ETV Bharat / city

రుతుపవనాలు వచ్చే... ధాన్యం సొమ్ము ఇంకా రాకపాయే...

author img

By

Published : Jun 20, 2022, 7:59 AM IST

రాష్ట్రంలో రుతుపవనాలు రావడంతో వ్యవసాయ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగా మారడంతో రైతులు రావాల్సిన ధాన్యం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ కావాల్సి ఉన్నా.. 15 రోజులకుపైగా సమయం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

paddy
ధాన్యం

వ్యవసాయ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలించడంతో ధాన్యం రైతులు తమకు రావాల్సిన సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ కావాల్సి ఉన్నా.. 15 రోజులకుపైగా సమయం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని తొలుత అంచనా వేశారు.

యాసంగి సీజన్‌లో ఉప్పుడు బియ్యమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం.. సాధారణ బియ్యం కావాలని కేంద్రం కోరడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వ్యాపారులు భారీగా కొనుగోలు చేశారు. మరో అయిదారు లక్షల టన్నులకు మించి ధాన్యం విక్రయానికి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 6,609 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 6,375 మూసివేశారు. ఆలస్యంగా వరి నాట్లు వేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

రూ. 2,837 కోట్లు చెల్లించాలి... 9.08 లక్షల మంది రైతుల నుంచి రూ.9,701 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 4.19 లక్షల మంది రైతులకు రూ.6,864 కోట్లు చెల్లించింది. మిగిలిన 4.89 కోట్ల మంది రైతులకు రూ.2,837 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకవైపు రైతులు ధాన్యం సొమ్ము కోసం ఎదురుచూస్తుంటే... పౌరసరఫరాల శాఖ నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

తాజాగా రూ.4 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కెనరా బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్లు, నాబార్డు నుంచి మరో రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. కొంత మొత్తం ఇప్పటికే పౌరసరఫరాల శాఖ బ్యాంకుల ఖాతాలకు కూడా చేరినట్లు సమాచారం. రుణాల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటే మరింత కాలం వేచి ఉండాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.