ETV Bharat / business

'ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే రుణ బాధ్యతలు'

author img

By

Published : Mar 26, 2021, 2:01 PM IST

రాష్ట్ర ద్రవ్య లోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు... 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ... ప్రాథమిక వ్యయాన్నిభరించే స్థాయిలో అప్పులు మినహా... ఇతర రాబడి లేదని కాగ్ వ్యాఖ్యానించింది. అంచనాలకు వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధీకరించాలని సూచించింది. వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం... విద్య, రవాణా, క్రీడలు, కళలకు ఖర్చును తగ్గిస్తోందని అభిప్రాయపడింది. సాగు నీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ... వాటి ఆర్థిక ఫలితాలను ప్రభుత్వం వెల్లడించలేదని పేర్కొంది.

cag report on telangana financial status
cag report on telangana financial status

2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్​ నివేదిక ఇచ్చింది. రెవన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలో మెరుగైందని... జీఎస్డీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. అంతకుముందుతో పోల్చినా... జీఎస్టీడీపీతో పోల్చినా... క్యాపిటల్ వ్యయం తగ్గిందంది. తప్పు వర్గీకరణ, నిధుల జమ లేకపోవటం వలన రూ. 9481 కోట్ల రెవెన్యూ మిగులును ఎక్కువగా, 217 కోట్ల ద్రవ్య లోటును తగ్గించి చూపారని తెలిపింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25 శాతం కన్నా ద్రవ్య లోటు... జీఎస్డీపీలో తక్కువగానే 3.11 శాతం ఉందని పేర్కొంది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కన్నా తక్కువగానే 22.75 శాతం ఉందని తెలిపింది. ప్రాథమిక లోటు గతేడాదితో పోలిస్తే 9 శాతం తగ్గినప్పటికీ... ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు కానీ, ఇతర ఆదాయం లేదు.

పన్ను వసూళ్లలో పెరుగుదల...

రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చులు, క్యాపిటల్ వ్యయం.... బడ్జెట్ అంచనాలకు వాస్తవాలకు మధ్య 20 శాతానికి పైగా వ్యత్యాసం ఉందని, వ్యత్యాసాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధీకరించాలని తెలిపింది. వాహనాల మీద పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ ఫీజులు, వసూళ్లలో సమర్థత స్థిరంగా ఉండగా... అమ్మకాలు, వర్తకాలపై పన్ను, జీఎస్టీ పన్ను, ఆబ్కారీ పన్ను వసూళ్లలో పెరుగుదుల ఉందని తెలిపింది. రెవెన్యూ ఖర్చులలో తప్పనిసరి ఖర్చుల భారం కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నా... 2017-18తో పోలిస్తే 2018-19లో ఆరు శాతానికి తగ్గిందని తెలిపింది. వడ్డీ చెల్లింపులు, రాయితీలు, వేతనాలు పెరిగాయన్న కాగ్... గత కొన్నేళ్లుగా బహిరంగ రుణాలపై ప్రభుత్వ ఆధికంగా ఆధారపడటం వల్ల చెల్లింపుల బాధ్యతలు పెరిగాయని తెలిపింది.

సాగుకే సింహభాగం...

రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అభివృద్ధి వ్యయం, మూలధన వ్యయం మీద దృష్టి సారించిందని... అయితే గత కొన్నేళ్లుగా విద్యా రంగం మీద ప్రభుత్వ దృష్టి తులనాత్మకంగా, తక్కువగా ఉందని పేర్కొంది. రైతు బంధుతో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం దక్కిందని, వైద్యారోగ్య రంగాల మీద తలసరి ఖర్చులో గణనీయమైన పెరుగుదల ఉందని.. ఇదే సమయంలో రవాణా, విద్య, క్రీడలు, కళల విషయంలో తలసరి ఖర్చు భారీగా తగ్గిందని పేర్కొంది. మూలధన ప్రాజెక్టుల మీద 2014-19 మధ్య కాలంలో రూ.లక్షా 18 వందల 77 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. అందులో సింహ భాగం నీటి పారుదలకే ఖర్చు చేసిందని తెలిపింది. ప్రాజెక్టుల పూర్తిలో జాప్యం వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోగా... ఆర్థిక అభివృద్ధి కూడా జరగలేదని తెలిపింది. నిర్మాణంలో ఉన్న 26 ప్రాజెక్టులకు గానూ... 20 ప్రాజెక్టులు 3 నెలల నుంచి 11 ఏళ్ల పాటు ఆలస్యం అయ్యాయని తెలిపింది. ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం రూ. లక్షా 87 వేస 848 కోట్లకు పెరిగిందని... ఇప్పటివరకు రూ.100494 కోట్లు ఈ ప్రాజెక్టులపై ఖర్చుచేసినా... ఇవి ఇంకా పూర్తి కాలేదని తెలిపింది. ఏ సాగు నీటి ప్రాజెక్టులు ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ వ్యాఖ్యానించింది.

చేబదుల్ల మీదే...

వివిధ స్వయం పాలక సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు తీర్చే రాబడి మార్గాలు లేకున్నా... రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చిందని కాగ్ ఆక్షేపించింది. హైదరాబాద్ జలమండలి 2010-11 నుంచి వార్షిక పద్దులను ఖరారు చేయకపోయినా... ప్రభుత్వం ఆ సంస్థకు రూ.5932 కోట్లను రుణంగా ఇచ్చిందని కాగ్ తెలిపింది. రుణాలు 2018-19లో 7807 కోట్ల రుణాలు తిరిగి వసూలు అవుతాయని అంచనా వేస్తే.. అందులో కేవలం 66 కోట్లు మాత్రమే వసూలయ్యాయని తెలిపింది. రిజర్వు బ్యాంకు వద్ద రోజు వారీగా ఉండాల్సిన కనీస నగదు నిల్వ రూ.1.38 కోట్లను ఏడాదిలో 197 రోజులు మాత్రమే నిర్వహించగలిగిందని తెలిపింది. ప్రభుత్వం చేబదుల్ల మీద ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే చేబదుల్ల మీద చెల్లించిన వడ్డీ 12 శాతం పెరిగిందని పేర్కొంది.

రాబడిని హరిస్తోన్న వడ్డీలు...

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, జీఎస్డీపీ వృద్ధి రేటు కన్నా వేగంగా పెరిగాయని... ఫలితంగా వడ్డీ చెల్లింపులు రెవెన్యూ రాబడిని హరించడం క్రమంగా పెరుగుతోందని వ్యాఖ్యానించింది. రెవెన్యూ రాబడితో పోలిస్తే... వడ్డీ చెల్లింపులు 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.37 శాతాని కన్నా చాలా ఎక్కువగా 12.41 శాతంగా ఉందని తెలిపింది. వాస్తవిక వృద్ధి రేటు నుంచి వాస్తవిక వడ్డీ రేటును తీసివేయగా... వచ్చే డోమర్ అంతరం సానుకూలంగానే ఉందని... అయితే ఈ అంతరం క్రమంగా తగ్గుతోందని కాగ్ అభిప్రాయపడింది. 2019 మార్చి నాటి ప్రకారం ప్రభుత్వ అప్పులలో 46 శాతం... 76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉంది. ఐదేళ్లు దాటిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య క్యాపిటల్ పద్దులలో ఉన్న 1,51,349 కోట్లతో పాటు ఇతర పద్దులు, డిపాజిట్లు, జమల్లో ఉన్న వివిధ నిధుల పంపకం ఇంకా జరగాల్సి ఉందని తెలిపింది.

పలు శాఖల అసమర్థత...

శాసనసభ ఆమోదం లేకుండా... 2014-15 నుంచి 2017-18 మధ్య 55,517 కోట్ల అధిక ఖర్చు చేసిందని.. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్ సిఫారసు చేసింది. గ్రాంట్ల కింద ఆయా శాఖల్లో పదే పదే మిగుళ్లు ఏర్పడుతున్నాయని తద్వారా ప్రభుత్వ నుంచి ఆయా శాఖలకు తగిన ప్రాధాన్యం అందకపోవటం, అమలులో ఆయా శాఖల అసమర్థతను సూచిస్తున్నాయని కాగ్ తెలిపింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల విషయంలో 75 ఖాతాల్లో ఖర్చు లేకపోగా... 40 ఖాతాల్లో రాబడి, 12 ఖాతాల్లో నిల్వ లేదని.. వినియోగంలో లేని ఖాతాలను మూసివేసేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కాగ్​ సూచించింది.

ఇదీ చూడండి: 'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.