ETV Bharat / business

ఎయిర్​ఇండియా దూకుడు.. ఏకంగా 840 విమానాల కొనుగోలు!

author img

By

Published : Feb 16, 2023, 2:24 PM IST

Updated : Feb 16, 2023, 4:33 PM IST

air india
air india

టాటా గ్రూప్​నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా..రికార్డు స్థాయిలో కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఎయిర్​బస్, బోయింగ్​ సంస్థలకు 470 విమానాలు ఆర్డర్​ ఇచ్చిన ఎయిర్ఇండియా.. మరో 370 విమానాలను భవిష్యత్​లో కొనేందుకు ఒప్పందం చేసుకుంది.

ఎయిర్ ఇండియా రికార్డు స్థాయిలో మొత్తం 840 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమైంది! ఇందులో 470 విమానాలను నేరుగా కొనుగోలు చేస్తుండగా.. 370 విమానాలను భవిష్యత్​లో కొనేందుకు వీలుగా ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తాజాగా ధ్రువీకరించారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా.. ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలు, బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంది. దీనికి అదనంగా వచ్చే పదేళ్లలో 370 విమానాల కొనుగోలుకు వీలుగా బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో ఆప్షన్స్ అండ్ పర్చేస్ రైట్స్‌ను కొనుగోలు చేశామని నిపుణ్​ అగర్వాల్ తెలిపారు.
ఈ ఒప్పందాలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నిటికీ భారత్ నుంచి సర్వీసులు నడిపే అవకాశం చిక్కుతుందని అన్నారు. భారత వైమానిక రంగంలోనే ఈ ఒప్పందం ఓ కీలకమైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఎయిర్​ఇండియా ఇటీవలే.. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు, అమెరికాకు చెందిన బోయింగ్‌ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ చేసింది. ఈ ఆర్డర్‌లో బోయింగ్‌ B737 MAX- 190; B787- 20; B777X-10 విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 50 బోయింగ్‌ 737 మ్యాక్స్‌, 20 బోయింగ్‌ 787 మోడల్‌ విమానాల కొనుగోలు హక్కునూ పొందింది. ఈ డీల్‌ మొత్తం విలువ 45.9 బిలియన్‌ డాలర్లు. ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మూనుయేల్ మేక్రాన్​, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో విడివిడిగా జరిగిన కార్యక్రమాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా చివరిసారి 2005లో 111 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. బోయింగ్‌ నుంచి 68, ఎయిర్‌ బస్‌ నుంచి 43 విమానాలను 10.8 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి 27తో ఎయిర్ఇండియా యాజమాన్యం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కొత్త విమానాల కొనుగోలు కోసం చారిత్రక ఒప్పందానికి తుదిరూపం ఇస్తున్నట్లు ప్రకటించింది. విహాన్ కార్యక్రమం ద్వారా ఎయిర్​ఇండియా ఆపరేషన్స్‌ విస్తరించేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధంచేసిన టాటా గ్రూప్‌.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

Last Updated :Feb 16, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.