ETV Bharat / city

Movie Tickets Price Issue in AP : సినిమా టికెట్లపై అప్పుడలా..ఇప్పుడిలా..ఎందుకు?

author img

By

Published : Mar 10, 2022, 8:29 AM IST

Movie Tickets Price Issue in AP
Movie Tickets Price Issue in AP

Movie Tickets Price Issue in AP : రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని సమర్థించుకుంటూ.. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు గతంలో రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే సినిమా పెద్దలు వచ్చి కలిశాక టికెట్‌ ధరల్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘అంటే మూడు నెలల్లోనే రాష్ట్రంలోని పేదలంతా ధనవంతులైపోయారన్న మాట’ అని పలువురు వ్యంగ్యబాణాలు సంధిస్తున్నారు.

Movie Tickets Price Issue in AP : ‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరల్ని నిర్ణయిస్తే, దానిమీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవారికి వీళ్లు శత్రువులు కాదా? ఇలాంటి చెడిపోయిన రాజకీయాల మధ్య పరిపాలన కొనసాగిస్తున్నాం. మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేస్తే, మంచి జరగకూడదు, ప్రజలు ఇబ్బందిపడాలని, రకరకాల కారణాలు, స్వార్థంతో అడ్డుతగులుతున్నారు’ - ఈ ఏడాది జనవరిలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

‘టికెట్‌ ధరలు తగ్గించడం ప్రేక్షకుల్ని అవమానించడమేంటి? పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. టికెట్లను ఇష్టానుసారం అమ్ముకుంటామంటే ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది?’

- సినీనటుడు నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌

‘సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్‌కి వెళ్తే టికెట్‌ ధర నుంచి నుంచి పార్కింగ్‌ వరకు పీడిస్తున్నారు. ధరల నియంత్రణ ప్రభుత్వ బాధ్యత. ఇన్నాళ్లూ ఎవరూ ఆ విషయం మాట్లాడలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతోంది కాబట్టి కక్షసాధింపు అంటున్నారు. అన్ని వ్యవస్థల్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’

-నాని వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్‌

AP CM Jagan on Cinema Tickets Price : ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని సమర్థించుకుంటూ ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు రెండు మూడు నెలల క్రితం వరకూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. హీరోలు కోట్లకొద్దీ పారితోషికం తీసుకుంటూ ఆ భారాన్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారని, దాన్ని ప్రభుత్వం ఎందుకు సమర్థించాలని కొందరు ప్రశ్నించారు. సినిమా టికెట్‌ ధరలు తగ్గించి పేదలకు ప్రభుత్వం మేలు చేస్తుంటే, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. టికెట్‌ ధరల్ని తగ్గిస్తూ 2021 ఏప్రిల్‌ 8న ప్రభుత్వం తెచ్చిన జీవో 35పై సినిమా నిర్మాతలు, నటులు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా.. ఆ ధరలకు థియేటర్లను నడపలేమంటూ మూసేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

Jagan Comments on Cinema Tickets Price : సీన్‌ కట్‌ చేస్తే.. ప్రముఖ నటుడు చిరంజీవి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలసి వెళ్లారు. కొన్నాళ్లకు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి తదితరులు వచ్చారు. టికెట్‌ ధరల్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదికూడా వెంటనే అమల్లోకి తేలేదు. ఫిబ్రవరి 10న సినీ ప్రముఖులు వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే.. మార్చి 7న ప్రభుత్వం జీవో జారీచేసింది.

3 నెలల్లోనే పేదలంతా ధనవంతులైపోయారా?

పేదల కోసమే సినిమా టికెట్‌ ధరలు తగ్గించామని రెండు మూడు నెలల క్రితం వరకు ఢంకా బజాయించి చెప్పిన ప్రభుత్వ పెద్దలు... ఇప్పుడు మళ్లీ టికెట్‌ ధరల్ని దాదాపుగా జీవో 35కు ముందున్న స్థాయికే పెంచడంపై సామాజిక మాధ్యమాల్లో పలు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘అంటే మూడు నెలల్లోనే రాష్ట్రంలోని పేదలంతా ధనవంతులైపోయారన్న మాట’ అని పలువురు వ్యంగ్యబాణాలు సంధిస్తున్నారు. అప్పుడు టికెట్‌ ధరల్ని ఏ ప్రాతిపదికన తగ్గించారు? ఇప్పుడెలా పెంచారు?’ అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జీవో 35 ప్రకారం... గ్రామ పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో టికెట్‌ కనిష్ఠ ధర రూ.5 (ఎకానమీ), గరిష్ఠ ధర రూ.15 (ప్రీమియం) ఉండేది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.10, గరిష్ఠ ధర రూ.20 ఉండేది. మల్టీఫ్లెక్స్‌ల్లో కనిష్ఠ ధర రూ.30, గరిష్ఠ ధర రూ.80 ఉండేది. నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.10, గరిష్ఠ ధర రూ.25 ఉండేది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.15, గరిష్ఠ ధర రూ.35 ఉండేది, మల్టీఫ్లెక్స్‌లలో కనిష్ఠ ధర రూ.40, గరిష్ఠ ధర రూ.120 ఉండేది. ఆ జీవో ప్రకారం ఎకానమీ, ప్రీమియంకి మధ్యలో డీలక్స్‌ క్లాస్‌ ఉండేది.

కొత్త జీవో ప్రకారం గ్రామ, నగర పంచాయతీలను కలిపి ఒకే కేటగిరీగా చేశారు. నాన్‌ ప్రీమియం, ప్రీమియం అని రెండే తరగతులుగా విభజించారు. కొత్త జీవో ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నాన్‌-ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధరను రూ.20కి, గరిష్ఠ ధరను రూ.40కి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.50కి, గరిష్ఠ ధర రూ.70కి పెంచారు. మల్టీఫ్లెక్స్‌లలో రెగ్యులర్‌ సీట్ల ధరను రూ.100గా, రిక్లెయినర్‌ టికెట్‌ ధరను రూ.250గా నిర్ణయించారు. నగర పంచాయతీల్లోని థియేటర్లకూ ఇవే ధరలు వర్తిస్తాయి. అంటే జీవో 35 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 ఉన్న కనిష్ఠ ధరను ఇప్పుడు మూడు రెట్లు పెంచి, రూ.20 చేశారన్న మాట. కొంచెం అటూ ఇటూగా అన్ని ప్రాంతాల్లో టికెట్‌ ధరలు అదే తీరుగా పెరిగాయి. సినిమా రంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా టికెట్‌ ధరలు తగ్గిస్తూ జీవో 35 జారీచేసి, పేదలకు చౌకగా వినోదాన్ని అందించేందుకే ఆ పని చేశామని చెప్పి, ఇప్పుడు మళ్లీ ధరలు పెంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.