YCP ATTACK TDP: తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల వీరంగం.. కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు

author img

By

Published : Oct 19, 2021, 5:52 PM IST

Updated : Oct 19, 2021, 7:18 PM IST

YCP ATTACK TDP

17:50 October 19

YCP ATTACK TDP: తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల వీరంగం.. కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు

       ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరామెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. తెదేపా కార్యాలయంపై దాడి విషయం తెలుసుకన్న తెదేపా శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

పట్టాభి ఇంటిపై దాడి..

   విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి  యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు. మరోవైపు తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రేణిగుంటలో రణరంగం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో తెదేపా నేతల ర్యాలీపై వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. తెదేపా నేత బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆపార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని రేణిగుంట సర్పంచి నగేశ్‌, ఉప సర్పంచి సుజాత, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో వైకాపా నేతలు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ర్యాలీ ముగించుకుని తెదేపా నేతలు కారులో వెళ్తున్న సమయంలో సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌, తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు మరోసారి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: Chandra babu:'కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం'

Last Updated :Oct 19, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.