ETV Bharat / city

రాజధాని జిల్లాల్లోని భూముల ఈ వేలంలో చేదు అనుభవం

author img

By

Published : Aug 14, 2022, 8:04 AM IST

అమరావతి
అమరావతి

Amaravathi Capital Lands ఏపీలో రాజధాని అమరావతి జిల్లాల్లోని భూములను వేలం వేసినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రభుత్వానికి ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్న భావన అందరిలోనూ ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సొంతంగా నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు ఫలించడం లేదు.

Amaravathi Capital Lands: ఆంధ్రప్రదేశ్​లో అమరావతిపై జగన్‌ ప్రభుత్వ వైఖరి కారణంగా రాజధాని జిల్లాల్లోని భూములను వేలం వేసినా ఎవరూ ఆసక్తి చూపలేదు. రేయింబవళ్లు చురుగ్గా సాగుతున్న రాజధాని పనులు ఆగిపోవడం, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పల్లవిని ఎత్తుకోవడమే ఇందుకు కారణం. దీనికితోడు ప్రభుత్వం అమరావతిలో మొక్కుబడిగా పనులు చేస్తోంది. ప్రభుత్వానికి ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్న భావన అందరిలోనూ ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సొంతంగా నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు ఫలించడం లేదు.

వేలానికి 56.2 ఎకరాలు: రాజధాని ప్రాంతంలోని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సీఆర్‌డీఏ ఆధీనంలో ఉన్న స్థలాల విక్రయానికి అనుమతిస్తూ జూన్‌ 6న ప్రభుత్వం 389, 390 జీవోలిచ్చింది. తొలి విడతగా ఐదు లాట్లలో తెనాలి, నవులూరు, పాయకాపురం, ఇబ్రహీంపట్నంలోని 56.2 ఎకరాల్లో వంద నివాస, వాణిజ్య ప్లాట్లను వేలానికి ఉంచారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని టౌన్‌షిప్‌లో 2.81 ఎకరాలలో ఉన్న 15 ప్లాట్లను వేలానికి పెట్టారు.

ఇందులో చ.గజం ప్రారంభ ధర రూ.32 వేలుగా నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లోని 8.03 ఎకరాలలోని 18 ప్లాట్లకు అప్‌సెట్‌ ధర రూ.16 వేలు. విజయవాడ గ్రామీణం పాయకాపురంలోని టౌన్‌షిప్‌లో 7.01 ఎకరాలలో ఉన్న 39 ప్లాట్లకు ప్రారంభ ధర చ.గజం రూ.25 వేలు. ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌ వద్ద ఉన్న లేఅవుట్‌లో 0.87 ఎకరాల్లో ఉన్న 28 ప్లాట్ల ప్రారంభ ధర రూ.10 వేలుగా పెట్టారు.

స్పందించింది ఒక్కరే: ఈ వేలం పద్ధతిలో కొనుగోలుదారులనుంచి సీఆర్‌డీఏ బిడ్లను ఆహ్వానించింది. గడువులోగా కేవలం ముగ్గురే దరఖాస్తు చేశారు. అప్‌సెట్‌ ధర కన్నా చ.గజానికి కేవలం రూ.వంద ఎక్కువతో ఒక్కరే బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. నాలుగు చోట్లా వచ్చిన కొనుగోలుదారులకు సదుపాయాలను వివరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని సీఆర్‌డీఏ నియమించింది. ప్రచారం కోసం రూ.50 లక్షల వరకు వెచ్చించినప్పటికీ, ఆ ఖర్చులూ గిట్టుబాటు కాలేదు.

మరో 14 ఎకరాలకు సన్నాహాలు: తొలి విడత వేలానికి స్పందన లేకపోయినా మరో ప్రయత్నానికి సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. ఈసారి కోర్‌ క్యాపిటల్‌లోని 14 ఎకరాలను వేలానికి సిద్ధం చేస్తున్నారు. ఇందులో బీఆర్‌ షెట్టి మెడిసిటీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన పదెకరాలు, ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌కు ఇచ్చిన నాలుగెకరాలు ఉన్నాయి. వీటికి సంబంధించి అప్‌సెట్‌ ధరను గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించాల్సి ఉంది.

ఇవీ చదవండి: కాంగ్రెస్​ హోంగార్డునంటూ ట్విటర్​ ప్రొఫైల్​ మార్చేసిన కోమటిరెడ్డి

వచ్చే ఏడాది డిసెంబర్​లోనే అయోధ్య రాముడి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.