ETV Bharat / business

ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు

author img

By

Published : Jun 8, 2022, 10:14 AM IST

Updated : Jun 8, 2022, 12:17 PM IST

RBI hiked repo rate
RBI hiked repo rate

10:11 June 08

ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు

RBI hiked repo rate: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్ చెప్పారు.

ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఏప్రిల్​లో అంచనా వేసిన 5.7 శాతానికి అధికం కావడం గమనార్హం. టమాట ధరలు పెరగడం వల్ల ఆహార ధరల ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు సైతం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని అన్నారు. సాధారణ వర్షపాతం వల్ల ఖరీఫ్ సీజన్​కు మేలు జరుగుతుందన్న ఆయన.. ఈ ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అంచనా వేశారు.

యథాతథంగా జీడీపీ అంచనాలు
మరోవైపు, జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు శక్తికాంత దాస్. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసురుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్లే సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని వివరించారు. అయితే, పట్టణప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో జీడీపీ అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంతా అనుకున్నట్లే..
అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ద్రవ్య విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్‌బీఐ ఇదివరకే సంకేతాలిచ్చింది. తాజాగా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్‌బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

వరుస పెంపునకు కారణాలివే..
పరపతి విధాన నిర్ణయాలకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్‌ నిపుణులు ముందే వ్యక్తం చేశారు. అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్‌లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే. 2022లో ఇప్పటివరకు అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో 45 దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. తాజాగా ఆస్ట్రేలియా బ్యాంకు మంగళవారం వడ్డీరేట్లను 2 శాతం మేర పెంచింది.

పెరగనున్న ఈఎంఐల భారం..
కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.

ఇదీ చదవండి:

Last Updated :Jun 8, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.