ETV Bharat / city

తుపాను పొంచి ఉంది.. జాగ్రత్త!

author img

By

Published : May 22, 2021, 8:47 AM IST

chance of heavy rain in andhrapradesh
తుపాను పొంచి ఉంది.. జాగ్రత్త!

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... తుపాన్​గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం చెబుతున్నందున ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నెల 26న ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో తుపాను తలెత్తడంతో పాటు, తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదమున్నట్లు అప్రమత్తం చేశారు.

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ కల్లా తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం చెబుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ నెల 26న ఒడిశా-పశ్చిమబెంగాల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో తుపాను తలెత్తడంతో పాటు, తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదమున్నట్లు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజారోగ్యంపై ఇప్పుడు నీళ్లు, దోమలు, గాలిద్వారా సంక్రమించే రోగాలు మరిన్ని సవాళ్లు విసిరేలా ఉన్నాయని హెచ్చరించారు. అందువల్ల అత్యవసర మందులను నిల్వచేసుకోవాలని.. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షం

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా వర్షం పడింది. గుంటూరు, నరసరావుపేట, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, అమృతలూరు, వట్టిచెరుకూరు, నాదెండ్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, వేమూరు, దుగ్గిరాల, రాజధాని అమరావతి ప్రాంతాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. అప్పలరాజుపేటలో వరి పనలు నీట మునిగాయి. ధాన్యం రాశులు ముద్దయ్యాయి. వట్టిగెడ్డ జలాశయ పొర్లు కాలువ వరద నీటితో జోరుగా ప్రవహించింది.శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని హెచ్చరించింది.

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఒకరి మృతి

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో పిడుగుపాటుకు గురై తిప్పన ప్రశాంత్‌(26) అనే యువకుడు మృతిచెందాడు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు చేసిన సూచనలు

* హెల్త్‌ సెక్టార్‌ ఇన్సిడెంట్‌ కమాండ్‌ సిస్టం, ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌/కంట్రోల్‌ రూంను క్రియాశీలకం చేయండి. వీటి నిర్వహణం కోసం ఒక నోడల్‌ అధికారిని నియమించి అతని ఫోన్‌ నంబర్‌ను వైద్య ఆరోగ్య శాఖకు పంపాలి.
* కోస్తా జిల్లాలన్నింటిలో హాస్పిట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ను తయారు చేసుకోవాలి. ఇక్కడి ఆసుపత్రుల్లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి.
* తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే సామాజిక ఆరోగ్య సౌకర్యాలను సురక్షిత ప్రాంతాలకు, పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి.
* వర్షాకాలంలో ఇన్‌ఫ్లుయెంజా, మీజిల్స్‌, డయేరియా, డెంగీ, మలేరియా లాంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున కొవిడ్‌ టీంలు అప్రమత్తంగా ఉండాలి.
* కొవిడ్‌ సేవలతో పాటు, ఇతరత్రా వైద్య ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయిలో నడిచేలా చర్యలు తీసుకోవాలి. తుపాను ప్రభావితం కాని జిల్లాల నుంచి అదనపు మానవ వనరులను సమీకరించుకోవాలి.
* అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు, వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు, ఇతర వైద్యసేవలు అందించే చోట తగిన మొత్తంలో పవర్‌ బ్యాకప్‌ ఉంచుకోవాలి.
* వర్షాల వల్ల వాహనాల రాకపోకలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అత్యవసర మందులను తగిన మోతాదులో నిల్వ ఉంచుకోవాలి. ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి.
* తుపాను తాకిడికి గురయ్యే జిల్లాల్లో అంబులెన్సు సేవలను తగినంత సిద్ధం చేసుకోవాలి.
* లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించే వారి కోసం వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. క్యాంపుల్లో ఉన్న వారికి ర్యాట్‌ పరీక్షలు చేయాలి. అందులో నెగెటివ్‌ వచ్చిన వారిలో ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాలి.
* వర్షాల వల్ల సమాచార వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున జిల్లాల్లోని అన్ని ప్రధాన ఆసుపత్రులకు శాటిలైట్‌ ఫోన్లు, హ్యామ్‌ రేడియో కనెక్షన్లు అందించాలి.
* ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని మెడికల్‌ స్టోర్లు, ఆసుపత్రుల సేవలను పై ఫ్లోర్‌, ఇతర భవనాల్లోకి మార్చాలి.
* 24వ తేదీన ఉదయం వాతావరణ శాఖ జారీ చేసే ప్రకటనను గమనించాలని.. అల్పపీడనం ఎక్కడ తీరాన్ని తాకి తుపానుగా సంతరించుకుంటుందో ఆ ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాజేష్‌భూషణ్‌ రాష్ట్రాలకు సూచించారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.