ETV Bharat / city

'అమ్మ భాషను మరచి... పరాయి భాష వెంట పరుగులేంటి?'

author img

By

Published : Dec 29, 2019, 9:02 PM IST

మాతృభాష కోసం ప్రతి ఒక్కరూ పరిక్రమించాలని విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పిలుపునిచ్చాయి. విజయవాడ వేదికగా 3 రోజులపాటు సాగిన మహాసభలు ముగింపు రోజున... పాఠశాలల్లో తెలుగుమాధ్యమం కొనసాగించాలని వక్తలు ముక్తకంఠంతో కోరారు. తెలుగుభాషను రక్షించుకోవాల్సిన అవసరముందని అందరూ అభిప్రాయపడ్డారు.

4th-world-telugu-writers-conference-2019-end-today
'అమ్మ భాషను మరచి... పరాయి భాష వెంట పరుగులు ఏంటి?'

'అమ్మ భాషను మరచి... పరాయి భాష వెంట పరుగులు ఏంటి?'

తెలుగుభాష గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేస్తూ... మాతృ భాష పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ విజయవాడ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ముగిశాయి. తెలుగు భాషను 'కాపాడుకుందాం....స్వాభిమానాన్ని చాటుకుందాం' అనే నినాదంతో మూడు రోజులపాటు జరిగాయి. గతంలో జరిగిన మూడు మహాసభల కంటే ఈసారి దాదాపు 1500 మందికిపైగా ప్రతినిధులు, సభ్యులు హాజరయ్యారు. వివిధ వేదికల ద్వారా 15 సదస్సులు, చర్చలు, సాహితీ సమ్మేళనాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరిరోజు గిడుగు రామ్మూర్తి సాహితీ సాంస్కృతిక వేదికపై రాష్ట్రేతర ప్రతినిధులు, పత్రికా, ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధులు, మహిళా ప్రతినిధుల సదస్సులు నిర్వహించారు. భాష నాడు-నేడు పేరుతో స్వతంత్ర భారతి రమేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య దీపిక అందరినీ అలరించింది.

ఆంగ్లం... ఎంతవరకు సమంజసం

పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తుంటే... భాష ప్రాతిపదికన ఏర్పడిన మన రాష్ట్రంలో తెలుగును విస్మరిస్తున్నారని తెలుగు రచయితల మహాసభల కమిటీ గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. మాతృభాషను విస్మరిస్తే పదకోశాలు, నిఘంటువులు వృథా అవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిదేశంలో మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంటే మన పాలకులు ఆంగ్లం వెంట పరుగెత్తడం ఎంతవరకు సమంజసమని ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మాతృభాష అంతమైతే తెలుగుజాతి అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి

పత్రికా ప్రసార మాధ్యమరంగ ప్రతినిధుల సదస్సులో హాస్యబ్రహ్మ శంకర నారాయణ, తెలుగు వెలుగు ఎడిటర్ జాస్తి విష్ణు చైతన్య పాల్గొన్నారు. మాతృభాషను రక్షించుకునే ఉద్దేశంతోనే ఈనాడు, తెలుగువెలుగు, చతుర, విపుల, బాల భారతం పత్రికలు నడిపిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మాతృభాష గొప్పదనాన్ని తెలియజేయాల్సిన అసరముందని చెప్పారు. మూడు రోజుల పాటు సాగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు... మహిళా ప్రతినిధుల సదస్సు అనంతరం ఘనంగా ముగిశాయి.

తీర్మానాలు ఇవే

మాతృభాషను కాపాడుకుందాం... స్వాభిమానం చాటుకుందాం నినాదంతో ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభల తీర్మానాలు చేశాయి. అవి

  • ప్రాథమిక స్థాయి నుంచి బోధనా విధానం తెలుగులో ఉండాలని మహాసభల విజ్ఞప్తి
  • తెలుగుభాషకు ప్రమాదం వాటిల్లితే స్పందించేలా ప్రపంచ తెలుగు రచయితలకు విజ్ఞప్తి
  • ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వారికి తెలుగు నేర్పేందుకు బోధనా వ్యవస్థ కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి
  • తెలుగులోనూ ప్రాథమిక, మాధ్యమిక, విశారద వంటి కోర్సులను తీసుకురావాలని తీర్మానం
  • తెలుగు గ్రంథాల రచన, ప్రచురణ, పంపిణీకి తోడ్పడేలా సంస్థలు, వ్యక్తులు ముందుకురావాలని విజ్ఞప్తి
  • తెలుగు భాషను ఆధునీకరించే కృషి వేగవంతం చేయాలని తీర్మానం
  • తెలుగును ప్రపంచ భాషగా తీర్చిదిద్దేందుకు అందరూ ముందుకు రావాలని తీర్మానం
  • సాంకేతిక పదాల అనువాదం విషయంలో నిపుణులు కృషి చేయాలని విజ్ఞప్తి
  • జ్ఞాపికలకు బదులు తెలుగు గ్రంథాలు ఇచ్చి సాహిత్య వ్యాప్తికి కృషి చేయాలని విజ్ఞప్తి
  • ఊరూరా తెలుగు వేదికల కోసం భాషాభిమానులు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి

ఇదీ చదవండి:'తెలుగును ఉపాధి భాషగా పరిగణించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.