ETV Bharat / city

'తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు నది పాలు'

author img

By

Published : Sep 23, 2020, 8:52 AM IST

అక్కడి భూముల్లో బంగారు పంటలు పండుతాయి. విభిన్న రకాలైన పంటల సాగుకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. అయితే.... ఏటా వరదల వేళ సంభవించే గోదారి కోత అక్కడి రైతుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. పచ్చని పంట భూములు చూస్తుండగానే గోదారి పాలవుతూ తీరని వేదనను మిగులుస్తున్నాయి.

తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు నదిపాలు
తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు నదిపాలు

తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు నదిపాలు

బతుకుకు భరోసానిచ్చే పంట భూములు గోదారి కోతతో కళ్లముందే అదృశ్యమవుతుంటే లంక గ్రామాల రైతులు నిలువునా కన్నీరుమున్నీరవుతున్నారు. ఏటా గోదావరికి వచ్చే వరదలతో లంకల్లోని నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు.. కొబ్బరి, అరటి లాంటి పచ్చని పంటలతో పాటే నదీ గర్భంలో కలిసి పోతున్నాయి. ఈ ఏడాది 30 కిలోమీటర్ల మేర బ్యారేజీ ఎగువ, దిగువన ఉన్న ప్రాంతాలు కోతకు గురైనట్టు జలవనరుల శాఖ అంచనా వేయడం పరిస్థితికి నిదర్శనం. ఏకంగా 450 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా. కష్టపడి పెంచిన కొబ్బరి తోటలు, పంటలు నదిలో కుప్పకూలుతుంటే రైతులు నిస్సహాయులుగా చూస్తున్నారు.

ఏపీలోని కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి లాంటి గోదావరి నదీ పాయలను ఆనుకొని ఉన్న ప్రాంతంలో కోత చాలా ఎక్కువగా ఉంటోంది. కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పరిధిలోని తీరం తీవ్ర కోతకు గురవుతోంది. ఆర్‌.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, కటారిలంక, ముంజవరం, తొండవరం, తొట్లపాలెం లంక గ్రామాలు భారీగా కోత బారిన పడుతున్నాయి. బోడసకుర్రు, గోపాయలంక, బోడిగోడితిప్ప, బడుగువాని లంక, సలాదివారిపాలెం, మధ్యలంక, లంక ఆఫ్‌ ఠానేలంక, గురజాపులంక, కూనాలంకల్లో పంట పొలాలు క్రమంగా నదిలో కలిసిపోతున్నాయి.

గోదావరి కోత కారణంగా అనేక ఇళ్లు సైతం నదీ గర్భంలో కలిసిపోయి, అక్కడ నివసిస్తున్న వారు నిరాశ్రయులు అవుతున్నారు. 1154.80 కోట్ల రూపాయలు వెచ్చించి తూర్పు గోదావరి జిల్లాలో నదీకోత నివారణ పనులు చేపట్టాలని 5 నెలల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇటీవలి వరదలకు నదీ కోత మరింత పెరిగింది. ప్రస్తుతం మొత్తం రక్షణ పనులకు సుమారు 17 వందల కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా. ప్రభుత్వం ఇప్పటికైనా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి తమకు జీవనాధారమైన పంట భూముల్ని కాపాడాలని లంక గ్రామాల రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:చిత్తడవుతున్న రహదారులు.. ప్రమాదాలతో వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.