ETV Bharat / business

రుణ యాప్​లలో సగానికి పైగా నకిలీవే: ఆర్​బీఐ

author img

By

Published : Nov 20, 2021, 10:55 AM IST

దేశంలోని డిజిటల్ రుణాల యాప్​లలో (Loan app in India) సగానికి పైగా నకిలీవేనని ఆర్​బీఐ వెల్లడించింది. రుణ యాప్​లు (Digital loan app) పెరుగుతున్న కొద్దీ.. నకిలీలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫ్రేమ్​వర్క్ రూపొందించాలని సూచించింది.

rbi report loan apps
rbi report loan apps

ఆన్​లైన్ వేదికలు, మొబైల్ యాప్​ల ద్వారా అందిస్తున్న రుణాల (Loan app in India) విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. క్రమబద్ధంగా లేని రుణ కార్యకలాపాలను (Digital loan app) నిరోధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించింది. ఆర్​బీఐ నియంత్రణలో ఉన్న బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, పేమెంట్ ఆపరేటర్ల సేవలను వినియోగిస్తున్న యూజర్లందరికీ ప్రత్యేక ఫ్రేమ్​వర్క్​ అభివృద్ధి చేయాలని తెలిపింది. ఆర్​బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్​ నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్.. పరిశోధన నిర్వహించి ఈ సిఫార్సులు చేసింది.

డిజిటల్ లెండింగ్ యాప్​లలో సగానికి పైగా (1,100లో 600) నకిలీవేనని వర్కింగ్ గ్రూప్ పరిశోధనలో తేలింది. రుణ యాప్​ల (Digital loan app) సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. నకిలీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏది చట్టబద్ధమైన యాప్ అనే విషయం యూజర్లకు తెలియకుండా పోయిందని పేర్కొంది. నకిలీ యాప్​లు యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నాయని, వీటిని ఫిషింగ్ సహా ఇతర సైబర్ దాడుల కోసం ఉపయోగించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది.

భౌతిక రుణాలే ఎక్కువ

దేశంలో భౌతిక రుణాలతో పోలిస్తే.. డిజిటల్ రుణాల విలువ పరిమితంగానే ఉందని రీసర్చ్ గ్రూప్ పేర్కొంది. బ్యాంకులు రూ.53.08 లక్షల కోట్ల భౌతిక రుణాలు ఇస్తుండగా.. డిజిటల్ రుణాల విలువ రూ.1.12 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. ఎన్​బీఎఫ్​సీల విషయంలో మాత్రం డిజిటల్ రుణాల వాటా అధికంగా ఉంది. 2020లో ఎన్​బీఎఫ్​సీలు భౌతికంగా రూ.1.93 లక్షల కోట్లు రుణాలు ఇస్తే.. డిజిటల్ రూపంలో రూ.23 వేల కోట్లను అందించాయి.

అయితే, గడిచిన మూడేళ్లలో డిజిటల్ రుణాల వితరణ వేగంగా పెరుగుతోందని పరిశోధన పేర్కొంది. 2017లో రూ.11,671 కోట్లుగా ఉన్న డిజిటల్ రుణాలు.. 2020 నాటికి రూ.1.42 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది.

మోసాలు ఇలా..

నకిలీ డిజిటల్ లెండింగ్ యాప్​ల పనితీరుపైనా కీలక విషయాలు వెల్లడించింది ఆర్​బీఐ గ్రూప్. దొంగలించిన ఆధార్ కార్డుల వివరాలను ఉపయోగించి గుర్తింపు పత్రాలను సంపాదిస్తున్నారని తెలిపింది. కస్టమర్ కేర్ స్కామ్​లు (loan app scam news) పెరుగుతున్నాయని, ఆన్​లైన్ వ్యాపారాల లక్ష్యంగా ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. సున్నితమైన సమాచారం తస్కరించి వారిని మోసం చేస్తున్నాయని వివరించింది. దీని వల్ల డిజిటల్ రుణాలు అందించే సంస్థలకూ చెడ్డపేరు వస్తోందని పేర్కొంది.

యూజర్లు తమ సమాచారాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం సహా డేటా ఉల్లంఘనల ఘటనల వల్ల వినియోగదారుల సమాచారం.. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోందని వివరించింది. వీటిని నివారించేందుకు పరిశ్రమ స్థాయిలో భాగస్వామ్యం, సహకారం అవసరమని స్పష్టం చేసింది.

(కృష్ణానంద్ త్రిపాఠి- ఈటీవీ భారత్ డిప్యూటీ న్యూస్ ఎడిటర్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.