ETV Bharat / city

ప్రత్యేక కోర్టు : మందకొడిగా విచారణ.. వీగిపోతున్న కేసులు

author img

By

Published : Jan 4, 2021, 1:33 PM IST

telangana special court
తెలంగాణ ప్రత్యేక కోర్టు

ప్రజా ప్రతినిధులపై నేరాభియోగాలు.. సామాన్య పౌరుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు అందరికి ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాలు చేసే చట్టసభల సభ్యులే వాటిని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి కేసులు పెండింగ్​లో ఉండటం.. ఈలోగా పదవీకాలం పూర్తి చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే మచ్చ తెస్తున్నాయి. కేసులు తేలకపోవడం ఓ కోణమైతే.. అవి వీగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక కోర్టులో ఇప్పటి వరకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసు ఒక్కటి కూడా రుజువు కాలేదు. లోపాలు.. ప్రాసిక్యూషన్ వైఫల్యం.. పోలీసుల ఉదాసీనత స్పష్టంగా బయట పడుతున్నాయి.

న్యాయస్థానాల్లో కొన్ని కేసులు వీగిపోవడం.. మరికొన్నింటిలో శిక్షలు పడటం సాధారణమే. కానీ రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. 69 కేసులు వీగిపోయాయి.

ఏడాదిన్నర తర్వాత జడ్జి నియామకం

చట్టసభల్లోని నేతలపై వచ్చిన నేరాభియోగాలపై సత్వర విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. 2018 ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసుల విచారణ కోసం హైదరాబాద్​లో సెషన్స్ జడ్జి హోదాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ముప్ఫై మంది సిబ్బందిని నియమిస్తూ మార్చి 2న ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన దాదాపు ఏడాదిన్నర పాటు న్యాయాధికారిని నియమించలేదు. ఏడాదిన్నర క్రితం జడ్జిని నియమించినా ఇప్పటి వరకు పూర్తిస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేరు. మంజూరైన పోస్టుల్లో 16 మందిని నియమించగా.. మిగతావి భర్తీ కాకపోవడం వల్ల కేసుల విచారణపై ప్రభావం కనిపిస్తోంది.

509పై కేసులు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న క్రిమినల్ కేసుల బదిలీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్​లోని ప్రత్యేక కోర్టుకు 245 కేసులు బదిలీ అయ్యాయి. వాటిలో 2018లో 100 కేసులు, 2019లో 39, గతేడాది 106 కేసులున్నాయి. స్పెషల్ కోర్టులో ప్రస్తుతం 172 కేసుల్లో వివిధ దశల్లో విచారణ జరుగుతోంది. రాష్ట్రంలోని 41 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు పెండింగ్​లో ఉన్నాయి. మరో 15 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. కానీ 2018 ఎన్నికల్లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఎమ్మెల్యేలపై దాదాపు 509 కేసులు ఉన్నట్లు సుపరిపాలన వేదిక చెబుతోంది. రాష్ట్రంలోని పది మంది ఎంపీలపై 133 కేసులు, 67 మంది ఎమ్మెల్యేలపై సుమారు 150 కేసులు ఉన్నట్లు వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోందని సుపరిపాలన వేదిక వెల్లడించింది.

ఒక్కటీ రుజువు కాలేదు

ప్రత్యేక కోర్టు ఏర్పాటైన తర్వాత 69 కేసుల్లో విచారణ పూర్తి కాగా.. మరో 4 కేసులు ఇతర న్యాయస్థానాలకు బదిలీ అయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు యాభై కేసులను కొట్టివేసింది. మరో ఇరవై కేసులు అభియోగాల నమోదు కూడా కాకముందే డిశ్చార్జ్ అయ్యాయి. ఒక్క కేసు కూడా రుజువు కాకపోవడానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 50 పోలీస్ స్టేషన్ల నుంచి ఎవరూ హాజరు కావడం లేదని దానివల్ల కేసుల విచారణ ముందుకు సాగడం లేదని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గతేడాది జనవరిలో డీజీపీకి లేఖ రాశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేయాలి

కొన్ని కేసుల్లో అభియోగాల నమోదు తర్వాత సాక్షులను హాజరుపరచడంలో పోలీసులు చొరవ చూపడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. హాజరైన కొందరు సాక్షులకు విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఎలా వ్యవహరించాలో అర్థం కాకపోవడం వల్ల.. వాంగ్మూలాలు నీరుగారిపోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను నియమిస్తే.. సాక్షులకు ముందస్తుగా సిద్ధం చేసేందుకు వీలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని లేకపోతే.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు.

ఏపీ సీఎంపై 17 పెండింగ్ కేసులు

అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో విచారణ ప్రక్రియ మందకొండిగానే జరుగుతోంది. సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 17 కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం దాఖలైన ఛార్జ్ షీట్లలోనూ కనీసం అభియోగాలు నమోదు కాలేదు. రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీ, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి జె.గీతారెడ్డి కూడా సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

రేవంత్​పై అభియోగాలేవి

హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై ఓటుకు నోటు కేసు పెండింగ్​లో ఉంది. ఐదేళ్లు దాటినా రేవంత్ రెడ్డిపై ఇప్పటి వరకు అభియోగాలు నమోదు కాకపోగా.. సండ్ర వెంకట వీరయ్యపై కొన్ని రోజుల క్రితమే అభియోగాలు నమోదు చేసిన కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించింది.

మరో రెండు ప్రత్యేక కోర్టులు

హైదరాబాద్​లోని కోర్టుపై భారం తగ్గించి మరింత సత్వర విచారణ కోసం.. రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ కోసం మరో రెండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు హైకోర్టు ప్రతిపాదనలు రూపొందించింది.

ఉమ్మడి జిల్లా ప్రత్యేక కోర్టుకు చేరిన కేసులుపరిష్కరించినవిపెండింగ్
వరంగల్35926
ఆదిలాబాద్642
హైదరాబాద్954154
కరీంనగర్ 26719
ఖమ్మం 31130
మహబూబ్ నగర్25817
మెదక్1019
నల్గొండ 707
నిజామాబాద్312
రంగారెడ్డి716
మొత్తం24573172
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.