ETV Bharat / business

Vehicle Insurance Renewal Guidelines : వాహన బీమా​ పాలసీని రెన్యూవల్​ చేస్తున్నారా!.. ఈ జాగ్రత్తలు పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 5:00 PM IST

Vehicle Insurance Renewal Guidelines : మీ వాహనానికి ఇన్సూరెన్స్​ ఉందా? సరైన సమయంలోనే బీమా​ పాలసీని రెన్యూవల్​ చేస్తున్నారా! ఒకవేళ చేయకుంటే ఏం జరుగుతుంది. ఇన్సూరెన్స్​ పాలసీని పునరుద్ధరణ చేసే సమయంలో ఏయే విషయాలు గుర్తుంచుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

vehicle-insurance-renewal-guidelines-and-mistakes-to-avoid-while-renewing-vehicle-insurance-policy
వాహన బీమా రెన్యూవల్​ గైడ్​లైల్స్​

Vehicle Insurance Renewal Guidelines : వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆ వెహికిల్​కు తప్పనిసరిగా బీమా చేయించాలి. ఈ బీమాల్లో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి సమగ్ర (Comprehensive) బీమా అయితే మరొకటి థర్డ్‌ పార్టీ బీమా. వాహనం రోడ్డుపై తిరగాలంటే కనీసం థర్ట్‌ పార్టీ బీమా అయినా ఉండి తీరాలి. అదే విధంగా గడువు ముగిసిన పాలసీని వెంటనే రెన్యూవల్‌ చేసుకోవాలి. కాకపోతే పాలసీని రెన్యూవల్‌ చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బేరమాడాల్సిందే..
వెహికల్‌ ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ చేసుకునేటప్పుడు బీమా సంస్థలు ఎంత చెప్పితే అంత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీని కోరుతూనే.. ప్రీమియాన్ని తగ్గించమని అడగాలి. మీకు ఆ వెసులుబాటు ఉంది. వాహనం కొనుగోలు చేసి ఎన్ని రోజులు అవుతోంది? దాని మార్కెట్‌ విలువ ఎంత? వాహన కండిషన్‌ లాంటి ఇతర అంశాల ఆధారంగా ప్రీమియంను నిర్ధరిస్తాయి బీమా కంపెనీలు. మీ వాహనంలో ఎటువంటి లోపాలూ లేనట్లయితే.. ప్రీమియంను తగ్గించమని మీరు బీమా సంస్థను కోరవచ్చు. అప్పుడు వారు వాహనాన్ని పూర్తిగా పరిశీలించి నిబంధనల మేరకు ప్రీమియం తగ్గించే అవకాశం ఉంటుంది.

కొత్తదైతే సమగ్ర పాలసీ మేలు..
కొత్తగా వాహనం కొనుగోలు చేసినప్పుడు సమగ్ర పాలసీ తీసుకోవడం మంచిది. ఈ పాలసీలో ఓన్‌ డ్యామేజ్‌తో పాటు థర్డ్‌ పార్టీ కూడా కవరేజ్​లోకి వస్తుంది. వాహనం మరీ పాతదైతే మాత్రం 'ఓన్‌ డ్యామేజ్‌'ను తీసుకోకపోయినా పెద్దగా ప్రభావం ఉండదు. దీంతో ప్రీమియంపై కొంత వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. మీరు వాహనం నడిపే తీరు, వాహనం విలువ, మీ ఆర్థిక స్తోమత ఆధారంగా ఓన్‌ డ్యామేజ్‌ను వదులుకోవడం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

ముందే పునరుద్ధరించాలి..
గడువు తేది కంటే ముందే పాలసీని రెన్యూవల్​ చేయడం మంచిదని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రీమియంలో కొంత మేరకు రాయితీ, లేదా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దాంతోపాటు నో-క్లెయిం-బోనస్‌ కూడా పొందొచ్చని అంటున్నారు. రెన్యూవల్ గడువు ముగిస్తే వీటిని వదులుకోవాల్సి ఉంటుంది. కనుక పాలసీని ముందే రెన్యూవల్​ చేసుకోవడం ఉత్తమం.

యూసేజ్‌ ఆధారిత పాలసీలు..
మీరు తరచుగా వాహనాన్ని బయటకు తీసే అవసరం లేకపోతే.. ఈ తరహా పాలసీలను పరిశీలించవచ్చు. ఈ రకం పాలసీలలో ప్రీమియం భారం కొంతమేరకు తక్కువగా ఉంటుంది. యూసేజ్‌ ఆధారిత పాలసీలో వాహన వినియోగం ఆధారంగా ప్రీమియాన్ని నిర్థరిస్తారు. డ్రైవింగ్‌ బిహేవియర్‌, మైలేజ్‌, ఇప్పటి వరకు వాహనం ప్రయాణించిన దూరం.. తదితర అంశాలను బేరీజు వేసుకుని పాలసీని అందిస్తారు. ప్రీమియం కూడా అందుకు అనుగుణంగానే మారుతుంటుంది.

యాడ్‌-ఆన్‌లు..
క్లిష్ట పరిస్థితుల్లో ఈ యాడ్‌-ఆన్ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ఇన్సూరెన్స్‌కి యాడ్‌-ఆన్ పాలసీ జత చేసుకుంటే అది మరింత సమగ్రంగా మారుతుంది. ఉదాహరణకు.. మీరు వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో నివాసం ఉంటే.. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ తీసుకుంటే మేలు. ఇంజిన్‌లోకి ఒకవేళ నీరు వెళ్లి డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. దాంతోపాటు 'రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌' యాడ్‌-ఆన్‌ను తీసుకుంటే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వాహనం ఎప్పుడైనా ప్రయాణం మధ్యలో మొరాయించినప్పుడు ఖర్చు లేకుండా దానిని సర్వీసింగ్‌ సెంటర్‌కు తరలించి రిపేర్​ చేయించవచ్చు.

సరైన బీమా కంపెనీ..
బీమా తీసుకునే సమయంలో అత్యంత ప్రధానమైన అంశం సరైన బీమా కంపెనీని ఎంచుకోవడం. పాలసీకి ముందు బీమా కంపెనీ విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. 'క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో' ఎక్కువగా ఉన్న కంపెనీల్లో పాలసీ తీసుకోవడం ఉత్తమం. దాంతోపాటు వేగంగా, తక్కువ పేపర్‌ వర్క్‌తో సెటిల్‌ చేసేలా ఉండాలి. ప్రీమియం తక్కువగా ఉందన్న కారణంతో అనామక పాలసీలను తీసుకోద్దు. బీమా కంపెనీ సమగ్ర సమాచారం తెలుసుకున్నాకే సదరు సంస్థలో పాలసీ తీసుకోవాలి.

వివరాల్లో తప్పులు ఉండకుండా చూసుకోవాలి..
బీమా పాలసీ తీసుకునే సమయంలో వాహనం, యజమాని ఇతర వివరాల్లో తప్పులు లేకుండా జాగ్రత్తపడాలి. మీ దృష్టికి వచ్చిన అన్ని తప్పులను వెంటనే బీమా సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. మోసపూరిత క్లెయింలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది శిక్షార్హమైన నేరం. పూర్తి జాగ్రత్తలతో వాహన బీమా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కష్టకాలంలో మీ జేబుపైనే ఆర్థిక భారం పడుతుంది.

IPhone 15 Offers : యాపిల్​ లవర్స్​కు గుడ్​న్యూస్​.. రూ.31 వేలకే ఐఫోన్​ 15.. ఎలా పొందాలో తెలుసా!

Home Loan With Salary : మీరు ఉద్యోగం చేస్తున్నారా?.. జీతం ఆధారంగా హోమ్​ లోన్ ఎంత వస్తుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.