ETV Bharat / city

అర్ధరాత్రి కూల్చివేతలేంటి..? ఏపీ హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Jun 20, 2022, 6:37 AM IST

Ayyanna Patrudu News : తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించింది.

ayyanna patrudu house demolition
ayyanna patrudu house demolition

Ayyanna Patrudu News : తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆయన ఇంటి జోలికి ఎవరూ వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి కూల్చివేతలేంటని ప్రశ్నించింది. నర్సీపట్నంలో ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేశ్ ఆదివారం రోజున హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీశ్​ వాదనలు వినిపించారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం చేశామని తెలిపారు. నిర్మాణ సమయంలో తహశీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలన చేసి హద్దులు నిర్ణయించాకే నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. రాజకీయ కక్షతో నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతకు చర్యలు చేపట్టారని కోర్టుకు విన్నవించారు.

ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అర్ధరాత్రి కూల్చివేతలేంటని విస్మయం వ్యక్తం చేశారు. కూల్చివేతలను సూర్యాస్తమయం తర్వాత చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలుండగా ఇదేం పద్ధతని అధికారుల తీరుపై న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దని అధికారులకు తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని అధికారులకు తక్షణం తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణను ఈనెల 21 కి వాయిదా వేసిన న్యాయమూర్తి .. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దని అధికారులకు తేల్చిచెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.