ETV Bharat / business

కేంద్రం ఊరట.. ఆ పనులకు గడువు పొడిగింపు

author img

By

Published : Jun 25, 2020, 1:43 PM IST

Updated : Jun 25, 2020, 3:01 PM IST

deadline extended for returns
పన్ను రిటర్నుకు గడువు పెంపు

ఆలస్యంగా ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్​) దాఖలు, పన్ను ఆదా పెట్టుబడులు సహా పలు ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలకు గడవు పెంచింది కేంద్రం. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీల వివరాలు, వేటివేటికి గడువు పొడిగించారనే విషయాలు మీ కోసం..

దేశంలో ప్రతి ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను ఆదా పెట్టుబడులు సహా, ఆదాయపన్ను రిటర్ను (ఐటీఆర్​) ఆలస్యంగా దాఖలు చేసేందుకు ఇదే చివరి తేది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో ఈ గడువును తొలుత జూన్​ 30 వరకు పొడిగించింది కేంద్రం. ఇందుకు మరో ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో మరోమారు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కొత్త తేదీలు ఇవి..

1. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన (2019-20 మదింపు సంవత్సరం) ప్రాథమిక, సవరించిన ఆలస్య ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు 2020 జూలై 31 చివరి తేదీ. ఇప్పటికే దాఖలు చేసినవారు ఈ లోపు సవరించుకునేందుకు కుడా అవకాశం ఉంది.

2. 2019-20 ఆర్థిక సంవత్సరం(2020-21 మదింపు సంవత్సరం) ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు 2020 జూలై 31 వరకు ఉన్న గడువును.. నవంబర్ 30 వరకు పొడిగించింది కేంద్రం. ఆడిట్ నివేదికలు సమర్పించేందుకు అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది.

3. దిగువ, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులు (రూ.లక్ష లోపు లయబిలిటీ ఉన్నవారికి) స్వీయ మదింపు పన్ను చెల్లించేందుకు నవంబర్ 30 వరకు గడవు పెంచింది. లయబిలిటీలు రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉన్న వారి స్వీయ మదింపు పన్ను చెల్లింపులకు గడువు పెంపు లేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)

4. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమర్పించేందుకు 2020 జూన్ 30గా ఉన్న గడువును జులై 31 వరకు పెంచింది. జూలై 31లోపు పన్ను ఆదా పథకాల్లో (ఎల్​ఐసీ, పీపీఎఫ్, ఎన్​ఎస్​ఈ, వంటివి) పెట్టుబడి పెట్టి.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

5. వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్ను, వ్యాపారాలు, ఆడిట్​ అవసరమున్న వ్యక్తిగత పన్ను రిటర్నుదారులు, కంపెనీల రిటర్నులు దాఖలు చేసేందుకు నవంబర్ 30 వరకు గడువు పొడిగించింది సీబీడీటీ.

6. పాన్‌కార్డ్​ను ఆధార్‌తో అనుసంధానించుకోవడాన్ని ఇది వరకే తప్పనిసరి చేసింది ఆదాయ పన్ను విభాగం(ఐటీ). ఇందుకు ఇప్పటికే చాలా సార్లు గడవు పెంచాగా.. కొవిడ్​ నేపథ్యంలో ఇటీవల జూన్​ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ గడువును పెంచింది. ఈ లోపు పాన్​-ఆధార్​ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.

'వివాద్​ సే విశ్వాస్​'కు పెంపులేదు..

వివాద్​ సే విశ్వాస్​ పథకం ద్వారా.. పన్నుల వివాదం పరిష్కారానికి విధించిన చివరి తేదీలో ఎలాంటి మార్పులు ఉండబోవని సీబీడీటీ స్పష్టం చేసింది. ఎలాంటి అదనపు మొత్తాలు లేకుండా చెల్లింపులు చేసేందుకు 2020 డిసెంబర్​ 31ని చివరి తేదీగా నిర్ణయిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: సరికొత్త రూటులో సైబర్​ నేరాలు

Last Updated :Jun 25, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.