ETV Bharat / business

లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 లాభం.. డీజిల్‌పై రూ.6.5 నష్టం.. కీలక నివేదిక వెల్లడి

author img

By

Published : Jan 6, 2023, 8:20 PM IST

Oil Companies
ఆయిల్ కంపెనీలు

అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గినప్పటికీ.. దేశీయ చమురు విక్రయ సంస్థలు మాత్రం ధరల్ని సవరించడం లేదు. ధరలు గరిష్ఠంగా ఉన్నప్పుడు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం కోసమే చమురు సంస్థలు ఈ వైఖరిని అవలంభిస్తున్నాయని ప్రముఖ నివేదిక తెలిపింది.

చమురు విక్రయ సంస్థలు లీటర్ పెట్రోల్​పై ప్రస్తుతం రూ.10 లాభం పొందుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. అదే సమయంలో లీటర్ డీజిల్‌పై రూ.6.50 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. పెట్రోల్‌పై లాభం వస్తున్నప్పటికీ రిటైల్‌ ధరల్ని మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిల్లిన నష్టాలను.. ప్రస్తుతం వస్తున్న లాభాలతో భర్తీ చేసుకోవడానికే కంపెనీలు ధరల్ని తగ్గించడం లేదని నివేదిక తెలిపింది.

ప్రభుత్వ రంగ సంస్థలైన 'ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌', 'భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌', 'హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌' గత 15 నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను సవరించడం లేదు. ఈ వ్యవధిలో అంతర్జాతీయ విపణిలో ఓ దశలో ధరలు బాగా తగ్గిన సందర్భాలూ ఉన్నాయి. 2022 జూన్‌ 24తో ముగిసిన వారంలో కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.17.4, లీటర్‌ డీజిల్‌పై రూ.27.7 నష్టాన్ని చవిచూసినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు క్రమంగా తగ్గడం వల్ల అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. లీటర్‌ డీజిల్‌పై నష్టం సైతం రూ. 6.5కు తగ్గినట్లు తెలిపింది.

ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్‌ 6 నుంచి ధరల్ని సవరించడం పూర్తిగా నిలిపివేశాయి. అదే నెలలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ చమురు ధర 102.97 డాలర్ల నుంచి 116.01 డాలర్లకు పెరిగింది. తర్వాత జూన్‌లో అది 78.09 డాలర్లకు పడిపోయింది. ధరలు గరిష్ఠానికి చేరినా.. రిటైల్‌ ధరల్ని మార్చకపోవడంతో సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఏప్రిల్‌- సెప్టెంబరు త్రైమాసికంలో మూడు కంపెనీలు కలిపి రూ. 21,201.18 కోట్ల నష్టాలను నివేదించాయి. ప్రభుత్వం రూ.22,000 కోట్ల సాయం అందించినా.. ఈ నష్టాలు తప్పలేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య చలిస్తున్నాయి. 2020 కరోనా వ్యాప్తి తీవ్రమైన సమయంలో ధరలు ఏకంగా సున్నా డాలర్లకు పడిపోయాయి. 2022లో తిరిగి వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోవడం, రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా ఎగబాకి మార్చి నెలలో 140 డాలర్ల వద్ద 14 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. అయితే, చమురును భారీ ఎత్తున దిగుమతి చేసుకునే చైనాలో గిరాకీ మందగించడంతో ఎగువ స్థాయిల నుంచి దిగొచ్చాయి. భారత్‌ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.