ETV Bharat / business

మీ ఎదుగుదల మోదీ వల్లేనా?.. అదానీ సమాధానమిదే..

author img

By

Published : Jan 8, 2023, 8:23 PM IST

Gautam Adani on his relationship with Modi news
గౌతమ్‌ అదానీ

నరేంద్ర మోదీ, ముకేశ్‌ అంబానీతో తన సంబంధాలపై గౌతమ్‌ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో సన్నిహిత సంబంధాల వల్లే అదానీ గ్రూప్‌ పురోగమిస్తోందన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు.

తమ కంపెనీలు దేశంలో 22 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయని అదానీ గ్రూప్‌ అధినేత, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు గౌతమ్‌ అదానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళ, మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బంగాల్‌లోనూ అదానీ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే అదానీ గ్రూప్‌ అనతికాలంలో పెద్ద ఎత్తున పురోగమించిందని వస్తున్న ఆరోపణలకు ఆయన పై విధంగా స్పందించారు. శనివారం రాత్రి ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌లో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి వ్యక్తిగత సాయం పొందడం కుదరదని అదానీ తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విధానాల రూపకల్పనలో కొన్ని సలహాలు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏ విధానాన్ని తీసుకొచ్చినా.. అది అందరికీ వర్తిస్తుందని కేవలం అదానీ గ్రూప్‌నకు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్‌ గాంధీ తనని పదే పదే ఆశ్రిత పెట్టుబడిదారుడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోనూ తాము రూ. 68,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపారు. దీన్ని రాహుల్‌ సైతం ప్రశంసించారని పేర్కొన్నారు. రాహుల్‌ విధానాలు సైతం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండవని తనకు తెలుసని వ్యాఖ్యానించారు.

తన జీవితంలో మూడుసార్లు గొప్ప అవకాశాలు అందాయని.. అవే తన వృద్ధికి దోహదం చేశాయని అదానీ తెలిపారు. 1985లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ తీసుకొచ్చిన 'ఎగ్జిమ్‌ విధానం' తమ కంపెనీ 'గ్లోబల్‌ ట్రేడింగ్‌ హౌస్‌'గా అవతరించేందుకు సాయపడిందని తెలిపారు. తర్వాత 1991లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణలతో పబ్లిక్‌- ప్రైవేట్‌ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడానికి దోహదం చేసినట్లు వివరించారు. అలాగే గుజరాత్‌లో మోదీ 12 ఏళ్లు సీఎంగా ఉన్న తరుణంలోనూ పెట్టుబడులకు మంచి ప్రోత్సాహం లభించిందన్నారు. గుజరాత్‌ ప్రాథమికంగా పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని.. కేవలం అదానీకి మాత్రమే కాదని చెప్పారు. కష్టపడి పనిచేయడం ఒక్కటే తన విజయసూత్రమని తెలిపారు.

'రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌'తో ఉన్న సంబంధాలపై గౌతమ్‌ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీని ఆదర్శవంతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ముకేశ్‌ అంబానీ తనకు మంచి మిత్రుడని.. ఆయన్ని చాలా గౌరవిస్తానని తెలిపారు. కంపెనీని టెలికాం, టెక్నాలజీ, రిటైల్‌ రంగాలకూ విస్తరించి రిలయన్స్‌కు కొత్త దిశను చూపించారని పేర్కొన్నారు. దేశ పురోగమనంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.