రోజున వైరల్​గా మారాయి. చక్కర్లు కొడుతూ కొడుతూ.. ఈ వీడియో కాస్తా పోలీసులకు చేరింది. ఈ ఘటన కచ్చితంగా ఎక్కడ జరిగిందనే సమాచారం లేకపోవటం వల్ల మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ జరిగింది...? ఎలాంటి ప్రమాదం సంభవించింది..? ఏదైనా నష్టం జరిగిందా..? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కొత్తపేటలోని ఎన్టీఆర్​నగర్​లో జరిగినట్టు గుర్తించారు. అసలు ఆ స్కూటీ ఎవరిదీ..? ఆ ఘటనకు బాధ్యులెవరు..? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

తరచూ జరుగుతున్న ప్రమాదాలు..

ఇటీవల కాలంలో కార్లు, ద్విచక్రవాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదాలు జరగటం తరచూ జరుగుతున్నాయి. సాధారణంగా... హైవేలపైనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండగా.. ఈ ఘటన జనసంచారం ఉన్న ప్రదేశంలో చోటుచేసుకోవటం అందరినీ భయపెట్టింది. బ్యాటరీ బైక్​ కావటం వల్ల... ఏదైనా షార్ట్ ​సర్క్యూట్​ జరిగి ఈ ప్రమాదం సంభవించిందా..? లేక ఎవరైనా కావాలనే ఇలా చేసి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారా...? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా.. వీడియోనే అంత భయపెడుతోంటే.. ఘటన జరిగిన సమయంలో... అక్కడున్న ప్రజలు ఇంకెంత భయపడి ఉంటారో..!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.