ETV Bharat / city

అసంతృప్తితో మాజీ మంత్రులు.. గ్రూపు మీటింగ్‌లు

author img

By

Published : Apr 9, 2022, 10:26 AM IST

AP Ex ministers : ఏపీ మంత్రిమండలి సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ముందు ఏమీ మాట్లాడలేక రాజీనామాపత్రాలపై సంతకాలు చేసిన మంత్రుల్లో చాలామంది మింగలేక, కక్కలేక అన్నట్లుగా ఉన్నారు. రాజీనామా చేయాల్సి రావడంపై అసంతృప్తి ఉన్నా బయటకు ప్రదర్శించలేక గుంభనంగా ఉండిపోతున్నారు. అసంతృప్తిని ఏదో రకంగా అధిష్ఠానానికి తెలియజేసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు.

AP Ex ministers
AP Ex ministers

AP Ex ministers : ఏపీ సీఎం జగన్‌ ముందు ఏమీ మాట్లాడలేక రాజీనామాపత్రాలపై సంతకాలు చేసిన మంత్రుల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వారి అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు.. కొందరు బృందంగా సమావేశం అయినట్లుగా సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి తలలో నాలుకలా.. విపక్ష నేతలపై విమర్శలతో విరుచుకుపడే ఇద్దరు మంత్రులు రాజీనామాల తర్వాత ఇళ్లకు కూడా వెళ్లకుండానే నేరుగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆ ఇద్దరూ 11న హైదరాబాద్‌ నుంచి నేరుగా ప్రమాణస్వీకారానికి వచ్చి కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెబుతారట! అదీ 11న కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి సూచించినందుకే అని అంటున్నారు.

నలుగురు మంత్రులైతే కేబినెట్‌ భేటీ నుంచి బయటకు రాగానే సచివాలయంలోనే కాసేపు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగలిగారన్న వాదన వినిపిస్తోంది. కొత్త కేబినెట్‌లోనూ కచ్చితంగా కొనసాగుతారని ప్రచారంలో ఉన్న ఓ సీనియర్‌ మంత్రి కూడా గురువారం మంత్రిమండలి సమావేశానికి ముందు నుంచీ చాలా దిగాలుగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకు ముందే..: కుదిరితే మంత్రివర్గంలో మమ్మల్ని ఇద్దరినీ ఉంచండి.. లేకపోతే ఇద్దర్నీ తీసేయండి. ఆయన్ను కొనసాగించి నన్ను తప్పిస్తే రాజకీయంగా నాకు ఇబ్బందికర పరిస్థితి అని ఒక మంత్రి ఇంతకు ముందే సీఎం వద్దే అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు సమాచారం. రెండో మంత్రిని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆయన రెండు మూడు రోజులపాటు బెంగళూరుకు వెళ్లిపోయినట్లు తెలిసింది. తిరిగొచ్చాక కూడా ఆయన ముఖ్యమంత్రిని కలిసి మళ్లీ పాతపాటే అందుకున్నారని, దానిపై సీఎం స్పష్టత ఇవ్వలేదని ప్రచారం సాగుతోంది. అయితే తన ప్రతిపాదనకు సీఎం సరే అన్నారని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు.

ఇంకో సీనియర్‌ మంత్రి రాజీనామాల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటి నుంచి రెండు, మూడు సందర్భాల్లో దిల్లీకి వెళ్లి వచ్చారని సమాచారం. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కొంత సీరియస్‌గా తీసుకుందని వైకాపా వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. ఆయన ఎందుకెళ్లారో స్పష్టత లేనప్పటికీ ఈ సమయంలో వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

గుళ్లూ, గోపురాలు.. లాబీయింగ్‌లు..: ఈసారి కచ్చితంగా అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యే కొద్ది రోజులుగా తిరుమల సహా ప్రసిద్ధ ఆలయాలకు తిరుగుతున్నారు. ఇప్పటికే కీలక పదవిలో ఉన్న ఒక నాయకుడు మంత్రిమండలిలో చేరేందుకు ప్రత్యేకంగా రెండురోజులపాటు హోమం కూడా చేయించినట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరైతే ఆశ్రమాలు, పీఠాలకు వెళ్లి నక్షత్రబలాల గురించి తెలుసుకుంటున్నారు.పార్టీలోని పెద్దల ద్వారా ప్రమోట్‌ చేయించుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలోని ఒక ప్రముఖ ఆశ్రమం నుంచి లాబీయింగ్‌కి ప్రయత్నిస్తుంటే, మైనింగ్‌ కింగ్‌గా పేరున్న కర్ణాటకకు చెందిన ఒక మాజీ మంత్రి ద్వారా చెప్పించుకునేందుకు రాయలసీమలో ఒక మహిళా ఎమ్మెల్యే కుటుంబసభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

మంత్రి పదవి రాకపోతే జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ‘ఈసారి మంత్రి పదవి రాకపోతే, ప్రత్యర్థులను తట్టుకోలేం. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున మరో అభ్యర్థిని నిలబెట్టే యోచన చేయండి’ అని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సీఎంకు చెప్పారని విస్తృత ప్రచారం సాగుతోంది.

26 జిల్లాలైతే ఒక లెక్క..: కొత్త మంత్రులను కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా? లేదా ఉమ్మడి జిల్లాలే యూనిట్‌గా తీసుకుంటారా అనేది వైకాపా, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక, రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొంతమందిని కొనసాగించాల్సి వస్తోందని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలకు వివిధ సందర్భాల్లో జగన్‌ వెల్లడించారు. అయితే గురువారం మంత్రిమండలి భేటీలో వీటితోపాటు కొత్త జిల్లాల్లోనూ సర్దుబాటు చేయాల్సి ఉంటుందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. 26 జిల్లాలకు ఒక్కో మంత్రి చొప్పున అయితే కొత్త మంత్రుల జాబితా ఒకలా ఉంటుంది.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా అయితే అనూహ్య నిర్ణయాలు ఉండొచ్చని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి దీనిపై కొంత చర్చించినా ఎలాంటి అంశాలూ బయటికి రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.