ETV Bharat / business

FPOపై అదానీ సంస్థ వెనక్కి.. ఇన్వెస్టర్లకు డబ్బులు వాపస్.. కారణం అదే!

author img

By

Published : Feb 2, 2023, 6:48 AM IST

Adani cites moral grounds
Adani cites moral grounds

రూ.20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్​పై అదానీ ఎంటర్​ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్​పీఓ ద్వారా సేకరించిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు గల కారణాలు వెల్లడించింది. అవేంటంటే?

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) ద్వారా సేకరించిన రూ.20వేల కోట్ల నిధులను ఖర్చు చేయరాదని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్ణయించింది. FPO పూర్తిగా సబ్​స్క్రైబ్ అయిన మరుసటి రోజు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అస్థిర పరిస్తితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఊహించని పరిణామాలు, మార్కెట్లో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా... FPO ద్వారా సేకరించిన రూ.20వేల కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. పూర్తయిన లావాదేవీని ఉపసంహరించాలని నిర్ణయించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు తెలిపింది. తమ సంస్థపై నమ్మకం ఉంచి... FPO సబ్‌స్క్రిప్షన్‌ను విజయవంతం చేసిన ప్రతి పెట్టుబడిదారుడికి కృతజ్ఞతలు తెలిపిన బోర్డు.... ఈ నిర్ణయం వల్ల సంస్థతోపాటు భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో గత కొద్దిరోజులు అదానీ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో రూ. 20,000 కోట్ల సమీకరణ నిమిత్తం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. FPO నుంచి గట్టెక్కుతుందా లేదా అనే అనుమాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారానికి భిన్నంగా మంగళవారం ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. కాగా, కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ అదానీ ఎఫ్‌పీఓకు సానుకూల స్పందన రావడం వెనుక ఇద్దరు భారత వ్యాపార దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఆ ఇద్దరు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఎఫ్‌పీఓ గండం నుంచి గట్టెక్కించినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో వారు అదానీ షేర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. వారెవరో కాదు.. భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్ సునీల్‌ మిత్తల్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌.

ఈ ఇద్దరు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ పూర్తి చేసేందుకు సాయపడ్డారని మార్కెట్‌ వర్గాలు సైతం చెబుతున్నాయి. అయితే, ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదని వారు కోరినట్లు సమాచారం. జిందాల్‌ 30 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు సబ్‌స్రైబ్‌ చేసుకోగా, మిత్తల్‌ ఎంత మొత్తానికి సబ్‌స్క్రైబ్‌ చేశారనేది దానిపై సమాచారం వెలుగులోకి రాలేదు. అయితే, వీరు తమ వ్యక్తిగత సంపద నుంచి ఈ పెట్టుబడులు పెట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. వీరితోపాటు అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ కంపెనీ సైతం 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఎఫ్‌పీఓ పెట్టుబడుల్లో ఇదే అతి పెద్ద మొత్తం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.