ETV Bharat / business

గూగుల్​కు బిగ్ షాక్.. నెలలోగా రూ.1,337కోట్ల ఫైన్​ కట్టాల్సిందే!

author img

By

Published : Mar 29, 2023, 3:52 PM IST

Updated : Mar 29, 2023, 4:20 PM IST

nclat-upholds-fine-imposed-on-google-by-competition-commission-of-india
గూగుల్​పై సీసీఐ పెనాల్టీ

గూగుల్​పై 1,337.76 కోట్ల రూపాయల ఫైన్​ విధిస్తూ.. సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులను NCLAT సమర్థించింది. మొత్తం డిపాజిట్లను 30 రోజుల్లో చెల్లించాలని గూగుల్​ను ఆదేశించింది. బుధవారం దీనిపై విచారణ చేపట్టిన బెంచ్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌పై 1,337.76 కోట్ల రూపాయల జరిమానాను విధిస్తూ.. ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) సమర్థించింది. గూగుల్‌.. తన ఆండ్రాయిడ్‌ ఉత్పత్తులకు సంబంధించి ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని.. అనైతికంగా పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే కారణంతో కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ జరిమానాను విధించింది. దీనిపై గూగుల్..​ NCLAT ఆశ్రయించింది.

గూగుల్​ వేసిన పిటిషన్​పై బుధవారం విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల NCLAT బెంచ్​.. సీసీఐ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 30 రోజుల్లో మొత్తం ఫైన్​ జమ​ చేయాలని గూగుల్​ను ఆదేశించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్​ అలోక్ శ్రీవాస్తవ ఈ బెంచ్​లో సభ్యులుగా ఉన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలకు సంబంధించి కొన్ని సవరణలు కూడా బెంచ్​ చేసింది. సీసీఐ జరిపిన విచారణలో న్యాయ ఉల్లంఘన జరిగిందన్న గూగుల్ వాదనలను NCLAT బెంచ్​ తోసిపుచ్చింది.

ఇదీ జరిగింది..
2022 అక్టోబర్​లో కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా.. గూగుల్​కు ఈ భారీ జరిమానాను విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికింది.

నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్​ను ఆశ్రయించిన గూగుల్​..
కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. గూగుల్‌ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. అక్కడ కూడా గూగుల్​కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లోగా జమ చేయాలని గూగుల్​ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశించింది.

సుప్రీంకోర్టుకు గూగుల్..
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ విధించిన జరిమానాను వ్యతిరేకించిన గూగుల్​.. అనంతరం సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. 2023 జనవరిలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గూగుల్​ పిటిషన్​ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దీవాలా త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. కేసును తిరిగి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్​కు అప్పగించింది. మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలిపింది. గతంలో CCI విధించిన అపరాధ రుసుములో 10శాతం చెల్లించేందుకు గూగుల్‌కు వారం రోజుల గడువు ఇచ్చింది.

Last Updated :Mar 29, 2023, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.