ETV Bharat / business

కుబేరులను పెద్దదెబ్బ తీసిన 2022.. కోట్లకు కోట్లు లాస్​!

author img

By

Published : Jul 2, 2022, 7:57 PM IST

మస్క్
మస్క్

ప్రపంచ బిలియనీర్లకు ఈ ఏడాది కలిసి రాలేదు. కేవలం ఆరు నెలల్లోనే 1.4 ట్రిలియన్​ డాలర్ల సంపద ఆవిరైందట. ఉద్దీపనలను ఉపసంహరించడం, వడ్డీరేట్ల పెంపు మొదలైన కారణాల వల్ల ఈ నష్టం వచ్చింది. అయితే సంపద ఎంత కరిగినప్పటికీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు ఏమాత్రం తగ్గలేదు.

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో రెండేళ్ల పాటు భారీగా సంపదను పోగేసుకున్న ప్రపంచ బిలియనీర్లు ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2022 ఆరంభం మొదలుకొని ప్రపంచ కుబేరుల సంపద కరుగుతూ వస్తోంది. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపదలో ఈ ఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లు తగ్గింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపదలో 63 బి.డాలర్లు కరిగిపోయింది. మెటా అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపదైతే ఏకంగా సగానికి పడిపోయింది.

మొత్తంగా బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలోని తొలి 500 మంది కుబేరుల సంపద 2022 తొలి అర్ధభాగంలో 1.4 ట్రిలియన్‌ డాలర్ల (రూ.1.10 కోట్ల కోట్లు) సంపద ఆవిరైంది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీ ఉద్దీపన పథకాల్ని ప్రకటించాయి. దీంతో టెక్‌ సంస్థలు భారీగా లాభపడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థల అధిపతుల సంపద ఒక్కసారిగా పెరిగింది. తాజాగా కొవిడ్‌ సంక్షోభం సమసిపోతుండడంతో ఆయా దేశాలు ఉద్దీపన ఉపసంహరణలను కొనసాగిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతోంది. టెస్లా, అమెజాన్‌ షేర్లు జూన్‌తో ముగిసిన మూడు నెలల వ్యవధిలో అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి.

సంపద ఎంత కరిగినప్పటికీ.. వ్యవస్థలో ఆర్థిక అంతరాలు ఏమాత్రం తగ్గలేదు. 63 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయినప్పటికీ.. ఇప్పటికీ ఎలాన్‌ మస్కే 210 బిలియన్‌ డాలర్లతో భూమిపై అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. 133 బిలియన్‌ డాలర్ల సంపదతో జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 128 బి.డాలర్లు, బిల్‌గేట్స్‌ 115 బి.డాలర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో 100 బి.డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు వీరు నలుగురే. ఏడాది ఆరంభంలో ఈ సంఖ్య 10గా ఉండడం గమనార్హం.

బిలియనీర్స్‌ జాబితాలో తొలి 10 స్థానాల్లో ఉన్నవారు..

  • ఎలాన్‌ మస్క్‌ - 210 బి.డాలర్లు
  • జెఫ్‌ బెజోస్‌ - 133 బి.డాలర్లు
  • బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ - 128 బి.డాలర్లు
  • బిల్‌ గేట్స్‌ - 115 బి.డాలర్లు
  • లారీ పేజ్‌ - 99.2 బి.డాలర్లు
  • గౌతమ్‌ అదానీ - 98.8 బి.డాలర్లు
  • వారెన్‌ బఫెట్‌ - 96.4 బి.డాలర్లు
  • సెర్గీ బ్రిన్‌ - 95.1 బి.డాలర్లు
  • స్టీవ్‌ బామర్‌ - 91.9 బి.డాలర్లు
  • లారీ ఎల్లిసన్‌ - 87.2 బి.డాలర్లు

ఇదీ చూడండి : Suchitra Ella : దక్షిణాది రాష్ట్రాలకు.. సుచిత్ర ఎల్ల సూచన !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.