ETV Bharat / business

Digital Payments Security : డిజిటల్​ చెల్లింపులు చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

author img

By

Published : Jun 30, 2023, 1:07 PM IST

Digital Payments Security Tips : డిజిటల్​ చెల్లింపులు నేడు సర్వసాధారణం అయిపోయాయి. అదే సమయంలో ఆన్​లైన్​ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. సైబర్​ నేరగాళ్లు చదువులేని వాళ్లనే కాదు.. మంచి విద్యావంతులను కూడా మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఆన్​లైన్​ పేమెంట్స్​ చేసేవారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

online payment risks and best practices
digital payments security tips

Online Payment Security Issues : నేటి సాంకేతిక యుగంలో డిజిటల్ చెల్లింపులు అనివార్యం అయిపోయాయి. భౌతికంగా డబ్బులు మరొకరికి పంపించాలంటే.. అది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. అదే డిజిటల్​ చెల్లింపులు అయితే ఇలాంటి సమస్య రాదు. చక్కగా ఉన్న చోట నుంచే ఆన్​లైన్​లో డబ్బులు పంపేయవచ్చు. అందుకే నేడు చాలా మంది డిజిటల్​ చెల్లింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో సైబర్​ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. అందుకే డిజిటల్​ చెల్లింపులు చేసే ముందు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్త
Cyber security for digital payments : సైబర్​ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఏవేవో ఆఫర్లు ప్రకటిస్తూ సందేశాలు పంపిస్తూ ఉంటారు. వాటిని నమ్మి మీ సమాచారాన్ని అందించారో.. ఇక అంతే.. మీ అకౌంట్​లోని మొత్తం సొమ్మును కాజేస్తారు. వాస్తవానికి ఒకప్పటితో పోలిస్తే, నేడు డిజిటల్​ మోసాల రేటు దాదాపు 28 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కనుక ఆన్​లైన్ చెల్లింపులు చేసే వారు కచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాలి.

విశ్వసనీయ యాప్​లను మాత్రమే వాడాలి!
Most secure payment apps : చాలా మంది ప్లేస్టోర్​, యాపిల్​ స్టోర్​ నుంచి కాకుండా ఇతర అనధికార వేదికల నుంచి పేమెంట్​ యాప్​లను డౌన్​లోడ్​ చేస్తూ ఉంటారు. ఇది సెక్యూరిటీ పరంగా ఏ మాత్రం మంచిది కాదు. సాధారణంగా డిజిటల్​ పేమెంట్​ యాప్​లను ఉపయోగించేందుకు మన బ్యాంకు అకౌంట్​ నంబర్​, క్రెడిట్​ లేదా డెబిట్​ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. అందువల్ల కచ్చితంగా విశ్వసనీయమైన, అధికారిక యాప్​లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు వినియోగిస్తున్న యాప్​.. మీ సమాచారాన్ని ఎంత మేరకు వినియోగిస్తుందో తెలుసుకునేందుకు.. కచ్చితంగా అన్ని నియమ, నిబంధనలను చదివి తెలుసుకోవాలి. లేదంటే మీ సమాచారం సైబర్​ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే మీ బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతుంది.

ఉచిత నెట్​వర్క్​లను వాడొద్దు!
చాలా మంది ఉచిత వై-ఫై సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచిత వై-ఫైని వాడకూడదని సైబర్​ నిపుణులు చెబుతున్నారు. అలాగే యూపీఐ యాప్​లను వాడుతున్నప్పుడు కూడా ఫ్రీ వై-ఫై వాడకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే, ఆన్​లైన్​ మోసగాళ్లు ఫోన్లను హ్యాక్​ చేసేందుకు ఈ ఉచిత వై-ఫై నెట్​వర్క్​లనే ఎక్కువగా ఉపయోగిస్తారని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు అంచెల రక్షణ
2 step verification for online banking : మొబైల్​ ఫోన్​ ద్వారా చెల్లింపులు చేయాలనుకుంటే.. కచ్చితంగా 'టూ స్టెప్​​ వెరిఫికేషన్​' (రెండు అంచెల భద్రతా వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా యాప్​లో లాగిన్​ కావడానికి, లావాదేవీలు జరిపేందుకు వేర్వేరు పాస్​వర్డ్​లను ఉపయోగించాలి. ఈ పాస్​వర్డ్​లను కూడా తరచుగా మారుస్తూ ఉండాలి. సురక్షితమైన ఆర్థిక లావాదేవీల కోసం బయోమెట్రిక్స్​నూ ఉపయోగించుకోవాలి.

స్ట్రాంగ్​ పాస్​వర్డ్స్​ పెట్టుకోవాలి
Digital Payments Security Tips : చాలా మంది డిజిటల్​ పేమెంట్స్​ జరిపేందుకు చాలా సాధారణ పాస్​వర్డ్​లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం సురక్షితం కాదు. డిజిటల్​ పేమెంట్​ యాప్​లో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు నాలుగు లేదా ఆరు అంకెల పాస్​వర్డ్​ను నమోదు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ఈ నంబర్​ మీకు తప్ప మరెవరికీ తెలయకుండా చూసుకోవాలి. అలాగే ఈ పాస్​వర్డ్​లను తరచుగా మారుస్తూ ఉండాలి.

క్యూఆర్​ కోడ్​లతో జాగ్రత్త!
QR code based payments : నేడు ప్రతి దుకాణంలో క్యూఆర్​ కోడ్​లు ఉంటున్నాయి. ఈ కోడ్​లను స్కాన్​ చేసి, సులభంగా క్షణాల్లో చెల్లింపులు చేసేస్తున్నారు. కానీ ఈ క్యూఆర్​ కోడ్​ల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే.. ఈ క్యూఆర్​ కోడ్స్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు మన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది.

అందుకే క్యూఆర్​ కోడ్ స్కాన్ చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దుకాణదారుని వివరాలు, పేమెంట్​ గేట్​వేలో ఉన్న వివరాలు సరిపోయాయా? లేదా? అని చెక్​ చేసుకోవాలి. ఆ తరువాత మాత్రమే లావాదేవీలను సురక్షితంగా పూర్తి చేయాలి.

యూపీఐతో ప్రీమియం చెల్లింపులు
టాటా ఏఐఏ లైఫ్​ ఇన్సూరెన్స్​ వారు తమ పాలసీదారులు సులభంగా ప్రీమియం చెల్లించేందుకు వీలుగా.. ఒక యూపీఐ ఆధారిత చెల్లింపు పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. అలాగే దీని సాయంతో వాట్సాప్​లోనూ ప్రీమియం చెల్లింపులు చేయవచ్చని స్పష్టం చేశారు. అలాగే తమ పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుగు భాషలోనూ అందిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.