ETV Bharat / city

'రాష్ట్రానికి 10 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయింపు'

author img

By

Published : Sep 26, 2020, 2:05 PM IST

రాబోయే యాసంగి సీజ‌న్ కోసం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 10 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియాను కేటాయించింది. గ‌త యాసంగి సీజ‌న్‌లో రాష్ట్రానికి 8 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఈ సారి రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు ఎరువుల కేటాయింపును పెంచింది. పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా ఈ ఏడాది యాసంగి సీజ‌న్‌కు 11 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించాల్సిందిగా కోర‌గా ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

central govt allotted 10 lakhs tons urea to Telangana for yaasagi
రాష్ట్రానికి 10 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయింపు

యాసంగి సీజన్‌పై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది వానాకాలం ముగియనున్న నేపథ్యంలో రాబోయే యాసంగి కోసం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో పెరిగిన సాగు నీటి వసతులు, ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా... గత యాసంగి కన్నా 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని కేంద్రానికి తెలిపామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గత యాసంగిలో 53.82 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు సాగయ్యాయయని... మొత్తం సాగులో యూరియా అధికంగా వినియోగించే వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలే 80 శాతం ఉన్నాయని చెప్పారు.

ఈ ఏడాది తాజా వానాకాలం పంటల కన్నా యాసంగి పంటల్లో యూరియా అధికంగా వినియోగం అవుతుందని వివరించారు. ఈ కారణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా... 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రకటించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 0.5 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ పాస్ఫేట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి మొత్తం 18.30 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు తెలంగాణకు కేంద్రం కేటాయించిందని వెల్లడించారు.

గత ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులకుగాను 7.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను... 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. కేటాయింపులకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని, అదనంగా అవసరాల మేరకు ప్రభుత్వం చేసే విజ్ఞప్తులకు సహకరించాలని తాము చేసిన వినతిపై తప్పకుండా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.