ETV Bharat / city

నాది పోటీ సభ కాదు.. అధిష్ఠానం వద్దనలేదు: మాజీమంత్రి అనిల్

author img

By

Published : Apr 16, 2022, 6:30 PM IST

AP Ex Minister Anil Kumar
మాజీ మంత్రి అనిల్ కుమార్

AP Ex Minister Anil Kumar: ఏపీలో మంత్రివర్గ విస్తరణతో వైకాపాలో మొదలైన చిచ్చు.. ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, భగ్గుమన్నవారిని బుజ్జగించినప్పటికీ.. మిగిలిన వారిలో మాత్రం అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టే కనిపిస్తోంది. నెల్లూరు వైకాపా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. తాజా మంత్రి కాకాణికి స్వాగతం పలికేరోజునే.. మాజీ మంత్రి బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండటంపై నెల్లూరులో జోరుగా చర్చ సాగుతోంది.

AP Ex Minister Anil Kumar: ఆంధ్రప్రదేశ్​ మంత్రివర్గ విస్తరణ తర్వాత వైకాపాలో ఎంత రచ్చ సాగిందో తెలిసిందే. అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే.. ఉక్రోషం అణచుకోలేకపోయినవారు రోడ్డున పడ్డప్పటికీ.. మిగిలిన వారు లోలోపల రగిలిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరు వైకాపాలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మంత్రిగా చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఈనెల 17న తొలిసారిగా.. నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. దీంతో.. ఆ రోజు కార్యకర్తల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే.. అదేరోజున కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు మాజీ మంత్రి అనిల్‌ ప్లాన్‌ చేయడం వైకాపాలో కాకరేపుతోంది. మంత్రి కాకాణికి స్వాగతం పలికే రోజునే.. అనిల్‌ కుమార్ కార్యకర్తల సమావేశం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.

రెండింతలు ఇస్తానన్న అనిల్ : వీరి విభేదాల చర్చ.. మూడు రోజుల నుంచి ఎక్కువైంది. మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఆంతేకాకుండా.. వ్యంగ్య బాణాలూ విసిరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి సహకారం అందించారో.. తనపై ఎలాంటి ప్రేమ చూపారో.. కచ్చితంగా అదే ప్రేమ, సహకారం రెండింతలు అందిస్తానని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. దీంతో.. నెల్లూరు వైకాపాలో గ్రూపు రాజకీయాలు రంజుగా మారబోతున్నాయనే చర్చ అప్పుడే మొదలైంది.

సభ ఏర్పాట్ల పరిశీలన : మంత్రిని ఆహ్వానించేందుకు ఆయన వర్గం ఏర్పాట్లు చేసుకుంటుంటే.. నెల్లూరులో రేపు నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఇవాళ అనిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బల ప్రదర్శన కోసం ఈ సమావేశం నిర్వహించడం లేదని చెప్పారు. కేవలం సిటీ నియోజకవర్గం కార్యకర్తలు మాత్రమే ఈ సభకు హాజరవుతారన్న అనిల్ కుమార్.. ఇది ఎవరికీ పోటీ సభ కాదని చెప్పడం గమనార్హం. తన సభను కొందరు వివాదంగా మారుస్తున్నారని అన్నారు. తాను జగన్‌కు సైనికుడిగానే ఉంటానన్న మాజీ మంత్రి.. తన సభను వాయిదా వేసుకోవాలని అధిష్ఠానం సూచించలేదని చెప్పారు. మరి, ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని వైకాపా శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇవీ చదవండి: Bandi Sanjay on TRS: వారి ఆత్మహత్యలకు తెరాస నాయకులే కారణం: బండి సంజయ్

రామాయంపేటలో ఉద్రిక్తత... మృతదేహాల తరలింపు సమయంలో ఘర్షణ

ట్విట్టర్ మాస్టర్​ ప్లాన్​.. 'పాయిజన్​ పిల్'​తో మస్క్​ ప్రయత్నాలకు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.