ETV Bharat / business

Mutual Fund Investment: ఆ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా?

author img

By

Published : Dec 17, 2021, 3:55 PM IST

Mutual Funds Investment Plans: స్టాక్‌ మార్కెట్‌ సూచీల కదలికల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో అధిక ధరల వద్ద ఉన్న యూనిట్లను విక్రయించి, తక్కువకు వచ్చినప్పుడు తిరిగి మదుపు చేసే వ్యూహం పాటించాలని చాలామంది అనుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టడానికీ.. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికీ సరైన సమయం అంటూ స్టాక్‌ మార్కెట్లో ఏమీ ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రమానుగతంగా పెట్టుబడి పెట్టిన మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో ఇది మరింత కచ్చితంగా పాటించాలి.

Stock Market mutual-funds-investment-plans
Stock Market mutual-funds-investment-plans

Mutual Funds Investment Plans: ఒక ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకే మ్యూచువల్‌ ఫండ్లలో 'సిప్‌' చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకూ మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మదుపు కొనసాగించాలి. అయితే, మన అనుకున్న లక్ష్యం సమీపిస్తున్న కొద్దీ.. పెట్టుబడికి నష్టభయం తగ్గించే ఏర్పాటు చేయాలి. మీరు అనుకున్నదానికన్నా ముందే అవసరమైన డబ్బు సమకూరితే.. ఈక్విటీ ఫండ్ల నుంచి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. లేదా క్రమానుగతంగా లిక్విడ్‌ ఫండ్లలోకి మళ్లించాలి. బ్యాంకులో ఫ్లెక్సీ డిపాజిట్లలోకీ మార్చుకోవచ్చు. దీర్ఘకాలం పెట్టుబడుల తర్వాత రెండుమూడేళ్ల ముందుగానే ఈ ప్రక్రియను ప్రారంభించాలి. అప్పుడు మార్కెట్లు తగ్గినా ఇబ్బందులు రావు.

మ్యూచువల్‌ ఫండ్ల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం రావాలనుకున్నప్పుడు డివిడెండ్‌ ఆప్షన్‌లోకి మారేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి బదులుగా క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల పన్ను భారమూ అంతగా ఉండదు.

ఫండ్‌ పథకం మీరు ఎంచుకున్నప్పుడు ఉన్న వ్యూహానికి బదులు కొత్త విభాగానికి మారినప్పుడు మీ నష్టభయం భరించే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఫండ్‌ మేనేజర్‌ మారినా గమనించాల్సిన అంశమే. కనీసం 6 నుంచి 12 నెలలపాటు కొత్త ఫండ్‌ మేనేజర్‌ పనితీరును పరిశీలించాలి. గతంతో పోలిస్తే పనితీరు బాగాలేకపోతే ఫండ్‌లో నుంచి వెనక్కి రావచ్చు.

కొన్ని పథకాలు రెండుమూడేళ్లపాటు చూసినా.. సానుకూల పనితీరును చూపించకపోవచ్చు. ఇలాంటి వాటి నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఆలోచించవద్దు. వివిధ కాలాల్లో ఫండ్‌ పనితీరు ఎలా ఉంది.. ఇదే విభాగంలోని ఇతర పథకాలు ఎలాంటి రాబడులు ఇస్తున్నాయి.. ప్రామాణిక సూచీతో పోల్చినప్పుడు పనితీరు ఎలా ఉంది ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఈక్విటీ పథకం వరుసగా మూడేళ్ల పాటు పనితీరు సరిగా లేకపోతే.. దాన్ని నిర్మొహమాటంగా వదిలించుకోవాలి.

పెట్టుబడుల్లో వైవిధ్యం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. అదే సమయంలో మీ అవసరాలు.. లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. మార్కెట్‌లో వృద్ధి వల్ల మీ ఈక్విటీ పెట్టుబడుల విలువ పెరిగితే.. దాన్ని ముందుగా మీరు అనుకున్న నిష్పత్తికి సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు మీరు ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌లో 35 శాతం ఉండాలని అనుకున్నారనుకుందాం.. ఈక్విటీ మార్కెట్‌ వృద్ధి వల్ల పెట్టుబడులు 65శాతం నుంచి 75 శాతానికి చేరితే.. మీరు ముందనుకున్న నిష్పత్తికి వాటిని సర్దుబాటు చేయాలి.

అత్యవసరాల్లో మ్యూచువల్‌ ఫండ్ల నుంచి అవసరమైన మొత్తాన్ని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ, దీన్ని చివరి అవకాశంగానే చూడాలి. ఒకవేళ సిప్‌ను కొనసాగించడం వీలుకాకపోతే తాత్కాలికంగా దాన్ని నిలిపి వేసుకోవచ్చు. అవసరం కొద్దీ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. ముందుగా పనితీరు సరిగా లేని పథకాలను ఎంచుకోండి. ఆ తర్వాతే మంచి పనితీరున్న వాటిని చూడండి.

ఇవీ చూడండి: ఈ టిప్స్‌ పాటిస్తే.. మీ ట్విట్టర్ ఖాతా సేఫ్‌!

జీవితభాగస్వామితో ఈ విషయాలు ముందే చర్చించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.