ETV Bharat / city

Amaravathi News: 'న్యాయ రాజధాని అన్న పదమేలేదు.. హైకోర్టు తరలింపు అంత సులభం కాదు'

author img

By

Published : Nov 17, 2021, 10:59 PM IST

ap high court on amaravathi cases
ap high court on amaravathi cases

ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలను సవాల్​ చేస్తు దాఖలైన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు వరుసగా మూడో రోజు విచారణ చేపట్టింది. మాస్టర్​ ప్లాన్​ను అమలు చేయడం లేదని.. రైతులకిచ్చిన ప్లాట్లకు విలువ లేకుండా చేశారని.. రైతుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్​ న్యాయవాది శ్యాందివాన్​ వాదనలు వినిపించారు.

ఏపీ రాజధాని కేసులపై ఆ రాష్ట్ర హైకోర్టులో వరుసగా మూడో రోజు కూడా విచారణ జరిగింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దెబ్బతిందంటూ వాదించారు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయలేదని ఏపీ ప్రభుత్వం చెబుతోందని.. కానీ, మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయకుండా నిలిపివేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రైతులకిచ్చిన ప్లాట్లకు విలువ లేకుండా చేశారని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు.

'విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. 3 రాజధానులతో మౌలిక వసతుల అభివృద్ధికి దెబ్బ. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు లేవని ప్రభుత్వం చెప్పింది. కానీ మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయకుండా నిలిపేశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకుండా చేశారు'

- శ్యాం దివాన్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

విచారణ సందర్భంగా న్యాయ రాజధానికి నిర్వచనం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అధికారం లేదని మరో న్యాయవాది సురేశ్‌ తెలిపారు. న్యాయ రాజధాని అన్న పదమే లేదన్నారు. విభజన చట్టం ప్రకారం అమరావతిలోనే హైకోర్టు ఉండాలన్నారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు తరలింపు అంత సులభం కాదని వాదనలు వినిపించారు.

రోజువారీ విచారణ.. సీజే కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరిదీ అని హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మంగళవారం వ్యాఖ్యానించారు. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో.. భూములిచ్చిన రైతులకో మాత్రమే సంబంధించినది కాదన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులకే భారతదేశం సొంతం కాదని, అది దేశ ప్రజలందరిదీ అని గుర్తుచేశారు. అదే విధంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకే అమరావతి పరిమితం కాదని కర్నూలు, విశాఖపట్నం వాసులు సహా రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుందన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక హక్కులు ఉంటాయని, వారిని ప్రత్యేక తరగతిగా చూడాలన్న నేపథ్యంలో సీజే పైవిధంగా స్పందించారు. సీనియర్‌ న్యాయవాది స్పష్టత ఇస్తూ.. మూడు రాజధానుల నిర్ణయంతో భూములిచ్చిన రైతుల, వారి భవిష్యత్తు తరాలు నష్టపోతాయన్నారు. హక్కులను రక్షించే క్రమంలో వారి త్యాగాలను ప్రత్యేకంగా చూడాలనేది తన ఉద్దేశం అన్నారు.

ఇదీచూడండి: TRS mlc nominations: ఆరుగురు తెరాస అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.