ETV Bharat / business

ఒక్కరోజులో కిలో ఉల్లిపై రూ.10 తగ్గుదల

author img

By

Published : Oct 25, 2020, 8:50 PM IST

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశంలోని ప్రధాన హోల్​సేల్​ మార్కెట్లలో ఒక్కరోజులోనే కిలో ఉల్లి రూ.10 తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా మార్కెట్లకు రోజువారీ సరఫరా కూడా పెరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Onion prices drop After govt action against hoarding
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి ధరలు

దేశంలోని ప్రధాన హోల్​సేల్ మార్కెటలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. దిల్లీ, ముంబయి, చెన్నైలలో శనివారంతో పోలిస్తే.. ఉల్లి రేటు ఒక్క రోజులోనే కిలోకు రూ.10 వరకు తగ్గింది. ధరల నియంత్రణలో భాగంగా వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై కేంద్రం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ఉల్లి లభ్యత పెరిగి.. ధరలు తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఒక్క రోజులో ధరల తగ్గుదల ఇలా..

ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన.. మహారాష్ట్రలోని లసల్​గావ్​లో కిలో ఉల్లిపాయల రేటు ఒక్కరోజులో రూ.5 తగ్గింది. ఫలితంగా ధర రూ.51కి దిగొచ్చింది. ఇతర ప్రధాన మార్కెట్లయిన చెన్నైలో.. ఉల్లి హోల్​ సేల్ ధర కిలో రూ.66కి చేరింది. అక్టోబర్​ 24న ఇక్కడ కిలో ధర రూ.76గా ఉండేది.

ముంబయి, బెంగళూరు, బోపాల్ మార్కెట్లలోనూ కిలో ఉల్లి ధర రూ.5 నుంచి రూ.6 తగ్గి.. వరుసగా రూ.70, రూ.64, రూ.40కి చేరింది.

భారీగా పెరిగిన సరఫరా

ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన దిల్లీలోని ఆజాద్​పుర్ మండీకి రోజువారీ ఉల్లి సరఫరా 530 టన్నులకు పెరిగింది. ముంబయి మార్కెట్​కు సరఫరా అత్యధికంగా 885 టన్నుల నుంచి 1,560 టన్నులకు చేరింది. చెన్నై మార్కెట్​కు 1,120 టన్నుల నుంచి 1,400 టన్నులకు సరఫరా చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బెంగళూరు మార్కెట్​కు భారీగా 2,500 టన్నుల నుంచి 3 వేల టన్నులు వచ్చాయి.

లఖ్​నవూ, బోపాల్​, అహ్మదాబాద్​, అమృత్​సర్, కోల్​కతా, పుణెలకు ఉల్లి సరఫరా ఇంకా పెరగాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఎల్​టీసీ క్యాష్​ ఓచర్ల​పై ఆర్థిక శాఖ స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.