ETV Bharat / business

ఇక క్రెడిట్​ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్​.. ఆర్​బీఐ కీలక నిర్ణయం

author img

By

Published : Jun 8, 2022, 7:23 PM IST

credit card link with Upi
క్రెడిట్ కార్డు

credit card link with UPI: ఆర్​బీఐ బుధవారం వెల్లడించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ ఖాతాలకు క్రెడిట్ కార్డులను అనుసంధానించేందుకు అనుమతి ఇచ్చింది. తాజా నిర్ణయంతో వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభం కానున్నాయి.

credit card link with UPI: డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ ఖాతాలకు క్రెడిట్‌ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. నేడు వెల్లడించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.

తొలుత దేశీయ రూపే క్రెడిట్‌ కార్డును యూపీఐకి అనుసంధానించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి ఉంది. తాజాగా క్రెడిట్‌ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వడంతో వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి.

  • యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి క్రెడిట్‌ కార్డుని అనుసంధానించడం వల్ల కార్డు స్వైప్‌ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. కేవలం క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం లేదా మొబైల్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేసి క్రెడిట్‌ కార్డు చెల్లింపులు చేసేయొచ్చు. అయితే, రిజిస్టర్డ్‌ మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత యాప్‌లన్నీ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నాయి. అయితే, కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే చెల్లించడానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తాజాగా ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో త్వరలో వ్యక్తిగత లావాదేవీలు కూడా చేసేందుకు ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

దేశంలో డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ ద్వారా చేసిన లావాదేవీల విలువ మే నెలలో రూ.10 లక్షల కోట్లు దాటాయి. గత నెలలో మొత్తం రూ.595 కోట్ల లాదావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ పేర్కొంది. గతేడాది మే నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు ఉండగా.. ఈ సారి రెట్టింపు అవ్వడం గమనార్హం. 2016లో యూపీఐ సేవలు అందుబాలోకి వచ్చాయి. తాజాగా క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐకి అనుసంధానించడంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు

రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత పెరిగే అవకాశం ఉందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.