ETV Bharat / city

'తెలంగాణ వచ్చినా.. కృష్ణా జలాల్లో వాటా పొందలేకపోతున్నాం'

author img

By

Published : Jan 8, 2021, 7:50 PM IST

రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీ నారాయణ రాసిన 'నదీ జలాల లభ్యత-పంపిణీలో తెలంగాణ పట్ల వివక్ష' అనే పుస్తకంలో సమస్యలతో పాటు వాటికి పరిష్కారం కూడా చూపారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య తెలిపారు. హైదరాబాద్​లో ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు.

river water availability-distribution book inauguration
నదీ జలాల లభ్యత-పంపిణీలో తెలంగాణ పట్ల వివక్ష

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాలపై రిటైర్డ్‌ ఇంజనీర్‌, తెలంగాణ ఇంజినీర్స్‌ ఫోరం కన్వీనర్‌ దొంతుల లక్ష్మీ నారాయణ రచించిన పుస్తకం ఒక గ్రంథం లాంటిదని మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. సమస్యలతో పాటు వాటికి పరిష్కారం కూడా చూపారని తెలిపారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో 'నదీ జలాల లభ్యత పంపిణీలో తెలంగాణ పట్ల వివక్ష' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంపై ప్రశ్నించిన తెలంగాణ ఇంజినీర్లు ఇప్పుడు అన్యాయం జరుగుతున్నా స్పందించడంలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా కృష్ణా నదిలో నీటి వాటా పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారుల ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో... తెలంగాణ ఏర్పడ్డాక నీటి వాడకంపై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై లక్ష్మీనారాయణ అందరికీ అవగాహన కల్పించారని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి అన్నారు. రీడిజైన్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోట్లాది రూపాయలను వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎంతో కుమ్మక్కై తమ జిల్లాకు నీళ్లు రానీయకుండా చేశారని మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఆరోపించారు. 35 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.