ETV Bharat / business

ఉక్రెయిన్-రష్యా​ యుద్ధం ఎఫెక్ట్​.. 23.2 శాతం పెరిగిన వంటనూనెల ధరలు

author img

By

Published : Apr 9, 2022, 10:55 AM IST

Updated : Apr 9, 2022, 11:13 AM IST

edible oils
ఉక్రెయిన్​ క్రైసిస్

Edible Oil Prices Hike: రష్యా ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో గోధుమ, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటాయి. ఎఫ్‌ఏఓ ఆహార ధరల సూచీ ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 12.9 శాతం పెరిగింది. పొద్దుతిరుగుడు నూనెతో సహా వంటనూనెల ధరలు 23.2 శాతం పెరిగాయి.

Edible Oil Prices Hike: ఉక్రెయిన్​లో రష్యా సాగిస్తున్న యుద్ధం వల్ల గత నెల నుంచి ప్రపంచమంతటా ఆహారం, వంట నూనెల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల ప్రజలను ఆకలి, పోషకాహార లోపం పీడిస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) శుక్రవారం తెలిపింది. ఎఫ్‌ఏఓ ఆహార ధరల సూచీ ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 12.9 శాతం పెరిగింది. 1990లో ప్రారంభమైన ఈ సూచీ ఇంతగా ఎన్నడూ పెరగలేదు. ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతులలో రష్యా, ఉక్రెయిన్‌ల వాటా వరుసగా 30, 20 శాతాలుగా ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయి ఆహార ధాన్యాల ధరలు 17.1 శాతం పెరిగాయని ఎఫ్‌ఏఓ తెలిపింది. పొద్దుతిరుగుడు నూనెతో సహా వంటనూనెల ధరలు 23.2 శాతం పెరిగాయి. పొద్దుతిరుగుడు నూనె ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యుద్ధం, ఆంక్షలు, నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రాల నుంచి నౌకల రాకపోకలు నిలిచిపోవడం వల్ల గోధుమ, వంటనూనెల ఎగుమతులు దెబ్బతిని ప్రపంచమంతటా ధరలు పెరిగిపోతున్నాయి.

అమెరికా, చైనాల్లో అనావృష్టి ఆహారోత్పత్తిని దెబ్బతీసినందున రష్యన్, ఉక్రెయిన్‌ ఎగుమతుల లోటును భర్తీ చేయడం వీలుపడటం లేదు. అదీకాకుండా ఎరువులు, ఇంధన ధరలు పెరిగి, కొవిడ్‌ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఆఫ్రికా మధ్య, పశ్చిమ భాగాల్లోని సాహెల్‌ ప్రాంతం, నైజీరియాలో 60 లక్షల మంది పోషకాహార లోపం బారిన పడ్డారు. అక్కడి పట్టణాల్లో 1.6 కోట్లమంది ప్రజలకు ఆహార భద్రత కొరవడుతోంది. సాహెల్, నైజీరియాలలో 2.2 కోట్లమందికి ఆరు నెలలపాటు ఆహారం అందించడానికి 77.7 కోట్ల డాలర్ల నిధులు కావాలని ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమ సంస్థ ప్రపంచ దేశాలను కోరింది. నిరుపేద దేశాలకు ఆహార దిగుమతుల వ్యయాన్ని తగ్గించడానికి ఎఫ్‌ఏఓ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇదీ చూడండి : 'వడ్డీ రేట్లు యథాతథం- కొంతకాలం ధరల భారం ఖాయం!'

Last Updated :Apr 9, 2022, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.