ETV Bharat / city

నేటి నుంచి ఫ్రంట్​లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్

author img

By

Published : Feb 6, 2021, 5:36 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పోలీస్‌, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్​ శాఖల సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఆయా విభాగాల్లో కలిపి సుమారు 2 లక్షల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్లకు శుక్రవారంతో టీకా ప్రక్రియ ముగిసింది.

corona vaccination
నేటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్

నేటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి దశ కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారంతో హెల్త్ కేర్ వర్కర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది.

మరోమారు అవకాశం లేదు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో పనిచేసే సుమారు 3.3 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకోగా .. అందులో కేవలం లక్షా 93 వేల 485 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రజా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు మృతి చెందగా.. వారి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకొని.. వ్యాక్సిన్ తీసుకోని వారికి మరోమారు అవకాశం కల్పించేది లేదన్న అధికారులు స్పష్టం చేశారు. తమవంతు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఈ నెల 12లోపు..

హెల్త్​కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ప్రజా ఆరోగ్యశాఖ... నేటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల్లో కలిపి సుమారు 2 లక్షల మంది సిబ్బంది ఇప్పటికే కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకున్న నేపథ్యంలో.. వారందరికీ ఈ నెల 12లోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలిరోజు ప్రధానంగా పోలీసు శాఖకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రజా ఆరోగ్య శాఖ పేర్కొంది.

మార్చి రెండో వారం నుంచి..

ఇక ఈ నెలాఖరుకి దాదాపుగా తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి... 50 ఏళ్లు పైబడిన వారు.. లేదా 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇచ్చే అవకాశం ఉందని ప్రజారోగ్యశాఖ తెలిపింది. అయితే వీరి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి... కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

ఇవీచూడండి: ' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.