ETV Bharat / business

Home Loan With Salary : మీరు ఉద్యోగం చేస్తున్నారా?.. జీతం ఆధారంగా హోమ్​ లోన్ ఎంత వస్తుందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 12:23 PM IST

Home Loan With Salary : మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీ జీతం ఆధారంగా హోమ్​లోన్​ తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ శాలరీ ఆధారంగా లోన్​ తీసుకుందామని అనుకుంటే.. అందుకు తగ్గ అర్హతలు, విధివిధానాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Home Loan On Salary
Home Loan With Salary

Home Loan With Salary : మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఈ జీతం డబ్బులను ఆధారంగా చూపించి, హోమ్​ లోన్​ తీసుకుందామని ఆశిస్తున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులకు లోన్స్ మంజూరు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటాయి. ఎందుకంటే, ఉద్యోగులకు నెలవారీగా జీతం వస్తుంది. కనుక కచ్చితంగా ఈఎంఐ లేదా రుణ బకాయిలను గడువులోగా చెల్లించగలుగుతారనే భరోసా ఉంటుంది.

బ్యాంక్​లు ఏమి చూస్తాయి?
సాధారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు.. రుణ గ్రహీత ఆదాయం, క్రెడిట్​ స్కోర్​, రుణ చెల్లింపు సామర్థ్యం సహా పలు అంశాలను పరిశీలిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రుణం పొందడానికి జీతం ఒక్కటే సరిపోతుందా?
Home Loan Eligibility Criteria For Employee : బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు నిబంధనలు మాత్రమే కాకుండా.. మీ EMI & NMI నిష్పత్తిని కూడా చూస్తాయి. NMI అంటే నికర నెలవారీ ఆదాయం. సింపుల్​గా చెప్పాలంటే, పన్నులు, ఇతర కటింగ్​లు పోగా.. ఇంటికి తీసుకువెళ్లే జీతమే ఎన్​ఎంఐ. ఎస్​బీఐ వెబ్​సైట్​లో ఉన్న సమాచారం ప్రకారం, సాధారణంగా ఈఎంఐ/ఎన్​ఎంఐ నిష్పత్తి అనేది మీ నికర సంవత్సర ఆదాయాన్ని అనుసరించి 20% - 70% వరకు ఉంటుంది. ఒక వేళ ఇద్దరు పార్టనర్స్​ కలిసి గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే.. లోన్​ అమౌంట్​ మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ జీతం లేదా ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే.. లోన్ అమౌంట్ కూడా అంత ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.

ఉదాహరణకు, మీ నికర నెలవారీ జీతం (NMI) రూ.50,000 అనుకుందాం. అయితే మీరు రూ.80 లక్షల వరకు బ్యాంక్​ లోన్​ కావాలని దరఖాస్తు చేశారని అనుకుందాం. అప్పుడు బ్యాంక్​ మీ ఈఎంఐ/ఎన్​ఎంఐ రేషియోను చూస్తుంది. ఒక వేళ ఇది ఒక లిమిట్​లోనే ఉంది అనుకుంటే.. అప్పుడు బ్యాంకులు LTV నిష్పత్తిని చూస్తాయి. ఎల్​టీవీ అంటే 'లోన్​-టు-వాల్యూ'. ఇది కూడా ఒక పరిమితిలోపే ఉంటే.. అప్పుడు బ్యాంకులు మీకు రుణాన్ని మంజూరు చేస్తాయి.

LTV Ratio :
సాధారణంగా రియల్ ఎస్టేట్​కు సంబంధించిన రుణాల విషయంలో బ్యాంక్​లు 'ఎల్​టీవీ రేషియో'ను కచ్చితంగా చూస్తాయి. సాధారణంగా ఇళ్లు లేదా ఫ్లాట్​ లాంటి ఆస్తుల కొనుగోలు ధరకు, లోన్​ అమౌంట్​కు మధ్య ఉన్న సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది. లేదా లోన్​ అమౌంట్​కు భవిష్యత్​లో పెరిగే సదరు ఆస్తి విలువకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎల్​టీవీ రేషియో తెలియజేస్తుంది.

మీ జీతంపైనే లోన్ అమౌంట్​ ఆధారపడి ఉంటుందా?
వాస్తవానికి మీకు వచ్చే ఆదాయం లేదా జీతం ఆధారంగానే మీకు వచ్చే రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే ఇది ఒక్కటే కాదు.. మీ క్రెడిట్ స్కోర్​, ఉద్యోగ చరిత్ర, మీ అప్పులు అన్నీ కూడా లోన్ మంజూరుపై తగినంత ప్రభావం చూపిస్తాయి.

లోన్​ ఎలిజిబిలిటీ కాలిక్యులేషన్​
FOIR Calculation For Home Loan : సాధారణంగా బ్యాంకులు లేదా ఫైనాన్సియల్ ఇన్​స్టిట్యూట్స్​​.. రుణార్హతను లెక్కించేందుకు ఒక ప్రత్యేకమైన ఫార్ములాను ఉపయోగిస్తాయి. ముఖ్యంగా మీ నెలవారీ ఆదాయం, మీ ఫైనాన్సియల్ కమిట్​మెంట్స్​ సహా లోన్​ టెన్యూర్​ను పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా ఫిక్స్​డ్​ ఆబ్లిగేషన్ టు ఇన్​కమ్​ రేషియో (FOIR)ను పరిశీలిస్తాయి. FOIR అనేది మీ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని, గరిష్ఠంగా మీరు ఎంత మేరకు ఈఎంఐ కట్టగలరో నిర్ణయించే ఒక సూచీ లాంటిది. సాధారణంగా మీ నెలవారీ ఆదాయంలో 50 శాతం నుంచి 60 శాతాన్ని ఎఫ్​ఓఐఆర్​గా​ సెట్​ చేయడం జరుగుతుంది. దీని ఆధారంగానే మీకు బ్యాంకులు ఇచ్చే రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది.

లోన్​-టు-ఇన్​కం రేషియో
Loan To Income Ratio : రుణదాతలు లోన్​-టు-ఇన్​కం రేషియోను (LTI) పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కూడా మీ ఆదాయాన్ని అనుసరించి, మీరు పొందగలిగే గరిష్ఠ రుణమొత్తాన్ని నిర్ణయిస్తుంది. సాధారణంగా ఎల్​టీఐ అనేది మీ వార్షిక ఆదాయం కంటే 2.5 నుంచి 6 రెట్లు ఉంటుంది.

ఉదాహరణకు, మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అనుకుందాం. బ్యాంక్​లు లేదా రుణ సంస్థల ఎల్​టీఈ నిష్పత్తి 4 అనుకుందాం. అప్పుడు మీరు గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు రుణం పొందడానికి అర్హులు అవుతారు.

స్థిరమైన ఆదాయం
రుణ సంస్థలు కచ్చితంగా మీ ఆదాయం స్థిరంగా, క్రమంగా వస్తుందా? లేదా? అనేది చూస్తాయి. ఒక వేళ క్రమంగా, స్థిరంగా మీకు జీతం లేదా ఆదాయం వస్తూ ఉంటే.. అధిక మొత్తం లోన్​ మంజూరు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. ఒక వేళ ఒక క్రమం లేకుండా స్థిరమైన ఆదాయం లేకుండా ఉంటే, లేదా తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటే గనుక .. మీకు రుణం మంజూరు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపవు. ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ రేట్లను విధిస్తాయి.

సహ-రుణగ్రహీత ఆదాయం
మీకు గనుక అధిక మొత్తంలో రుణం కావాలంటే.. కచ్చితంగా మరో భాగస్వామితో కలిసి.. లోన్​ కోసం ప్రయత్నించడం మంచిది. సాధారణంగా స్థిరమైన ఆదాయం ఉన్న మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కలిసి రుణం కోసం ప్రయత్నించవచ్చు. ఇలాంటి సందర్భంలో మీకు అధిక మొత్తంలో రుణం లభిస్తుంది.

క్రెడిట్ స్కోర్​ :
Credit Score For Home Loan : నేటి కాలంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే, కచ్చితంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్​ చాలా బాగా ఉంటే.. అత్యంత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు సులభంగా లభిస్తాయి. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ బాగా తక్కువగా ఉంటే, లోన్​ మంజూరు అయ్యే అవకాశం బాగా తగ్గుతుంది. ఒక వేళ లోన్ ఇచ్చినా భారీగా వడ్డీ వసూలు చేస్తారు.

ఇతర ఆర్థిక అంశాలు : మీకు ఇప్పటికే అప్పులు ఉన్నా, క్రెడిట్​ కార్డ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నా, ఇతర ఖర్చులు అధికంగా ఉన్నా కూడా రుణాలు మంజూరు అయ్యే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే, బ్యాంకులు అన్నిటికంటే ముఖ్యంగా.. రుణం తీర్చే సామర్థ్యాన్ని చూస్తాయి కనుక.

హోమ్​లోన్ ఈఎంఐ :
బ్యాంక్​ నుంచి లోన్ మంజూరు అయిన తరువాత, ప్రతి నెలా మీరు ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఈఎంఐగా కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఈఎంఐ అమౌంట్ స్థిరంగా ఉంటుంది. ఎంఐలో మీరు తీసుకున్న మొత్తం లోన్ అమౌంట్, వడ్డీ కలిసి ఉంటాయి. అయితే, మీకు వీలైతే.. ఈఎంఐ మొత్తాలను పెంచుకోవచ్చు. లేదా ముందుగానే రుణం మొత్తం తీర్చేయవచ్చు కూడా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.