ETV Bharat / business

రికార్డు స్థాయిలో ఇంధన వినియోగం.. మూడేళ్లలో ఇదే అత్యధికం..

author img

By

Published : Apr 11, 2022, 10:56 PM IST

india fuel sales
india march fuel sales

భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మార్చి నెలలో రికార్డు స్థాయిలో నమోదైంది. కరోనా విజృంభణతో తగ్గిన వినియోగం ప్రస్తుతం భారీగా పెరిగింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇటీవల కాలంలో భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నాలుగున్నర నెలల విరామం తర్వాత మార్చి నెలలో మొదలైన ఇంధన ధరల పెరుగుదల ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకుంది. అయినప్పటికీ మార్చి నెలలో దేశంలో ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో జరిగింది. గడిచిన మూడేళ్లలోనే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం 4.2శాతం పెరిగి.. కొవిడ్‌ కంటే ముందున్న రోజులను దాటిపోయింది. దేశంలో కేవలం ఒక్క మార్చిలోనే 19.41 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం జరిగింది. పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ ప్రకారం, 2019 మార్చి నుంచి ఇదే అత్యధికం.

కొవిడ్‌ మూడోవేవ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడం వల్ల దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్‌ వాడకం గణనీయంగా పెరిగింది. కేవలం ఒక్క నెలలోనే 6.7 శాతం పెరుగుదలతో 7.7మిలియన్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. ఇలా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు కొవిడ్‌ కంటే ముందున్న అమ్మకాలను దాటిపోయాయి. వ్యవసాయ రంగంలో డీజిల్‌ను భారీగా వినియోగించడం, ధరల పెరుగుదల భయంతో పెట్రోల్‌ బంకుల్లో ముందస్తు నిల్వలు చేసుకోవడం వల్ల వీటికి మరింత డిమాండ్‌ పెరిగింది. మరోవైపు, మార్చి నెలలో వంటగ్యాస్‌ (LPG) డిమాండ్‌ కూడా 9.8శాతం పెరిగి 2.48 మిలియన్‌ టన్నులకు చేరింది.

మొత్తంగా కేవలం మార్చిలోనే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంధన వినియోగం 202.72 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యింది. 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. 2021-22లో పెట్రోల్‌ వినియోగం 10.3శాతం పెరిగి 30.85 మిలియన్‌ టన్నులకు చేరింది. డీజిల్‌ మాత్రం 5.6శాతం పెరిగి 76.7 మిలియన్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. గత మూడేళ్లలో వీటి అమ్మకాల్లో ఇవే గరిష్ఠం. మరోవైపు జెట్‌ ఫ్యుయెల్‌కు డిమాండ్‌ కూడా భారీగా పెరిగినప్పటికీ కొవిడ్‌ విజృంభణకు ముందుతో పోలిస్తే కాస్త తక్కువగానే నమోదయ్యింది.

ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు.. ట్రేడింగ్​లో దూసుకెళ్లండిక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.