ETV Bharat / business

జీవితభాగస్వామితో ఈ విషయాలు ముందే చర్చించండి!

author img

By

Published : Dec 11, 2021, 12:41 PM IST

Couple Finance management: వివాహానికి ముందు అన్ని విషయాలతో పాటు ఆర్థికపరమైన అంశాలపైనా జంటలు దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఆర్థిక కారణాలతోనే ఎక్కువ మంది దంపతులు విడిపోయిన నేపథ్యంలో.. దీనిపై ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు.

COUPLE FINANCE
COUPLE FINANCE

Couple Financial planning: పెళ్లికి ముందు ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాలు చూడాలి అంటుంటారు పెద్దలు. నిజంగా పెద్దలు చెప్పే ప్రతి నానుడి వెనుక ఒక అర్థం ఉంటుంది. అయితే, ఈ మధ్య విడిపోతున్న జంటల్ని గమనిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులే ఎక్కువగా ఉంటున్నాయి. పెళ్లి సమయంలో డబ్బుకు సంబంధించిన విషయాల్ని చర్చించడం అనాచారమన్న భావన మన సమాజంలో ఉంది. కానీ, చిన్న వయసులోనే సంపాదనపై దృష్టిపెడుతున్న ఈ కాలంలో ఒకరినొకరు అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి కాబోయే జీవిత భాగస్వామితో కొన్ని ఆర్థికపరమైన విషయాలు ముందే చర్చిస్తే మేలు. అలా అని పూర్తిగా వీటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవద్దు. కాబోయే వారిని అర్థం చేసుకోవడంలో ఇది ఒక భాగం మాత్రమే..

marriage financial problems

పెళ్లికి ముందే మీ భాగస్వామి ఆర్థిక జీవితం ఎలా సాగుతుందో ఆరా తీయండి. మీ అలవాట్లు, పొదుపు, పెట్టుబడికి సంబంధించిన అంశాలను పంచుకోండి. ఒకరు బాగా ఖర్చుపెట్టేవారైతే.. మరొకరు మంచి పొదుపరి కావొచ్చు. అసలు డబ్బుపై ఇరువురికి ఉన్న అభిప్రాయమేంటో ఒక అవగాహనకు రావాలి. అలాగే జీవితంలో ప్రాధాన్యాలను కూడా చర్చించుకోవాలి. ఇలాంటి విషయాలపై ముందే ఒక అవగాహన ఉంటే తర్వాత ఎలాంటి పొరపొచ్చాలకు తావుండదు.

loans for marriage

పెళ్లి ఖర్చులకు కూడా కొన్ని బ్యాంకులు, సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. తప్పనిసరైతేనే రుణం తీసుకోవాలి. అలాగే దీని కంటే కూడా వ్యక్తిగత రుణానికి తక్కువ వడ్డీరేటు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పెళ్లి కోసం రుణం తీసుకోకపోవడమే మంచిదని మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి తల్లిదండ్రులే వివాహ ఖర్చులన్నీ చూసుకుంటారు. అయినా, మరింత ఘనంగా చేసుకోవాలన్న కోరికతో మిత్రులకు బ్యాచిలర్‌ పార్టీలు, పెద్ద పెద్ద హోటళ్లలో విందుల కోసం భారీగా వెచ్చిస్తుంటారు. అందుకోసం రుణం తీసుకుంటారు. కానీ, కొత్త జీవితాన్ని అప్పులతో ప్రారంభించకపోవడమే మంచిదని నిపుణుల సూచన. మరీ అవసరతైమే ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి డబ్బును తీసుకోవచ్చు. లేదంటే తక్కువ వడ్డీరేటుకి బంధువులు, మిత్రుల దగ్గర నుంచి డబ్బు సమకూర్చుకోవడం ఇంకా మంచిది.

ఆస్తులు, అప్పులు..

పెళ్లికి ముందే ఇరువురికి సొంతంగా ఉన్న ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకోవాలి. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెడితే వాటి గురించి కూడా చర్చించుకోవాలి. నెలవారీ ఆదాయం, అందులో ఈఎంఐల కోసం ఎంత వెళుతుందో తెలుసుకోవాలి. అలాగే అమ్మానాన్న, లేదా ఇంట్లో తోబుట్టువులతో కలిసి ఉమ్మడిగా ఉన్న ఆస్తుల వివరాలు తెలియజేయాలి. ఇలాంటి వివరాలన్నీ ముందే తెలుసుకుంటే తర్వాతి జీవితంపై ఓ స్పష్టత ఉంటుంది. వీలైతే ఈ విషయాలు ఇంట్లోని పెద్దలతో కూడా చర్చించాలి. వారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలైతే మీ ఉద్దేశాన్ని తెలియజేసి మిగిలింది వారికే వదిలేయాలి.

ఆధారపడ్డవారి బాధ్యతలు..

పెళ్లితో పాటే కొన్ని బాధ్యతలూ వస్తాయి. ఇరు కుటుంబాల్లో మీపై ఆధారపడే వారు ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తాతయ్య-నాన్నమ్మ, ఇంకా చదువుకుంటున్న తమ్ముడు, చెళ్లెల్లు.. ఇలా ఎవరున్నా వారి భవిష్యత్తు కోసం మీవంతుగా మీ బాధ్యతను నిర్వర్తించాల్సిందే. వారి బాగోగులు చూసుకోవడానికి మీ ఆదాయంలో కొంత వెచ్చించాల్సిందే.

couple finance management

పెళ్లి తర్వాత ఇరువురు సంపాదిస్తున్నట్లయితే.. ఇద్దరి ఆదాయాల్ని కలపాలా? లేక ఎవరికి వారే వారి వారి ఆర్థిక నిర్వహణ కొనసాగించాలా? ముందే చర్చించుకోవాలి. ఇంటి బాధ్యతల్ని పంచుకోవాలి. కలిసే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఒకరికొకరు నామినీలుగా ఉండాలి. సాధారణంగా భార్య సంపాదనను ఇంటి ఖర్చులకు.. భర్త ఆదాయాన్ని పెట్టుబడులను కేటాయిస్తుంటారు. ఇది సరైన నిర్ణయం కాదని నిపుణుల భావన. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇరువురు విడిపోవాల్సి వస్తే.. భార్యకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.

ఆర్థిక లక్ష్యాలు..

ఇరువురు కలిసి జీవితాన్ని ఎలా ముందుకు నడపాలో ముందే నిర్ణయించుకోవాలి. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. పిల్లలు, వారి చదువులు, రిటైర్‌మెంట్‌ వంటి వాటి విషయంలో ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లాలి. అందుకు అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇళ్లు, కారు వాటి రుణాలు ఇలా ప్రతి విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకొని తర్వాత ఇబ్బంది పడొద్దు.

పెళ్లి తర్వాత.‌..

పెళ్లి అయిన తర్వాత పాన్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా.. వంటి వివరాల్ని అప్‌డేట్‌ చేసుకోవాలి. చిరునామా మార్పించడం, అవసరమైతే నామినీలు అప్‌డేట్‌ చేయించాలి. వీలైతే ఇరువురి మధ్య ఓ జాయింట్‌ ఖాతా ఉంటే ఇంకా మంచిది. అలాగే ఇరువురు కలిసి కుటుంబ ఆరోగ్య బీమాతో పాటు వ్యక్తిగతంగా అవధి బీమా, జీవిత బీమా కూడా ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.