ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​లో మదుపు చేశారా?.. నష్టం భరిస్తేనే అధిక రాబడి!

author img

By

Published : Jan 8, 2023, 2:18 PM IST

సంపాదనలో కచ్చితంగా కొంత దీర్ఘకాలిక అవసరాల కోసం మదుపు చేయాలి. దీనికోసం ఎంచుకునే పథకాలు మన అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. వ్యక్తిగత లక్ష్యాలు సాధించాలంటే.. మనం ఎంచుకుంటున్న పథకాల పనితీరుపై స్పష్టమైన అవగాహన ఉండాలి. మదుపు చేసే మొత్తం, ఎంత వ్యవధి, ఇతర అంశాలను పరిశీలించి పథకాన్ని ఎంచుకోవాలి. ప్రధానంగా అందులో ఉండే నష్టాలేమిటి అనేదీ తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుంది.

High returns only if losses are incurred
High returns only if losses are incurred

లాభాలు సంపాదించాలనే లక్ష్యంతోనే మదుపు చేస్తుంటాం. నిజమే. కానీ, కొన్నిసార్లు నష్టాన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులు ప్రారంభించేటప్పుడే నష్టం వస్తే అనే మాట వినిపిస్తే నచ్చకపోవచ్చు. కానీ, ఇది ఒక కీలకమైన అంశమని మర్చిపోవద్దు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పథకాలను ఎంచుకునే వారు ఈ విషయాన్ని విస్మరించేందుకు వీల్లేదు. నష్టం లేకుండా రాబడిని సాధించలేం అనే సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో విషయాన్నీ గమనించాలి.

పెట్టుబడి పథకం తీరు ఆధారంగా రకరకాల నష్టభయాలుంటాయి. మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు నష్టభయాన్ని బేరీజు వేసుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తారు. సాధారణ మదుపరులకు అంత అవగాహన ఉండదు. ముందే అనుకున్నట్లు నష్టభయం అధికంగా ఉంటే.. రాబడి వస్తుందనే భావనా అన్ని వేళలలో సరికాదు.

ఒకే తీరు పెట్టుబడి పథకాలకు ఒకే తరహా నష్టభయం ఉంటుందనే భావనా ఉంటుంది. దీనినీ సాధారణ సూత్రీకరణ చేయలేం. ప్రతి పథకానికీ వేర్వేరు పరిస్థితుల్లో.. అనేక నష్టభయాలు ఉంటాయి. సాధారణంగా ఫండ్‌ పథకాలను వాటి నష్టభయాల ఆధారంగా.. తక్కువ నష్టభయం, సాధారణం-మధ్యస్థం, మధ్యస్థం, మధ్యస్థం-అధికం, అధికం-మరీ అధికం అనే రకాలుగా విభజిస్తారు. దీనినే ఫండ్‌ రిస్కో మీటర్‌ అనీ పేర్కొంటారు. మార్కెట్‌ విలువ, హెచ్చుతగ్గులు, నగదుగా మార్చుకునే వీలు తదితర అంశాల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఈ రిస్కోమీటర్‌ను జాగ్రత్తగా గమనించాలి. మీ నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్లను ఎంపిక చేసుకోవడం మేలు.

హెచ్చుతగ్గుల్లో..
మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లవు. చాలామంది మదుపరులు మార్కెట్‌ పతనం అవుతుంటే.. పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, పెరుగుతుంటే మదుపు చేయడం చూస్తూనే ఉంటాం. ఇది దీర్ఘకాలంలో పెట్టుబడులకు నష్టం కలిగిస్తుంది. స్టాక్‌ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం అనే విషయాన్ని మదుపరులు అర్థం చేసుకోవాలి. నష్టభయం, రాబడి ఆధారంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ప్రామాణిక సూచీకి మించి అధిక నష్టభయం ఉన్న పథకం హెచ్చుతగ్గుల్లోనూ మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని ఊహించని నష్టభయాలూ వస్తుంటాయి. వీటికీ సిద్ధంగా ఉండాలి. మంచి ప్రణాళిక, అవగాహనతోనే గట్టెక్కి, మంచి లాభాలు ఆర్జించే వీలుంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.