ETV Bharat / city

Amaravati Farmers : సీఆర్‌డీఏ, రెరాకు నోటీసులిచ్చిన అమరావతి రైతులు

author img

By

Published : Mar 21, 2022, 8:25 AM IST

Amaravati Farmers
Amaravati Farmers

Amaravati Farmers : సీఆర్‌డీఏ, రెరాకు అమరావతి రైతులు నోటీసులిచ్చారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రెరా సుమోటోగా సీఆర్‌డీఏనే తమ పరిధిలోకి తీసుకోవాలని రైతులు కోరారు.

Amaravati Farmers : ఏపీ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)కు అమరావతి రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రెరా సుమోటోగా సీఆర్‌డీఏనే తమ పరిధిలోకి తీసుకోవాలని రైతులు కోరారు.నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 'మాకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని రాజధాని కోసం త్యాగం చేశాం. మా జీవనానికి ఇబ్బంది అని తెలిసినా, ఆ భూమితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్నీ తెంచుకుని సమీకరణలో ఇచ్చేశాం. బదులుగా సీఆర్‌డీఏ చట్టం కింద... రాజధానిలో అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇస్తామన్నారు. ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు’ అని రాజధాని రైతులు సీఆర్‌డీఏ కమిషనరు దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి చేసిన ప్లాట్ల స్వాధీనంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ ద్వారా కంచర్ల ఓంకార్‌, తదితర రైతులు సీఆర్‌డీఏ కమిషనరుకు లీగల్‌ నోటీసులిచ్చారు. పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.

నోటీసుల్లో ఏం ఉందంటే..

Amaravati Farmers Notice to CRDA : ‘భూ సమీకరణ పథకంలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయాల్సి ఉంది. మూడేళ్లలోగా మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తుది ప్రకటనను 2016 డిసెంబరు 30న సీఆర్‌డీఏ ఇచ్చింది. 2019 నుంచి రాజధానిలో అన్ని రకాల అభివృద్ధి, మౌలిక వసతుల పనులూ ఆగిపోయాయి. ఈ చర్యలు మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆదాయం కోల్పోయి అప్పులతో బతుకులీడ్చాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని భూ సమీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులతో కూడిన ప్లాట్లను అప్పగించాలి. దీంతోపాటు జాప్యం జరిగిన కాలానికి నివాస ప్లాట్‌కు చ.గజానికి నెలకు రూ.100 చొప్పున, వాణిజ్య ప్లాట్‌కు నెలకు రూ.150 పరిహారంగా చెల్లించాలి. సీఆర్‌డీఏకు స్వాధీనం చేసిన ప్రతి ఎకరా వ్యవసాయ భూమికీ రూ.3 లక్షలు తక్కువ కాకుండా చెల్లించాలి. విఫలమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మా హక్కుల పరిరక్షణకు హైకోర్టును ఆశ్రయిస్తాం’ అని పేర్కొన్నారు.

భూ సమీకరణ ప్రాజెక్టును ఎందుకు రిజిస్టర్‌ చేయలేదు?

Amaravati Farmers Notice to RERA : ఏపీ రెరాకూ (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) రాజధాని రైతులు నోటీసులిచ్చారు. ‘భూసమీకరణ చట్టంలోని సెక్షన్‌ 52 ప్రకారం స్వచ్ఛందంగా భూములను స్వాధీనం చేసిన వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. దీనిని రెరా చట్టం కింద నమోదు చేయించాలి. సీఆర్‌డీఏ ప్రమోటర్‌ అయినందున తప్పనిసరిగా ఈ చట్టం వర్తిస్తుంది. రెరా అమలులోకి వచ్చిన తర్వాత చేపట్టే ప్రాజెక్టులతో పాటు అప్పటికే నడుస్తున్న వాటినీ కచ్చితంగా నమోదు చేసుకోవాలి. కానీ... ఇప్పటి వరకూ రెరాగానీ సీఆర్‌డీఏగానీ ఈ దిశగా చర్యలు ప్రారంభించలేదు. దీనివల్ల మా హక్కులకు భంగం కలిగింది. న్యాయం కోసం రెరాను ఆశ్రయించాల్సి వచ్చింది. సీఆర్‌డీఏ వైపు నుంచి జరిగిన అసాధారణ జాప్యానికి పరిహారం, వడ్డీ కోరే హక్కును చట్టం కల్పించింది. సుమోటోగా తీసుకుని సీఆర్‌డీఏ భూసమీకరణ ప్రాజెక్టును రియల్‌ ఎస్టేట్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేయండి లేదా చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీఆర్‌డీఏకు జరిమానా విధించండి. ఈ నోటీసు అందిన వారంలో చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా చట్టపరంగా ముందుకు సాగుతాం’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.