ETV Bharat / business

క్రిమినల్​ చర్యల నుంచి 'చెక్​బౌన్స్​'కు మినహాయింపు!

author img

By

Published : Jun 10, 2020, 7:09 PM IST

కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం పలు కీలక ప్రతిపాదనలు చేసింది. సులభతర వాణిజ్యానికి ఊతమిచ్చేలా 19 చట్టాల్లోని చెక్​బౌన్స్​ వంటి చిన్నపాటి తప్పిదాలను క్రిమినల్​ చర్యల నుంచి మినహాయించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సలహాలు, అభ్యంతరాలు కోరింది కేంద్ర ఆర్థిక శాఖ.

Finmin
చెక్​ బౌన్స్​

కరోనా సంక్షోభంతో వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. క్రిమినల్​ చర్యల నుంచి చెక్​బౌన్స్​, రుణాల చెల్లింపుల్లో జాప్యం వంటి చిన్నపాటి తప్పిదాలకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. ఇలా మొత్తం 19 చట్టాలను సవరించాలని ప్రతిపాదించింది.

దీర్ఘకాలంలో సులభతర వాణిజ్యం మెరుగుదలకు ఈ సవరణలు ఉపయోగపడుతాయని ఆర్థికశాఖ భావిస్తోంది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి జూన్​ 23లోపు అభ్యంతరాలు తెలపాలని రాష్ట్రాలు, పౌర సమాజాలు, విద్యావేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను కోరింది.

" భారత ప్రభుత్వ లక్ష్యం 'సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​' ను సాధించటంలో ఈ నిర్ణయం కీలకంగా పనిచేస్తుంది. పౌర సమాజం సలహాలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటాం. యథాతథంగానే వదిలేయటం లేదా కొన్ని మార్పులను చేస్తాం. "

- కేంద్ర ఆర్థిక శాఖ

19 చట్టాలు..

ఈ ప్రతిపాదనల్లో చెక్​ బౌన్స్​, బ్యాంకు రుణాల చెల్లింపు, ఎల్​ఐసీ, పీఎఫ్​ఆర్​డీఏ, ఆర్​బీఐ, ఎన్​హెచ్​బీ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, చిట్​ఫండ్, బీమా, చెల్లింపులు- సెటిల్​మెంట్ వ్యవస్థ, నాబార్డ్, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్లు, క్రెడిట్​ ఇన్ఫర్మేషన్ సంస్థలు, ఫ్యాక్టరింగ్ నియంత్రణ​ చట్టాలు ఉన్నాయి.

ఉద్దీపన చర్యల్లో భాగంగా...

గత నెలలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఇందుకు సంబంధించి వివిధ చట్టాల్లోని చిన్నపాటి తప్పిదాల జాబితాను ఆర్థిక సేవల విభాగం రూపొందించింది.

ఉదాహరణకు..

నెగోషబుల్ ఇన్​స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప‌రిధిలోకి చెక్కు బౌన్స్ కేసు వ‌స్తుంది. అలాగే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 లో సెక్షన్ 25 ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఈసీఏస్) కేసులను పరిశీలిస్తుంది.

చెక్కు బౌన్స్ అయినా లేదా ఈసీఏస్ ఫెయిల్ అయినా రెండిటికీ పర్యవసానాలు ఒకేలా ఉంటాయి. పైన తెలిపిన చట్టాల ప్రకారం వీటికి పాల్పడిన వినియోగదారుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. దీనికి శిక్షగా అతనికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం లేదా చెక్కు బౌన్స్ అయిన మొత్తానికి రెండింతలు ఎక్కువగా జరిమానా విధిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో రెండింటిని వేసే అవ‌కాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.