ETV Bharat / business

పెట్రోల్​పై పన్నులతో ఖజానా ఫుల్- రాబడి 79 శాతం జంప్!

author img

By

Published : Oct 31, 2021, 12:44 PM IST

పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్రం భారీగా ఆదాయం (Excise duty collection) ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 33 శాతం, కొవిడ్​ పూర్వ స్థాయితో పోలిస్తే 79 శాతం 'ఎక్సైజ్' రాబడి (Petrol Excise Duty 2021) పెరిగింది. 2021 ఏప్రిల్-సెప్టెంబర్​ మధ్య ఏకంగా రూ.1.71 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

PETROL EXCISE
పెట్రోల్ పన్నుల ఆదాయం

పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీ (Petrol Excise Duty 2021) ద్వారా కేంద్ర ప్రభుత్వ రాబడి భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఈ ఆదాయం (Excise duty collection) 33 శాతం అధికమైందని అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. కొవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే రాబడి 79 శాతం ఎక్కువ అని తేలింది.

2021 ఏప్రిల్-సెప్టెంబర్​ మధ్య రూ.1.71 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన 'కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్' గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1.28 లక్షల కోట్ల రాబడి వచ్చినట్లు తెలిపాయి. 2019 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఈ ఆదాయం రూ.95,930 కోట్లుగా ఉండటం గమనార్హం.

చెల్లింపుల కంటే రాబడే ఎక్కువ

2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ డ్యూటీ రాబడి రూ.3.89 లక్షల కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2.39 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్​టీ ప్రవేశపెట్టిన తర్వాత (Excise Duty is levied on) పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్​లపై మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన వస్తువులన్నీ జీఎస్​టీ పరిధిలోకి వచ్చాయి.

2019-19లో వసూలు చేసిన రూ.2.3 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీలో.. రూ.35,874 కోట్లను రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్రం. 2017-18లో రూ.2.58 లక్షల కోట్ల ఆదాయం రాగా.. అందులో రూ.71,759 కోట్లు రాష్ట్రాలకు వెళ్లడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం.. ఆయిల్ బాండ్లపై ఏడాదికి ప్రభుత్వం చెల్లించాల్సిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల పెట్రోల్, డీజిల్​కు గిరాకీ పెరిగి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఎక్సైజ్ డ్యూటీ ఆదాయంలో పెరుగుదల రూ. లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

బాండ్లపై చెల్లింపులు బాకీ..

యూపీఏ హయాంలో రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను జారీ చేసింది. సబ్సిడీపై వంట గ్యాస్, కిరోసిన్, డీజిల్​ను విక్రయించేందుకు ఈ బాండ్లను ప్రభుత్వ ఆయిల్ పంపిణీ సంస్థలకు కేటాయించింది. అందులో రూ.3,500 కోట్ల అసలు కింద కేంద్రం చెల్లించింది. ఇంకా చెల్లించాల్సింది రూ.1.3 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇది వరకే పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఇక 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఇంధన ధరల వల్ల సామాన్యులపై భారం పడుతుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో.. ఆయిల్ బాండ్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇటీవల పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే.. బాండ్లపై చేసే చెల్లింపులతో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా ఎక్సైజ్ ఆదాయం లభిస్తుండటం గమనించాల్సిన విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.